Omicron విజృంభణ వేళ.. శుభవార్త చెప్పిన బ్రిటన్
ABN , First Publish Date - 2021-12-09T12:54:21+05:30 IST
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కలకలం సృష్టిస్తున్న వేళ.. బ్రిటన్‌కు చెందిన గ్లాక్సో స్మిత్ క్లైన్ (జీఎ్‌సకే) కంపెనీ ఒక శుభవార్త చెప్పింది.

ఒమైక్రాన్‌కు చెక్ పెట్టే ఔషధం
‘సొట్రోవిమాబ్’ ఇంజెక్షన్ ఒక్క డోసుతో ఇన్ఫెక్షన్ మూడురెట్లు డౌన్
కరోనా కొత్త వేరియంట్‌లోని 37 ఉత్పరివర్తనాల పనిపట్టే సామర్థ్యం
మరణాల ముప్పు నుంచీ 79 % రక్షణ
వాషింగ్టన్, డిసెంబరు 8: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కలకలం సృష్టిస్తున్న వేళ.. బ్రిటన్‌కు చెందిన గ్లాక్సో స్మిత్ క్లైన్ (జీఎ్‌సకే) కంపెనీ ఒక శుభవార్త చెప్పింది. తాము అభివృద్ధిచేసిన కొవిడ్ యాంటీబాడీ ఔషధం ‘సొట్రోవిమాబ్’ ఒమైక్రాన్ వేరియంట్‌లోని అన్ని ఉత్పరివర్తనాల (మ్యుటేషన్ల)పైనా సమర్ధంగా పనిచేస్తోందని వెల్లడించింది. ఒమైక్రాన్ తరహా ఉత్పరివర్తనాలతో రూపొందించిన ఒక సూడో వైర్‌సపై ల్యాబ్‌లో నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో ఈవిషయాన్ని గుర్తించినట్లు తెలిపింది. కొత్త వేరియంట్‌లోని స్పైక్ ప్రొటీన్‌లో ఇప్పటివరకు గుర్తించిన మొత్తం 37 మ్యుటేషన్లపైనా ‘సొట్రోవిమాబ్’ యాంటీబాడీ ఇంజెక్షన్ ప్రభావవంతంగా పనిచేసిందని పేర్కొంది. దీన్ని అమెరికాకు చెందిన విర్ బయోటెక్నాలజీ, కెనడాకు చెందిన మెడికాగో కంపెనీల సంయుక్త భాగస్వామ్యంలో జీఎ్‌సకే అభివృద్ధిచేసింది. ఒమైక్రాన్‌పై ఈ ఔషధం పనిచేస్తోందనే వార్తల నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్లలో మూడు కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ఒమైక్రాన్ ఇన్ఫెక్షన్ సోకిన వెంటనే ఈ యాంటీబాడీ ఇంజెక్షన్ ఒక్క డోసును తీసుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని, తద్వారా కొవిడ్ ఇన్ఫెక్షన్ మూడు రెట్లు తగ్గిపోతుందని ట్రయల్స్‌లో నిర్ధారణ అయినట్లు విర్ బయోటెక్ సీఈవో జార్జ్ స్కాంగోస్ చెప్పారు.
తేలికపాటి నుంచి మోస్తరు కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకిన వారికి మరణాల ముప్పు, ఆస్పత్రి పాలయ్యే దుస్థితి నుంచి కూడా ‘సొట్రోవిమాబ్’ 79 శాతం మేర రక్షణ కల్పిస్తుందని వివరించారు. చాలా ధనిక దేశాలు ‘సొట్రోవిమాబ్’ యాంటీబాడీ ఇంజెక్షన్ కోసం జీఎస్‌కే కంపెనీకి ముందస్తుగా ఆర్డర్లు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయి. దాదాపు 75వేల ఇంజెక్షన్ డోసులు ఇలా ముందస్తుగా రిజర్వ్ అయ్యాయని, ఆ ఆర్డర్ల మొత్తం విలువ ఇంచుమించు రూ.11వేల కోట్లు (1.5 బిలియన్ డాలర్లు) ఉండొచ్చనే అంచనాలు వెలువడు తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ‘సొట్రో విమాబ్’ ఇంజెక్షన్ డోసు (500 ఎంజీ) ధర 2100 డాలర్లు (రూ.1.50 లక్షలు)గా ఉంది. భవిష్యత్తులో దీని ఉత్పత్తి పెరిగితే ధర దిగొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఒమైక్రాన్ కరోనా వేరియంట్‌లో కొత్త ఉపవర్గాన్ని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో కొవిడ్ నిర్ధారణ అయిన ఓ వ్యక్తి శాంపిల్‌లో గుర్తించారు. అతడు ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు వెల్లడించారు.