చికాగో ఎయిర్‌పోర్టులో అరెస్టైన భారత వ్యక్తి.. బ్యాగేజీ తనిఖీల్లో..

ABN , First Publish Date - 2021-02-06T17:29:33+05:30 IST

ఇండియా నుంచి అమెరికా వెళ్లిన ఓ భారత వ్యక్తి చికాగో ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో వయాగ్రా మాత్రలతో పట్టుబడ్డాడు.

చికాగో ఎయిర్‌పోర్టులో అరెస్టైన భారత వ్యక్తి.. బ్యాగేజీ తనిఖీల్లో..

వాషింగ్టన్: ఇండియా నుంచి అమెరికా వెళ్లిన ఓ భారత వ్యక్తి చికాగో ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో వయాగ్రా మాత్రలతో పట్టుబడ్డాడు. అతని వద్ద సుమారు రూ. 70 లక్షలు విలువ చేసే 3,200 పిల్స్‌ను కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చట్టవిరుద్ధంగా దేశంలోకి పిల్స్ తీసుకువచ్చినందుకు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భారత్ నుంచి చికాగో విమానాశ్రయానికి చేరుకున్న భారతీయుడి బ్యాగేజ్‌ను స్కాన్ చేస్తున్న సమయంలో అతని లగేజీలో భారీ మొత్తంలో వయాగ్రా ట్యాబ్లెట్లు గుర్తించినట్టు సీబీపీ అధికారులు తెలిపారు. దాంతో ఇంత భారీ మొత్తంలో పిల్స్ ఎందుకు తీసుకువస్తున్నావని అధికారులు అతడ్ని ప్రశ్నించారు. 


మొదట తన స్నేహితుల కోసం వాటిని తీసుకువచ్చానని చెప్పిన అతడు.. ఆ తర్వాత పొంతనలేని సమాధానాలు చెప్పడంతో చట్టవిరుద్ధంగా మాత్రలు తీసుకువచ్చినందుకు సీబీపీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారత వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్న 3,200 పిల్స్ విలువ 96వేల డాలర్లు(సుమారు రూ. 70 లక్షలు) ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా, యూఎస్ వెలుపల కొనుగోలు చేసిన మందులను దిగుమతి చేసుకోవడాన్ని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అనుమతించదని సీబీపీ అధికారులు పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని చెప్పిన అధికారులు.. భారత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే, సదరు వ్యక్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు.         

Updated Date - 2021-02-06T17:29:33+05:30 IST