చేతిలో చిల్లిగవ్వ లేదంటూ గగ్గోలు పెట్టిన ఎన్నారై.. మళ్లీ కరోనా టీకా తీసుకుంటానంటూ హైకోర్టులో కేసు!

ABN , First Publish Date - 2021-11-02T23:20:51+05:30 IST

తనకు కొవిషీల్డ్ ఇప్పించండి అంటూ కేరళకు చెందిన ఓ ఎన్నారై అక్కడి హైకోర్టును ఆశ్రయించారు. దేశంలో ఉద్యోగం లేక..ఉపాధి కోసం సౌదీకి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నానని, మరోసారి తనకు టీకా తీసుకునేందుకు అవకాశం కల్పించాలంటూ కోర్టును వేడుకున్నారు.

చేతిలో చిల్లిగవ్వ  లేదంటూ  గగ్గోలు పెట్టిన ఎన్నారై.. మళ్లీ కరోనా టీకా  తీసుకుంటానంటూ హైకోర్టులో కేసు!

ఇంటర్నెట్ డెస్క్: తనకు కొవిషీల్డ్ ఇప్పించండంటూ కేరళకు చెందిన ఓ ఎన్నారై అక్కడి హైకోర్టును ఆశ్రయించాడు. దేశంలో ఉద్యోగం లేక..ఉపాధి కోసం సౌదీకి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నానని, మరోసారి తనకు టీకా తీసుకునేందుకు అవకాశం కల్పించాలంటూ కోర్టును వేడుకున్నాడు. మంగళవారం అతడి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం..దేశంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 


కొవీషీల్డ్‌ కరోనా టీకాకు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు కొవ్యాక్సిన్‌కు లేదనే విషయం తెలిసిందే. దీంతో..ఈ టీకా తీసుకున్న ఎన్నారైలు విదేశాలకు వెళ్లలేక భారత్‌లోనే ఉండిపోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొందరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు.. గుర్తింపు ఉన్న కరోనా టీకా తీసుకున్న విదేశీయులనే తమ దేశాల్లోకి అనుమతిస్తుండటంతో ఇలాంటి వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేరళకు చెందిన మనాస్ పీ హమీద్‌కు(29) ఇదే పరిస్థితి ఎదురైంది. ఉన్న ఊరిలో ఉద్యోగం లేక.. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే పరిస్థితి లేక అతడు ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ అతడు తాజాగా కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికే కొవ్యాక్సిన్ తీసుకున్న తనకు మరోమారు కొవీషీల్డ్ కరోనా టీకా తీసుకునే అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని వేడుకున్నాడు. 


విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం భారత్‌లో కొవ్యాక్సిన్ తీసుకున్న వారు..కొవీషీల్డ్ తీసుకున్న వారు..ఇలా రెండు రకాల పౌరులు ఉన్నారని వ్యాఖ్యానించింది. కొవ్యాక్సిన్ తీసుకున్న వారు భారత్‌కే పరిమితమవ్వాల్సి వస్తోందని, ఇది వారి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించడమేనని పేర్కొంది. ‘ఈ సమస్యను భారత్ ప్రభుత్వం ఒక నెలలో పరిష్కరించాలి. లేకపోతే..బాధితుడు గతంలో సౌదీలో సంపాదించినంత మొత్తాన్ని ప్రభుత్వమే అతడికి జీతంగా చెల్లించాలని మేమే ఆదేశాలు జారీ చేస్తాం’ అంటూ ప్రభుత్వంపై మండిపడింది.

Updated Date - 2021-11-02T23:20:51+05:30 IST