13 ఏళ్లకే పెళ్లి.. భర్తతో సహా అమెరికాకు.. తనలా వేరొకరు ఇబ్బందులు పడకూడదని..

ABN , First Publish Date - 2021-08-25T05:55:17+05:30 IST

పాకిస్తాన్‌లో తన కజిన్ పెళ్లికి వెళ్లిందామె. అప్పుడే 8 ఏళ్ల వయసులోనే తనకు తారిక్ అనే బంధువులబ్బాయితో ఎంగేజ్‌మెంట్ జరిగిందని తెలిసింది. ఇది జరిగిన ఐదేళ్లకు అంటే 13 సంవత్సరాల వయసులో నైలా

13 ఏళ్లకే పెళ్లి.. భర్తతో సహా అమెరికాకు.. తనలా వేరొకరు ఇబ్బందులు పడకూడదని..

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్తాన్‌లో తన కజిన్ పెళ్లికి వెళ్లిందామె. అప్పుడే 8 ఏళ్ల వయసులోనే తనకు తారిక్ అనే బంధువులబ్బాయితో ఎంగేజ్‌మెంట్ జరిగిందని తెలిసింది. ఇది జరిగిన ఐదేళ్లకు అంటే 13 సంవత్సరాల వయసులో నైలా అమిన్‌కు నికా చేసేశారు. అప్పటికి ఆమె పెళ్లి చేసుకున్న అబ్బాయి వయసు 21. పెళ్లి జరిగిన తర్వాత చాలా కాలం వరకూ తనపై అత్యాచారం జరుగుతుందని, దెబ్బలు తినక తప్పదని అనుకుంటూ భయంభయంగానే బతికింది. ఆ తర్వాత పెళ్లిని లీగలైజ్ చేయడానికి ఆమె తండ్రి ప్రయత్నాలు ప్రారంభించాడు. అదే సమయంలో ఆ బాలికను పెళ్లాడిన తారిక్‌కు అమెరికా వీసా కోసం కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఏడాదికి అమెరికా తిరిగొచ్చిన నైలా.. ఇక్కడ ఒక వ్యక్తితో స్నేహం చేసింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను చావబాదారు. ఆ సమయంలో చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీస్‌కకు చెందిన అధికారులు నైలాను రక్షించారు. అయితే ఆ తర్వాత 15 ఏళ్లు రాగానే శోభనం చేసుకొని, పెళ్లిని కన్ఫర్మ్ చేసుకోవడానికి నైలాను మళ్లీ పాకిస్తాన్‌కు పంపించారు.


అప్పటికే అమెరికాలోని ఫాస్టర్ కేర్ విభాగం కింద నైలా ఉండటంతో.. పాక్‌లోని అమెరికన్ ఎంబసీ రంగంలోకి దిగి ఆమెను కాపాడింది. ఆమెను మళ్లీ న్యూయార్క్ పంపించేశారు. దీంతో తారిక్‌తో నైలా బంధం ఆల్‌మోస్ట్ తెగిపోయినట్లే. ఇలా బాల్య వివాహం వల్ల ఎదురయ్యే సమస్యలను స్వయంగా ఎదుర్కొన్న నైలా.. తనలా మరో అమ్మాయి కష్టాలు పడకూడదని భావించి, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. నైలా అమిన్ ఫౌండేషన్ అనే సంస్థ స్థాపించి అమెరికాలోని పలు నగరాల్లో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాలని పోరాడుతోంది. ప్రస్తుతం ఆమెకు 31 సంవత్సరాలు. ఇప్పటికే న్యూజెర్సీ, న్యూయార్క్ నగరాల్లో 18 ఏళ్లు నిండే వరకూ పెళ్లిళ్లు చేయడానికి వీల్లేకుండా చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాలు చేయడంలో నైలా చాలా కీలక పాత్ర పోషించింది. 


న్యూయార్క్‌లో ఈ చట్టానికి ఆమె పేరే పెట్టారంటేనే ఈ విషయంలో ఆమె చేసిన కృషిని అర్థం చేసుకోవచ్చు. నైలాస్ లా కోసం ఆమె చాలా కష్టపడ్డారు. న్యూజెర్సీలో సక్సెస్‌పుల్‌గా చట్టం వచ్చిన తర్వాత ఆమె న్యూయార్క్ వెళ్లింది. అక్కడ ఫిలిప్ రామోస్ అనే నేతను కలిసి తన కథను వివరించి, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా చట్టం చేయాలని కోరింది. దీంతో ఆయన కూడా ఈ విషయంపై పోకస్ పెట్టారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ బిల్లు రికార్డుల్లో మూలనపడే ప్రమాదం ఉన్నట్లు ఆమె గుర్తించింది. ‘‘న్యూయార్క్‌లోని అసెంబ్లీ సభ్యులందరికీ నా కథను వివరిస్తూ ఈమెయిల్స్ చేశాను. 150 మంది వరకూ అసెంబ్లీ సభ్యులకు ఇలా ఈమెయిల్స్ పంపడానికి చాలా రోజులు పట్టింది’’ అని నైలా తెలిపింది.


ఆమె కష్టం ఫలించి ఈ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. దీన్ని అప్పటి న్యూయార్క్ గవర్నర్ క్యూమో ఆఫీసుకు పంపారు. ఈ విషయం తెలిసి ప్రతిరోజూ ఫోన్ చేసి ఈ బిల్లు గురించి అడగటం ప్రారంభించింది. ఆమెకు అన్‌చైన్డ్ ఎట్ లాస్ట్ అనే మరో స్వచ్ఛంద సంస్థ కూడా అండగా నిలిచింది. క్యూమో ఈ బిల్లుపై సంతకం పెట్టేంత వరకూ ప్రతివారం నిరసనలు చేయడం ప్రారంభించారు. చివరకు ‘నైలాస్ చట్టం’పై క్యూమో కూడా సంతకం చేశారు. ‘‘ఈ విషయం తెలిసినప్పుడు సోఫాలో కూర్చొని ఉన్నా. అలా కూర్చొని ఏడ్చేశా. ఎంతలా ఆపుకున్నా కన్నీళ్లు ఆగలేదు’’ అని నైలా గద్గద స్వరంతో చెప్తోంది. ఇప్పటికీ అమెరికాలోని 44 స్టేట్స్‌లో టెక్నికల్‌గా బాల్యవివాహాలు చట్టబద్ధమే. న్యూయార్క్‌లో కూడా మొన్నటి వరకూ వివాహ అర్హత వయసు 14 ఏళ్లే. దీన్ని నైలా పోరాటంతో 18 ఏళ్లకు పెంచారు. తన పోరాటం అప్పుడే ఆగదని అమెరికాలోని మొత్తం 50 స్టేట్స్‌లో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చే వరకూ తాను పోరాడుతూనే ఉంటానని అంటోందీమె.

Updated Date - 2021-08-25T05:55:17+05:30 IST