సౌదీ పురుషులకు పెళ్లి కష్టాలు.. ఆ 4 దేశాల మహిళలను పెళ్లి చేసుకోవద్దంటూ..

ABN , First Publish Date - 2021-03-21T18:59:05+05:30 IST

గల్ఫ్ దేశం సౌదీ అరేబియా తమ దేశంలోని పురుషులను పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్‌కి చెందిన మహిళల్ని పెళ్లి చేసుకోవద్దని వారించినట్లు స్థానిక మీడియా చెబుతోందని ప్రముఖ పాక్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

సౌదీ పురుషులకు పెళ్లి కష్టాలు.. ఆ 4 దేశాల మహిళలను పెళ్లి చేసుకోవద్దంటూ..

రియాద్: గల్ఫ్ దేశం సౌదీ అరేబియా తమ దేశంలోని పురుషులను పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్‌కి చెందిన మహిళల్ని పెళ్లి చేసుకోవద్దని వారించినట్లు స్థానిక మీడియా చెబుతోందని ప్రముఖ పాక్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇకపై సౌదీ పురుషులు విదేశీ మహిళలను పెళ్లి చేసుకోవడం అంత సులువు కాదని పాక్ న్యూస్ ఏజెన్సీ తన కథనంలో పేర్కొంది. దీనికోసం కఠిన నిబంధనలు అమలు చేయనుందట సౌదీ. కాగా, అనాధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం సౌదీలో ఈ నాలుగు దేశాల నుంచి సుమారు 5 లక్షల మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. అయితే, సౌదీ అరేబియాలో విదేశీ మహిళల్ని పెళ్లి చేసుకునేవారి సంఖ్య బాగా పెరిగిందని, ఈ పరిస్థితికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ దేశ పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై ఎవరైనా తప్పనిసరిగా విదేశీ మహిళను పెళ్లి చేసుకోవాలంటే మాత్రం కొన్ని అదనపు నిబంధనలను పాటించాల్సిందేనట. 


విదేశీ మహిళను పరిణయమాడాలనుకునే సౌదీ పురుషులు తప్పనిసరిగా ప్రభుత్వానికి పెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును ప్రభుత్వం పరిశీలించిన తర్వాత దాన్ని ఆమోదించాలో లేదో నిర్ణయిస్తుంది. అలాగే ఎవరైనా విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే 6 నెలల వరకు ఆగాల్సిందేనని మక్కా పోలీసు డైరెక్టర్ మేజర్ జనరల్ అస్సాఫ్ అల్ ఖురేషీ పేర్కొన్నట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇక ఇలా పెళ్లి చేసుకుంటామని దరఖాస్తు చేసుకున్నవారికి మరికొన్ని నిబంధనలు ఉన్నట్లు పేర్కొంది. దరఖాస్తు పెట్టుకునేవారి వయస్సు 25 ఏళ్లకు పైబడి ఉండాలి. దరఖాస్తుపై ముందుగానే స్థానిక జిల్లా మేయర్ సంతకం తప్పనిసరి. అంతేగాక దరఖాస్తుదారుల ఐడీ కార్డులు, ఫ్యామిలీ కార్డు కాపీ వంటివి ఉండాలని ఖురేషీ తెలిపినట్లు న్యూస్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది. ఇలా దేశంలోని పురుషులు విదేశీ మహిళలను వివాహం చేసుకోవాలంటే సౌదీ చాలా పెద్ద తతంగాన్ని రెడీ చేస్తున్నట్లు సమాచారం.   

Updated Date - 2021-03-21T18:59:05+05:30 IST