కువైత్‌కు పాకిన Omicron.. తొలి కేసు నమోదుతో కలకలం!

ABN , First Publish Date - 2021-12-09T13:57:02+05:30 IST

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. శరవేగంగా వ్యాపిస్తున్న ఈ వేరియంట్ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 57 దేశాలకు పాకినట్లు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.

కువైత్‌కు పాకిన Omicron.. తొలి కేసు నమోదుతో కలకలం!

కువైత్ సిటీ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. శరవేగంగా వ్యాపిస్తున్న ఈ వేరియంట్ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 57 దేశాలకు పాకినట్లు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అటు గల్ఫ్‌లోనూ ఒమైక్రాన్ నెమ్మదిగా విస్తరిస్తోంది. ఇప్పటికే సౌదీ అరేబియా, యూఏఈలో కొత్త వేరియంట్ కేసులు నమోదు కాగా, బుధవారం నాడు కువైత్‌లో తొలి కేసు వెలుగుచూసింది. ఆఫ్రికన్ కంట్రీ నుంచి వచ్చిన ప్రయాణికుడు ఒకరు ఒమైక్రాన్ బారిన పడినట్లు కువైత్ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రతినిధి డా. అబ్దుల్లా అల్ సనద్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇక కొత్త వేరియంట్ సోకిన ప్రయాణికుడు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకుని ఉన్నారని, అలాగే కువైత్ వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టులో నిర్వహించిన కోవిడ్ టెస్టులో సైతం నెగెటివ్‌గానే వచ్చింది. కానీ, ఆ తర్వాత నిర్వహించిన పరీక్షలో ప్రయాణికుడికి ఒమైక్రాన్ సోకినట్లు తేలిందని ఆయన పేర్కొన్నారు.


ఆఫ్రికన్ దేశం నుంచి రావడంతో కొన్ని రోజుల తర్వాత మరోసారి నిర్వహించిన కరోనా పీసీఆర్ పరీక్షలో ప్రయాణికుడికి పాజిటివ్ అని రావడం, అది కూడా ఒమైక్రాన్ ఉన్నట్లు తేలింది. దాంతో అతడ్ని ఇన్సిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డా. అబ్దుల్లా అల్ సనద్ వెల్లడించారు. అతనికి చిన్నపాటి లక్షణాలు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో మహమ్మారి ప్రభావం అంతగా లేనందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కానీ, కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరి అని తెలిపారు. అలాగే బూస్టర్ డోసు కూడా తీసుకుంటే మంచిదని సూచించారు. అటు ఒమైక్రాన్ కేసు బయటపడిన నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, విమాన ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు.       

Updated Date - 2021-12-09T13:57:02+05:30 IST