అనంత ఫలాన్నిచ్చే హజ్ యాత్ర
ABN , First Publish Date - 2021-07-09T13:57:59+05:30 IST
మక్కా నగరంలోని కాబా గృహాన్ని ‘దైవ గృహం’ అంటారు. దాన్ని సందర్శించే యాత్రే ‘హజ్’ లేదా ‘కాబా యాత్ర’. ఇస్లాం ధర్మానికి మూల స్తంభాలైన అయిదు ప్రధాన విధులలో కాబా యాత్ర ఒకటి. స్తోమత కలిగిన వారందరూ జీవితంలో కనీసం ఒకసారైనా కాబా యాత్ర చేయాలి. ఈ విధిని నిర్వహించడం కోసం ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచీ ఎందరో...
మక్కా నగరంలోని కాబా గృహాన్ని ‘దైవ గృహం’ అంటారు. దాన్ని సందర్శించే యాత్రే ‘హజ్’ లేదా ‘కాబా యాత్ర’. ఇస్లాం ధర్మానికి మూల స్తంభాలైన అయిదు ప్రధాన విధులలో కాబా యాత్ర ఒకటి. స్తోమత కలిగిన వారందరూ జీవితంలో కనీసం ఒకసారైనా కాబా యాత్ర చేయాలి. ఈ విధిని నిర్వహించడం కోసం ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచీ ఎందరో ఈ పవిత్ర యాత్ర సాగిస్తారు. దైవ గృహాన్ని సందర్శించి, పునీతులవుతారు. హజ్ విధిని నిర్వర్తించడం వల్ల లభించే సౌభాగ్యాలు, పుణ్యఫలాలు అనిర్వచనీయమైనవి, అనంతమైనవి. ఎవరైతే హజ్ సందర్భంలో ఎలాంటి అశ్లీల విషయాలకూ పాల్పడకుండా... దేవుని పట్ల విధేయతతో మసలుకుంటారో, అతని పాపాలను దేవుడు పూర్తిగా తుడిచేస్తాడు. తల్లి గర్భంలోంచి అప్పుడే అతను జన్మించినంత పవిత్రంగా ఉండేలా ప్రక్షాళన చేస్తాడు. ‘మబ్రూర్ హజ్’ అంటే పూర్తి చిత్తశుద్ధితో, స్పృహతో, నియమ నిబంధనలను అనుసరిస్తూ, ఏ పొరపాట్లకూ తావులేకుండా చేసే హజ్. ‘‘దానికి ప్రతిఫలం స్వర్గం’’ అని దైవ ప్రవక్త మహమ్మద్ పేర్కొన్నారు.
జుల్ హజ్జా మాసంలో చేసే మక్కా యాత్రను ‘హజ్’ అంటారు. హజ్ మాదిరిగా ‘ఉమ్రా’ కూడా ఒక విశేష ఆరాధన. ‘ఉమ్రా’ అంటే హజ్‌తో ప్రమేయం లేకుండా ఎప్పుడైనా చేసే మక్కా యాత్ర. సంవత్సరంలో ఏ నెలలోనైనా, ఏ రోజైనా, హజ్‌కు ముందయినా, తరువాతైనా ఉమ్రా చెయ్యవచ్చని ధర్మవేత్తల్లో అత్యధికుల అభిప్రాయం. ‘‘ఒక వ్యక్తి ఒకసారి ఉమ్రా చేసిన తరువాత మరో సారి ఉమ్రా చేస్తే... ఆ రెండిటి మధ్యా ఆ వ్యక్తి కారణంగా జరిగిన పాపాలన్నీ క్షమాపణకు నోచుకుంటాయి. ప్రధానంగా రంజాన్ మాసంలో చేసిన ఉమ్రాకు లభించే పుణ్యం హజ్‌తో సమానం’’ అని దైవ ప్రవక్త తెలిపారు.
హజ్, ఉమ్రా చేసేవారు దైవానికి అతిథులు. కాబట్టి వారు వేడుకున్నప్పుడు ఆ ప్రార్థనను దైవం స్వీకరిస్తాడు. వారు క్షమాపణ కోరుకున్నప్పుడు. వారి పాపాలను క్షమిస్తాడు. అయితే, స్తోమత ఉండి కూడా హజ్ చెయ్యనివారు శిక్షకు పాత్రులవుతారు. శక్తి, స్తోమత, యుక్తమైన వయసు కలిగిన ప్రతి ముస్లిం పురుషునికీ, మహిళకూ హజ్‌ను విధి (ఫర్జ్)గా నిర్దేశించారు.
ఈ నెల 17న మక్కాలో హజ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. జూలై 22వ తేదీన ముగుస్తాయి. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది కూడా కాబా గృహ సందర్శనకు పరిమిత సంఖ్యలో సౌదీ పౌరులు, సౌదీ ప్రవాసులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. విదేశీయులకు ఈసారి అనుమతి లేదు.
మహమ్మద్ వహీదుద్దీన్