ప్రవాసులు బీ అలర్ట్.. UAE ప్రైవేట్ సెక్టార్‌ కోసం కొత్త కార్మిక చట్టం

ABN , First Publish Date - 2021-12-15T17:39:37+05:30 IST

ఇటీవల యూఏఈ ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ప్రవాసులు బీ అలర్ట్.. UAE ప్రైవేట్ సెక్టార్‌ కోసం కొత్త కార్మిక చట్టం

ప్రైవేట్ సెక్టార్‌లోని కార్మికులకు సంబంధించి పని గంటలు, సెలవులు, వేతనాల పద్దతుల్లో కీలక మార్పులు

అబుధాబి: ఇటీవల యూఏఈ ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి అనుగుణంగా కార్మికులకు వేతనం, పనివేళలు, సెలవులు, యజమానులు పాటించాల్సిన నిబంధనలు తదితర విషయాలను క్రమబద్ధీకరించింది. తాజాగా యూఏఈ ప్రైవేట్ సెక్టార్‌లో పని నిబంధనలను క్రమబద్ధీకరించేందుకు ఆ దేశ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫెడరల్ డిక్రీ-లా నెం.33 ఫర్ 2021ని జారీ చేశారు. 2022 ఫిబ్రవరి 2 నుండి అమలులోకి వచ్చే ఈ కొత్త డిక్రీ-లా 74 ఆర్టికల్‌లను కలిగి ఉంది. సెలవులు, పని గంటలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సమతుల్యత మరియు ఏకీకరణను సృష్టించడమే లక్ష్యంగా కొత్త డిక్రీ-చట్టాన్ని తీసుకురావడం జరిగింది. యూఏఈ ఉద్యోగులందరి హక్కులు, వేతనాలు, సర్వీస్ ముగింపు గ్రాట్యుటీకి సంబంధించిన ప్రతి విషయం కూలంకషంగా కొత్త డిక్రీ-లాలో పేర్కొనబడ్డాయి. ఇక్కడ ఉద్యోగులు తమ వేతనాలను దిర్హామ్‌లో లేదా లేబర్ కాంట్రాక్ట్‌లో అంగీకరించిన విధంగా మరొక కరెన్సీలో పొందే వెసులుబాటు కల్పించబడింది. 


కొత్త డిక్రీ చట్టంలో చేర్చబడిన అత్యంత ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి..

* యజమాని తన కోసం పని చేయమని లేదా అతని ఇష్టానికి విరుద్ధంగా సేవను అందించడానికి ఉద్యోగిని బలవంతం చేసే ఏ మార్గాలను ఉపయోగించకూడదు. లేదా ఉపయోగించమని బెదిరించకూడదని కొత్త డిక్రీ చట్టం నిర్దేశిస్తుంది.

* పూర్తి సమయ పని విధానంలో ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ పూర్తి చేసిన ఒక ప్రవాస ఉద్యోగి తన సర్వీస్ ముగింపులో ఈ క్రింది విధంగా బేసిక్ పే ప్రకారం గణించబడటానికి ఎండ్-ఆఫ్-సర్వీస్ గ్రాట్యుటీకి అర్హులు: మొదటి ఐదేళ్ల సర్వీస్‌కు 21 రోజులు మరియు అదనంగా ప్రతి సంవత్సరం 30 రోజులు. ప్రస్తుత చట్టం ప్రకారం 3 ఏళ్లు పూర్తి చేయని ఉద్యోగులకు 7 రోజులు, 3 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి 15 రోజులు మరియు 5 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి 21 రోజులలో ఎండ్ ఆఫ్ సర్వీస్ గ్రాట్యుటీని లెక్కించేవారు.

* వ్యాజ్యం, ఎగ్జిక్యూషన్‌కు సంబంధించిన అన్ని దశలలో న్యాయపరమైన రుసుము నుండి కార్మిక కేసులను డిక్రీ మినహాయించింది. ఉద్యోగులు లేదా వారి వారసులు దాఖలు చేసిన లక్ష దిర్హామ్స్(రూ.20.70లక్షలు) కంటే తక్కువ క్లెయిమ్‌లకు కూడా ఇది వర్తిస్తుంది.

* కొత్త డిక్రీ చట్టం ప్రకారం సాధారణ పని గంటలు రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలు మించకూడదు. ఉద్యోగులకు వారానికి కనీసం ఒక రోజు సెలవు ఇవ్వాలి. చట్టంలో పేర్కొన్న విధంగా పని నిషేధించబడిన గంటలు, పని చేసే ఓవర్ టైంతో పాటు సంబంధిత వేతనాలను కూడా నిర్దేశిస్తుంది. అయితే, మార్కెట్ పనితీరు, అవసరాలపై అనువైన పని గంటలను నిర్ణయించే హక్కు సంస్థలకు ఉంది.

* ఉద్యోగిపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, తిట్టడం, శారీరక లేదా మానసిక హింస పూర్తిగా నిషేధించబడింది. అలాగే జాతి, రంగు, లింగం, మతం, జాతి మూలాలతో లేదా సామాజిక మూలాల ఆధారంగా వివక్ష చూపడం కూడా నిషేధించబడింది.

* కొత్త డిక్రీ లాలో పేర్కొన్న విధంగా శ్రామిక మహిళలకు మంజూరు చేయబడిన హక్కులకు ఎటువంటి పక్షపాతం లేకుండా, వివక్ష లేకుండా కార్మికుల ఉపాధిని నియంత్రించే అన్ని నిబంధనలు వారికి వర్తిస్తాయి. వారు ఒకే ఉద్యోగం లేదా మరొక పని చేస్తే పురుషులతో సమానంగా వేతనం పొందుతారు. సమాన పనికి సమాన వేతనం అన్నమాట.

* ఉద్యోగికి సంబంధించిన ధృవ పత్రాలను నిలిపివేయడం, వర్క్ కాంట్రాక్ట్ ముగిసిన వెంటనే దేశం విడిచి వెళ్ళమని బలవంతం చేయడం నిషేధించబడింది. అంటే ఉద్యోగి మరొక పనికి మారవచ్చు మరియు లేబర్ మార్కెట్‌లో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. 

* కార్మిక ఒప్పందాన్ని రద్దు చేసిన సందర్భంలో ఉద్యోగులు ఇతర యజమానుల కోసం పనిచేయడానికి కొత్త డిక్రీ చట్టం అనుమతిస్తుంది. ఇది కార్యనిర్వాహక నిబంధనలలో పేర్కొన్న షరతులు, విధానాలకు అనుగుణంగా ఆరు నెలలకు మించని ప్రొబేషన్ పీరియడ్‌ను కలిగి ఉంటుంది.

* యజమాని బాధ్యతలలో మొదటిది కార్మిక నిబంధనలను ఏర్పాటు చేయడం. కార్మికులకు నివాస గృహాలను ఏర్పాటు చేయడంతో పాటు వారి రక్షణ. అలాగే ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటివి ఉంటాయి.

* ఉద్యోగులకు వారానికి ఒక వేతనంతో కూడిన సెలవు ఇవ్వబడుతుంది. వారి అవసరాలకు అనుగుణంగా మరిన్ని ఇవ్వవచ్చు.

* ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉద్యోగుల నుండి వసూలు చేయకూడని రిక్రూట్‌మెంట్, ఉపాధి రుసుములను యజమానులు భరించాలి.

Updated Date - 2021-12-15T17:39:37+05:30 IST