అధ్య‌క్షుడు బైడెన్ క‌న్నా క‌మ‌లా హ్యారిస్ సంపాద‌నే అధికం!

ABN , First Publish Date - 2021-05-18T19:24:52+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు క‌మ‌లా హ్యారిస్ సోమ‌వారం 2020 ఏడాదికి సంబంధించిన‌ వారి ట్యాక్స్ రిట‌ర్న్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

అధ్య‌క్షుడు బైడెన్ క‌న్నా క‌మ‌లా హ్యారిస్ సంపాద‌నే అధికం!

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు క‌మ‌లా హ్యారిస్ సోమ‌వారం 2020 ఏడాదికి సంబంధించిన‌ వారి ట్యాక్స్ రిట‌ర్న్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అధ్య‌క్షుడు బైడెన్ ఆయ‌న స‌తీమ‌ణి, అమెరికా ఫ‌స్ట్ లేడీ జిల్ బైడెన్ జంట‌గా త‌మ ట్యాక్స్ రిట‌ర్న్‌, ఆదాయం వివ‌రాల‌ను వెల్ల‌డించ‌గా.. ఉపాధ్య‌క్షురాలు త‌న భ‌ర్త, అమెరికా సెకండ్ జెంటిల్మ‌న్ డగ్ ఎమ్హాఫ్ సంయుక్తంగా త‌మ ఆస్తుల వివ‌రాలను తెలియ‌జేశారు. దీని ప్ర‌కారం అధ్య‌క్షుడి సంపాదన కన్నా ఉపాధ్యక్షురాలి ఆదాయమే అధికమ‌ని తేలింది. క‌మ‌లాకు సుమారు 1 మిలియ‌న్ డాల‌ర్ల సంపాద‌న ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలిసింది. 2020లో ఉపాధ్యక్షురాలి ఆదాయం రూ.12.41కోట్లుగా ఉంటే.. బైడెన్ సంపాదన కేవలం రూ.4.44 కోట్లు మాత్ర‌మే.


ఇక అధ్యక్షుడు బైడెన్, అమెరికా ఫ‌స్ట్ లేడీ జిల్ బైడెన్‌ సంయుక్తంగా ప్ర‌క‌టించిన‌ తమ ఆస్తుల వివరాల ప్రకారం.. 2019లో 9.85లక్షల డాలర్లుగా(రూ.7.21కోట్లు) ఉన్న వారి స్థూల ఆదాయం 2020లో 6.21లక్షల డాలర్లకు(సుమారు రూ.4.44కోట్లు) పడిపోయింది. ఈ అధ్యక్ష జంట‌ 2020 ఏడాదికి గాను 1.57లక్షల డాలర్లు(రూ.1.15కోట్లు) ఆదాయ‌పు పన్ను చెల్లించారు. అంటే ఇది వారి ఆదాయంలో 25.9శాతం. అలాగే ఉపాధ్యక్షరాలు కమలా, ఆమె భర్త డగ్ ఎమ్హాఫ్ ప్ర‌క‌టించిన త‌మ ఆస్తుల వివ‌రాల ప్ర‌కారం.. 2020లో వారి స్థూల ఆదాయం 16.95లక్షల డాలర్లు(సుమారు రూ.12.41కోట్లు). దీంట్లో ఈ ఉపాధ్య‌క్ష దంప‌తులు 6.21 లక్షల డాలర్లు(రూ.4.55కోట్లు) పన్ను రూపంలో చెల్లించారు. అంటే ఇది వారి ఆదాయంలో 36.7శాతం అన్న‌మాట‌. 


అంతేగాక త‌మ స్వ‌రాష్ట్రాల్లో స్థానికంగా చెల్లించిన ఫెడ‌ర‌ల్ ఆదాయ‌పు ప‌న్ను వివ‌రాల‌ను సైతం క‌మ‌లా దంప‌తులు ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. కాలిఫోర్నియాలో క‌మ‌లా 1.25ల‌క్ష‌ల డాల‌ర్లు ఆదాయపు ప‌న్ను చెల్లించ‌గా.. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ఎమ్హాఫ్ సుమారు 57వేల డాల‌ర్ల ఇన్‌కం ట్యాక్స్ చెల్లించిన‌ట్లు పేర్కొన్నారు. అటు అధ్య‌క్ష దంప‌తులు కూడా డెలావేర్‌, వ‌ర్జీనియాలో చెల్లించిన త‌మ‌ ఆదాయ‌పు ప‌న్ను వివ‌రాల‌ను తెలియ‌జేశారు. డెలావేర్‌లో బైడెన్ 28వేల 791 డాల‌ర్లు ప‌న్ను రూపంలో చెల్లించ‌గా.. వ‌ర్జీనియాలో జిల్ 443 డాల‌ర్లు ఆదాయ‌పు ప‌న్ను చెల్లించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇక 2020లో బైడెన్ దంపతులు తమ ఆదాయంలో 5.1 శాతం అంటే 30,704 డాల‌ర్లు(రూ.22లక్షలు) స్వ‌చ్ఛంద కార్య‌క్ర‌మాల కోసం విరాళంగా ఇచ్చారు. దీనిలో అధిక భాగం 'బ్యూ బైడెన్ ఫౌండేషన్‌'కు (10వేల డాల‌ర్లు) కేటాయించారు. అలాగే ఉపాధ్యక్షురాలు కమలా దంపతులు 2020లో 27వేల డాల‌ర్లు(సుమారు రూ.20లక్షలు) చారిటీకి ఇవ్వ‌డం జ‌రిగింది.

Updated Date - 2021-05-18T19:24:52+05:30 IST