అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటా.. స్కూల్‌లో కాల్పులకు తెగబడిన విద్యార్థి!

ABN , First Publish Date - 2021-10-07T15:02:03+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి.

అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటా.. స్కూల్‌లో కాల్పులకు తెగబడిన విద్యార్థి!

టెక్సాస్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని ఓ స్కూల్‌లో విద్యార్థి జరిపిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అర్లింగ్టన్ అసిస్టెంట్ పోలీస్ చీఫ్ కేవిన్ కోల్బై తెలిపిన వివరాల ప్రకారం.. డల్లాస్ పరిధిలోని అర్లింగ్టన్‌లో ఉన్న టింబర్‌వ్యూ హై స్కూల్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. తిమోతీ జార్జ్ సింప్కిన్స్(18) అనే విద్యార్థి తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. తోటి విద్యార్థులతో ఘర్షణ నేపథ్యంలోనే తిమోతీ కాల్పులకు దిగినట్లు సమాచారం. 


ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దిరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ చీఫ్ వెల్లడించారు. కాల్పులు జరిపిన తిమోతీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. 1,900 మంది విద్యార్థులు చదువుతున్న టింబర్‌వ్యూ పాఠశాలలో ఈ ఘటన వల్ల బుధవారం భయంకర వాతావరణం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఇక అమెరికాలోని పాఠశాలల్లో కాల్పుల ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. 2018లో 29 స్కూల్స్‌లో కాల్పులు జరిగితే.. 2019లో 27 పాఠశాలల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. 

Updated Date - 2021-10-07T15:02:03+05:30 IST