సాహసమే అతడి ఊపిరి!

ABN , First Publish Date - 2021-03-15T02:32:01+05:30 IST

సంచలనాలు సృష్టించాలన్నా, చరిత్ర లిఖించాలన్నా గుండెల్లో దమ్ముండాలి... సాహసమే ఊపిరిగా సాగాలి. కొత్త దారిలో పోయేందుకు ఉత్సాహం ఉరకలెత్తాలి. అలాంటి వ్యక్తే ‘ఎలన్‌ మస్క్‌’. అతను తీసు

సాహసమే అతడి ఊపిరి!

సంచలనాలు సృష్టించాలన్నా, చరిత్ర లిఖించాలన్నా గుండెల్లో దమ్ముండాలి... సాహసమే ఊపిరిగా సాగాలి. కొత్త దారిలో పోయేందుకు ఉత్సాహం ఉరకలెత్తాలి. అలాంటి వ్యక్తే ‘ఎలన్‌ మస్క్‌’. అతను తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు, చేరే తీరాలు అన్నీ సరికొత్తవే. ఒక్క ట్వీట్‌తో లక్షల కోట్లు పోగొట్టుకోగలడు, అదే ఒక్క ట్వీట్‌తో రాబట్టుకోగలడు కూడా. అతని సాహసమే... విజయానికి మొదటి మెట్టు. అలాంటి సాహసోపేతమైన ఆలోచనలు, ప్రయత్నాలెన్నో మస్క్‌ జీవితంలో.


పన్నెండేళ్లకే...

అమెరికాను ఆవాసంగా చేసుకుని ప్రపంచాన్ని ఏలేస్తున్న మస్క్‌ పుట్టింది దక్షిణాఫ్రికాలో. చదువు కోసం అమెరికా వచ్చి అక్కడే స్థిరపడిపోయాడు. పన్నెండేళ్ల వయసులోనే ‘బ్లాస్టర్‌’ అనే వీడియో గేమ్‌ను తయారుచేసి దాన్ని 500 డాలర్లకు అమ్మాడు. అదే అతడి తొలి విజయం. 


స్పేస్‌ఎక్స్‌ 

రాకెట్లు ఇతర దేశాల దగ్గర కొనడం కంటే తయారుచేయడమే సులువని భావించాడు మస్క్‌. అందుకోసం 2002లో ‘స్పేస్‌ఎక్స్‌’ను స్థాపించి రాకెట్ల తయారీ ప్రారంభించాడు. అతడిని చూసి నవ్వని నోరు లేదు. ఆరేళ్లపాటు వైఫల్యాలే వెంటాడాయి. పైగా ఆర్థికంగా భారీగా దెబ్బపడింది. అయినా వెనకడుగు వేయలేదు. 2008లో స్పేస్‌ఎక్స్‌లో తయారైన రాకెట్‌ విజయవంతంగా భూకక్ష్యను చేరింది. వెంటనే నాసా... మస్క్‌కు అండగా నిలిచి కోట్ల డాలర్లను పెట్టుబడిగా అందించింది.


మెదడులో చిప్‌

బ్రెయిన్‌లో చిప్‌ అనగానే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా గుర్తొస్తుంది. అదే నిజం చేయాలని తలచాడు మస్క్‌. ఇప్పటికే కోతి, పంది మెదడులో చిప్‌ను ప్రవేశపెట్టాడు. భవిష్యత్తులో మనిషి మెదడులో చిప్‌ను పెట్టి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో అల్జీమర్స్‌, వెన్నెముక సమస్యలను పరిష్కరించాలన్నది మస్క్‌ ప్లాన్‌. అంతా మస్క్‌ అనుకున్నట్టే జరిగితే మానవాళికి పెద్ద వరమే అవుతుంది. 


టెస్లా విద్యుత్‌ కారు

మస్క్‌ జీవితాన్ని మలుపు తిప్పిన ఆలోచన ఇది. 2003లో కార్ల వ్యయాన్ని తగ్గించాలన్న భావనతో విద్యుత్‌ కార్లు తయారుచేయాలనుకున్నాడు. అతని ఆలోచనలకు ప్రతి రూపమే ‘టెస్లా విద్యుత్‌ కార్ల తయారీ సంస’్థ. ఆ కార్ల తయారీలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు. తన దగ్గర ఉన్నదంతా పెట్టుబడిగా పెట్టాడు. ఫలితం... తొలి కారు ‘రోడ్‌స్టర్‌’ హిట్‌ కొట్టి  కోట్లు తెచ్చి పెట్టింది. 


మార్స్‌ ఓయాసిస్‌

ఎప్పటికైనా అంగారకుడిపైకి మానవాళిని చేర్చాలన్నది మస్క్‌ ఆలోచన. అందుకోసమే 2001లో ‘మార్స్‌ ఓయాసిస్‌’ పేరుతో ఓ ప్రాజెక్టును ప్రారంభించాడు. ఇందులో భాగంగా మనుషులకు బతకడానికి వీలుగా అంగారకుడిపై గ్రీన్‌హౌస్‌ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు ఇది. దానికి అవసరమైన రాకెట్ల కోసం రష్యా వెళ్లి భంగపడ్డాడు. సొంతంగా రాకెట్లు తయారుచేయాలని భావించి ‘స్పేస్‌ ఎక్స్‌’కు ఊపిరిపోశాడు. 


హైపర్‌లూప్‌

ఇదో కొత్తరకం రవాణా వ్యవస్థ. ఇది కూడా మస్క్‌ మానసపుత్రికే. 2013 నుంచి ఈ వ్యవస్థపై పనిచేస్తున్నట్టు ప్రకటించాడు మస్క్‌. హైపర్‌లూప్‌ ప్రాజెక్టు విజయవంతం అయితే గంటకు 965 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయచ్చు. ఇందుకోసం భూమిపైనే పైపుల్లాంటి వాటిలో ఈ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అందులో శూన్యవాతావరణాన్ని కల్పిస్తారు. ఆ పైపుల్లో వ్యానులాంటి వాహనాల్లో మనుషులను రవాణా చేస్తారు. శూన్యవాతావరణం కాబట్టి వేగం గంటకు 1300 కి.మీటర్ల దాకా అందుకోవచ్చు. ఇదే కనుక విజయవంతం అయితే హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి కేవలం గంటలో వెళ్లిపోవచ్చు. 


Updated Date - 2021-03-15T02:32:01+05:30 IST