దుబాయ్ గురుద్వారాలో ఫ్రీ వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-02-06T16:11:57+05:30 IST
యూఏఈలోని జబెల్ అలీలో ఉన్న గురు నానక్ దర్బార్ గురుద్వారాలో ప్రవాసులు, నివాసితుల కోసం మూడు రోజులు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురుద్వారా నిర్వాహకులు వెల్లడించారు.

దుబాయ్: యూఏఈలోని జబెల్ అలీలో ఉన్న గురు నానక్ దర్బార్ గురుద్వారాలో ప్రవాసులు, నివాసితుల కోసం మూడు రోజులు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురుద్వారా నిర్వాహకులు వెల్లడించారు. ఇవాళ్టి నుంచి సోమవారం వరకు(6 నుంచి 8వ తేదీ వరకు) ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. తమ్హౌ హెల్త్ కేర్ ఎల్ఎల్‌సీ వారి ఆధ్వర్యంలో చైనాకు చెందిన కరోనా వ్యాక్సిన్ సీనోఫామ్‌ను ఫ్రీగా ఇస్తామని గురుద్వారా నిర్వాహకులు తెలిపారు. నివాసితులు టీకా కోసం 0506295702 లేదా 0566445961 నెంబర్‌తో వాట్సాప్ ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అపాయింట్‌మెంట్ పొందిన వారు రిజిస్ట్రేషన్ కోసం వారి ఎమిరేట్స్ ఐడీ ఒరిజినల్‌తో పాటు ఓ జిరాక్స్ కాపీ తీసుకువెళ్లాలి.
అలాగే వ్యాక్సిన్ కోసం గురుద్వారాకు వచ్చేవాళ్లు తప్పకుండా ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపారు. 'ఇప్పుడు టీకాలు తీసుకోవడం వల్ల మీతో పాటు మీ చుట్టుపక్కల వారిని రక్షించడంలో సహాయపడుతుంది, మన సిక్కు సమాజంలో ఆదర్శంగా ఉండేందుకు ఇది మీకు ఒక మంచి అవకాశం' అని గురుద్వారా నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఇక మూడు రోజులపాటు జరిగే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా సుమారు 4వేలకు పైగా మంది టీకా తీసుకునే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.