ఆస్ట్రేలియాలో తెలుగోడికి అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2021-12-15T19:07:05+05:30 IST

ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి, ఫిజిక్స్ ప్రొఫెసర్‌ చెన్నుపాటి జగదీష్‌కు అరుదైన గౌరవం దక్కింది.

ఆస్ట్రేలియాలో తెలుగోడికి అరుదైన గౌరవం

సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి, ఫిజిక్స్ ప్రొఫెసర్‌ చెన్నుపాటి జగదీష్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్(ఏఎన్‌యూ) అధ్యక్షుడిగా జగదీష్ ఎన్నికయ్యారు. ఈ బాధ్యతలు చేపట్టనున్న తొలి భారత సంతతి వ్యక్తి జగదీషే కావడం విశేషం. 2022 మేలో ఆయన తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఆ దేశంలోని ప్రముఖ సైన్స్ సంస్థలలో ఒకటి. ఇది ఆస్ట్రేలియన్ పార్లమెంట్, ప్రజలకు స్వతంత్ర మరియు అధికారిక శాస్త్రీయ సలహాలను అందిస్తుంది. ఈ అరుదైన అవకాశం పట్ల జగదీష్ ఆనందం వ్యక్తం చేశారు. 31 ఏళ్ల క్రితం రెండేళ్ల కాంట్రాక్టుతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తాను ఇంత గొప్ప స్థాయికి చేరుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. 


అటు ఈ నియామకంపై ఏఎన్‌యూ వైస్‌ఛాన్సలర్‌, నోబెల్‌ గ్రహీత ప్రొఫెసర్‌ బ్రియాన్‌ స్మిత్‌ మాట్లాడుతూ.. సైన్స్‌ అకాడమీకి నాయకత్వం వహించేందుకు ప్రొఫెసర్‌ జగదీష్‌ సరైన వ్యక్తి అన్నారు. “జగదీష్‌ చేతుల్లో ఆస్ట్రేలియన్ సైన్స్, శాస్త్రీయ పరిశోధనలు చాలా సురక్షితం, స్ఫూర్తిదాయకమం” అని పేర్కొన్నారు. కాగా, చెన్నుపాటి జగదీష్‌ది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లా వల్లూరు పాలెం గ్రామం. ఆయన నాగార్జున వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1977లో ఆంధ్రా వర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పట్టా పొందారు. 1988లో ఢిల్లీ వర్సిటీలో పీహెచ్‌డీ పూర్తిచేసి కొన్నాళ్లు కెనడాలో అధ్యాపకునిగా పనిచేశారు. ఆ తర్వాత 1990లో ఆస్ట్రేలియాకు వెళ్లి ఆప్ట్రో ఎలక్ట్రానిక్స్​, నానోటెక్నాలజీ రంగాల్లో పరిశోధన సంస్థను స్థాపించారు. 

Updated Date - 2021-12-15T19:07:05+05:30 IST