ఆ రాష్ట్రంలో NRI యూసఫ్ అలీ భారీ పెట్టుబడులు.. భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు

ABN , First Publish Date - 2021-12-30T14:55:32+05:30 IST

యూఏఈకి చెందిన రిటైల్ దిగ్గజం లులు గ్రూపు ఉత్తర ప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది.

ఆ రాష్ట్రంలో NRI యూసఫ్ అలీ భారీ పెట్టుబడులు.. భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు

లక్నో: యూఏఈకి చెందిన రిటైల్ దిగ్గజం లులు గ్రూపు ఉత్తర ప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఏకంగా రూ.500 కోట్లతో గ్రేటర్ నోయిడాలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మించబోతోంది. దీని ద్వారా సుమారు 700 మందికి డైరెక్ట్‌గా ఉపాధి లభిస్తే.. 1500 మంది వరకు ఇన్‌డైరెక్ట్‌గా ఉపాధి పొందుతారని బుధవారం ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ ప్లాంట్ ఏర్పాటు విషయమై బుధవారం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో లులు గ్రూపు అధినేత, ఎన్నారై యూసఫ్ అలీ భేటీ అయ్యారు. దీనిలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు కోసం ఉత్తరప్రదేశ్ సర్కార్ గ్రేటర్ నోయిడాలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. రూ. 500కోట్లతో ఏర్పాటు చేయబోతున్న ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా 1500 మంది వరకు ఉపాధి పొందుతారని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. 


ఇక ఇప్పటికే లులు గ్రూపు లక్నోలోని అమర్ షాహీద్ పాత్‌లో భారీ షాపింగ్ మాల్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.2వేల కోట్లతో ఏర్పాటవుతున్న ఈ భారీ హైపర్‌మార్కెట్ నిర్మాణం ప్రస్తుతం చివరి దశలో ఉంది. 2022 ఏప్రిల్‌ నుంచి ఈ మాల్ అక్కడి ప్రజలకు అందుబాటులోకి రానుంది. 220 నేషనల్, ఇంటర్నెషనల్ బ్రాండ్స్, ఫ్యామిలీ ఎంటర్మైంట్ సెంటర్, 3వేల మంది సామర్థ్యంతో ఫుడ్ కోర్టు అండ్ రెస్టారెంట్, 11 స్క్రీన్స్ పీవీఆర్ సినిమా విత్ 3వేల వాహనాల పార్కింగ్ సౌకర్యం ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ గ్రేట్ మాట్ సొంతం. ఇక ఈ లులు మాల్ వినియోగంలోకి వస్తే ప్రత్యక్షంగా 5వేల మందికి, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభిస్తుందని సమాచారం. ఇప్పటికే లులు గ్రూప్‌కు భారత్‌లోని కొచ్చి, త్రిస్సూర్, త్రివేండ్రం, బెంగళూరు నగరాల్లో పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి.


ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా రూ.2వేల కోట్లతో మాడ్రన్ షాపింగ్ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. 2022 మొదటి త్రైమాసికంలో ఈ షాపింగ్ మాల్ నిర్మాణ పనులు ప్రారంభమై 30 నెలల్లో పూర్తి కానుంది. దీని ద్వారా 5వేల మందికి ఉద్యోగాలు వస్తాయని లులు గ్రూపు స్పష్టం చేసింది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం లులు గ్రూపుకు మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, భారత్, మలేషియా, ఇండోనేషియాలో ఉన్న 220 హైపర్‌మార్కెట్స్, షాపింగ్ మాల్స్ ద్వారా 57వేల మంది ఉపాధి పొందుతున్నారు. గల్ఫ్ దేశాల్లో లులు సంస్థకు భారీగానే బ్రాంచీలు ఉన్నాయి. దీంతో గతేడాది 7.4 బిలియన్ డాలర్ల(రూ.5,51,75,14,00,000) మేర టర్నోవర్‌ను సాధించినట్లు అబుధాబి‌లోని లులు గ్రూప్ ప్రధాన కార్యాలయం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.         


Updated Date - 2021-12-30T14:55:32+05:30 IST