మాతృదేశానికి భారీగా వైద్య సామాగ్రి పంపిన‌.. ఆస్ట్రేలియాలోని భార‌తీయులు

ABN , First Publish Date - 2021-05-21T16:36:17+05:30 IST

క‌రోనా సెకండ్ వేవ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న భార‌త్‌కు ప్ర‌పంచ దేశాలు త‌మ‌వంతు సాయం చేస్తున్నాయి.

మాతృదేశానికి భారీగా వైద్య సామాగ్రి పంపిన‌.. ఆస్ట్రేలియాలోని భార‌తీయులు

కాన్‌బెర్రా: క‌రోనా సెకండ్ వేవ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న భార‌త్‌కు ప్ర‌పంచ దేశాలు త‌మ‌వంతు సాయం చేస్తున్నాయి. అలాగే వివిధ దేశాల్లోని ప్ర‌వాస భార‌తీయులు, ప్ర‌వాస సంఘాలు సైతం మాతృదేశానికి స‌హాయం చేస్తూ ఆప‌త్కాలంలో ఆప‌న్న‌హ‌స్తం అందిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలోని భార‌తీయులు భారీ మొత్తంలో వైద్య సామాగ్రి పంపుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆసీస్‌లో సుమారు 7ల‌క్ష‌ల వ‌ర‌కు భార‌త ప్ర‌వాసులు ఉన్న‌ట్లు సమాచారం. ప్ర‌స్తుతం మాతృదేశం మ‌హ‌మ్మారి క‌రోనా కార‌ణంగా సంక్షోభంలో చిక్కుకోవ‌డం వీరిని క‌దిలించింది. దాంతో త‌మ‌వంతు సాయంగా భార‌త్‌కు భారీ మొత్తంలో వైద్య సామాగ్రి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు న్యూలాండ్ గ్లోబ‌ల్‌ గ్రూపు కంపెనీ సీఈఓ దీపెన్ రుఘానీ తెలిపారు.


అలాగే ఆసీస్‌లోని కొన్ని భార‌తీయ‌ సామాజిక, క‌ల్చ‌ర‌ల్ సంఘాలు కూడా విరాళాలు సేక‌రించి స్వ‌దేశానికి వైద్య సామాగ్రి పంపుతున్నాయి. వీటిలో అనూప‌మ్ మిష‌న్ ఆస్ట్రేలియా, హిందూ కౌన్సిల్ ఆఫ్‌ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్‌, ఇండియా ఆస్ట్రేలియా బిజినెస్ అండ్ క‌మ్యూనిటీ అవార్డ్స్ వంటి సంస్థ‌లు ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లు భార‌తీయ సంఘాలు ఆస్ట్రేలియా నుంచి పంపించిన 60 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, 1056 వెంటిలేట‌ర్లు, ఇత‌ర వైద్య సామాగ్రి ఇండియాకు అందాయి.    


అటు ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం కూడా భార‌త్‌కు సాయం చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 500 నాన్-ఇన్వాసివ్ వెంటిలేటర్లు, 3,000 వెంటిలేట‌ర్లు, పీపీఈ కిట్లు, 5ల‌క్ష‌ల ఎన్-95 మాస్కులు, 10ల‌క్షల‌ స‌ర్జిక‌ల్ మాస్కులు, 1ల‌క్ష స‌ర్జిక‌ల్ గౌనులు, 20వేల ఫేస్ షీల్డ్స్‌, ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, ఇత‌ర కీల‌క వైద్య ప‌రిక‌రాలు పంపించింది. అలాగే పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్ర ప్రభుత్వం కూడా భార‌త్‌కు 2 మిలియ‌న్ల ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్ల సాయం ప్ర‌క‌టించింది. విక్టోరియా రాష్ట్రం కూడా 41 మిలియ‌న్ల ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్లు విలువ చేసే 1,000 వెంటిలేట‌ర్లు సహా ఇత‌ర‌ వైద్య సామాగ్రి పంపించింది. వీటితో పాటు ఆ దేశంలోని ఇత‌ర రాష్ట్రాలు కూడా మ‌హ‌మ్మారి దెబ్బ‌తో అత‌లాకుత‌లం అవుతున్న భార‌త్‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నాయ‌ని అక్క‌డి ప్ర‌వాస భార‌తీయులు తెలిపారు.       

Updated Date - 2021-05-21T16:36:17+05:30 IST