అమెరికాలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్దమవుతున్న వకీల్‌సాబ్

ABN , First Publish Date - 2021-03-28T16:21:16+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా నెలల పాటు సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత

అమెరికాలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్దమవుతున్న వకీల్‌సాబ్

ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా నెలల పాటు సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 50 శాతం ఆక్యుపెన్సీతో ఇప్పుడు 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు విజయవంతంగా నడుస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు కరోనాను ఏ మాత్రం లెక్కచేయకుండా సినిమా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక్కడే కాదు విదేశాల్లోని తెలుగు వారు కూడా హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న జాతిరత్నాలు చిత్రం అమెరికాలో ఏకంగా మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. అమెరికాలో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. స్టార్ హీరోల చిత్రాలకే కాకుండా చిన్న చిత్రాలు సైతం అమెరికాలో భారీ కలెక్షన్లను సాధిస్తున్నాయి.


లాక్‌డౌన్ తర్వాత ఇప్పటివరకు ఒక్క స్టార్ హీరో చిత్రం కూడా విడుదల కాలేదు. ఏప్రిల్ నుంచి వరుసపెట్టి స్టార్ హీరోల చిత్రాలు విడుదల కానున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఈ సినిమాలను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ తొమ్మిదిన వకీల్ సాబ్ చిత్రంతో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుండటంతో వకీల్ సాబ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. వకీల్‌సాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు కూడా సినిమా ప్రమోషన్ల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నెల 28న వకీల్‌సాబ్ చిత్ర ట్రైలర్‌ విడుదల కానుంది. 


తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ వకీల్‌సాబ్ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. వకీల్‌సాబ్ అమెరికా రైట్స్‌ను వీకెండ్ సినిమా, సదరన్ స్టార్ ఇంటర్నేషనల్ దక్కించుకున్నాయి. అత్యధిక స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. వీకెండ్ సినిమా గతంలో కేజీఎఫ్, కబీర్ సింగ్, సైరా నరసింహరెడ్డి, కేరాఫ్ కంచరపాలెం సినిమాలను అమెరికాలో విడుదల చేసింది. అమెరికాలో వకీల్ సాబ్ చిత్ర ప్రీమియర్లు ఏప్రిల్ 8న పడనున్నాయి. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం కానుంది. పవన్ కల్యాణ్ చివరగా నటించిన అజ్ఞాతవాసి చిత్రం అమెరికాలో 2.06 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించింది.

Updated Date - 2021-03-28T16:21:16+05:30 IST