దేశంలోకి అడుగుపెట్టగానే NRI భార్యాభర్తలను అరెస్ట్ చేసిన కేసులో.. ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

ABN , First Publish Date - 2021-08-25T07:52:02+05:30 IST

ఆ ఎన్నారై దంపతులు యూకేలో ఉండేవారు. ఏదో పనిమీద భారత్‌కు వచ్చారు. అలా వచ్చిన వాళ్లు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అలా దిగారో లేదో.. వారిని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

దేశంలోకి అడుగుపెట్టగానే NRI భార్యాభర్తలను అరెస్ట్ చేసిన కేసులో.. ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఎన్నారై డెస్క్: ఆ ఎన్నారై దంపతులు యూకేలో ఉండేవారు. ఏదో పనిమీద భారత్‌కు వచ్చారు. అలా వచ్చిన వాళ్లు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అలా దిగారో లేదో.. వారిని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డగించారు. దీంతో ఆ దంపతులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. వారిని విడుదల చేయాలని విమానాశ్రయ అధికారులను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ వరకూ పిటిషనర్లను అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లొద్దన్న కోర్టు.. అధికారులు వీరిపై ఎలాంటి ఒత్తిడీ చేయొద్దని స్పష్టంచేసింది. వృద్ధులైన ఈ ఎన్నారై దంపతులిద్దరికీ ఒక చీటింగ్ కేసుతో సంబంధం ఉంది. ఈ క్రమంలోనే వీరిపై లుకౌట్ ఆదేశాలున్నాయని, అందుకే వారిని విమానాశ్రయంలో డిటెయిన్ చేశారని సమాచారం.


ఈ దంపతుల తరఫు న్యాయవాది కోర్టుకు ఇదే విషయాన్ని చెప్పారు. ఈ ఎన్నారై దంపతులపై ఎటువంటి కేసూ లేదని చెప్పిన లాయర్.. 2016లో పంజాబీ బాఘ్ పోలీస్ స్టేషన్‌లో ఒక కంపెనీపై చీటింగ్ కేసు నమోదైందని, సదరు కంపెనీతో ఈ దంపతులు కలిసి పనిచేశారని వివరించారు. సదరు కంపెనీపపై చీటింగ్ కేసు నమోదవగా వీరిపై నేరుగా ఎలాంటి కేసులూ లేవని లాయరు తేల్చిచెప్పారు. ఈ కేసు విచారణలో డిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల  విభాగంతో ఈ దంపతులు పూర్తిగా సహకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ వీరిని విమానాశ్రయంలో బంధించారని, కనీసం ఆహారం, నీళ్లు, అవసరమై మెడిసిన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో పిటిషనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని లాయర్ వెల్లడించారు. ఈ వాదనలన్నీ విన్న కోర్టు.. దంపతులను విడుదల చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసి, అప్పటి వరకూ ఎన్నారై దంపతులను అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది.

Updated Date - 2021-08-25T07:52:02+05:30 IST