బీజేపీది రైతు వ్యతిరేక విధానం: టీఆర్ఎస్ ఎన్నారై శాఖ కోఆర్డినేటర్ మహేష్ బిగాల
ABN , First Publish Date - 2021-12-10T02:49:54+05:30 IST
తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరైంది కాదంటూ బీజేపీ వైఖరిని మహేశ్ బిగాల ఎండగట్టారు.

అమెరికాలోని న్యూ జెర్సీలో తెరాస ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెరాస ఎన్నారై శాఖ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై పార్లమెంటులో పది రోజులుగా తెరాస ఎంపీలు ఆందోళనలు చేస్తున్నా కేంద్రం స్పందించకుండా, మొండిగా వ్యవహరిస్తున్నదని, కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉన్నదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరైంది కాదంటూ బీజేపీ వైఖరిని ఎండగట్టారు.
రైతుల సమస్యలపై టీఆర్‌ఎస్ ఎంపీలు వరుసగా ఐదోరోజు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేపట్టారన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు కాగితాలు చించివేసి ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారని తెలిపారు. ‘‘రబీలో పూర్తిగా ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుంది. వాతావరణ పరిస్థితుల వల్ల రబీలో రా రైస్ రాదు. రబీ ధాన్యం విరిగిపోయి నూకగా మారుతుంది. రబీ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా మారుస్తాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వహిస్తోంది’’ అని అన్నారు.
కేసిఆర్ ప్రత్యక్షంగా రైతు ధర్నాలో పాల్గొనే కేంద్రాన్ని నిలదీశారని, తెలంగాణ రైతులు పండించిన పంటలో కేంద్రం ఎంత కొంటుందో చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన విషయం గుర్తు చేసారు. ‘‘నల్ల చట్టాలను తెచ్చి ఎంతో మంది రైతుల ప్రాణాలను తీసుకున్నాక మళ్లీ ఆ చట్టాలను వెనక్కు తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం వల్ల రైతుకు నష్టమే తెలంగాణ ప్రజలు చాల ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే రైతుల నుండి బియ్యం సేకరించాలి’’ అని మహేశ్ బిగాల డిమాండ్ చేసారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జే సంతోష్ కుమార్‌కు ఈ కార్యక్రమంలో సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశములో శ్రీనివాస్ గనగోని(సా కన్వీనర్), రవి దన్నపనేని(అడ్వైసర్), భగవాన్ కాండ్ర(కోర్ కమిటీ మెంబెర్) తదితర సభ్యులు పాల్గొన్నారు.
