మార్నింగ్ వాక్కు వెళ్లి మాయమైన భారత యువతి.. క్షేమంగా ఇంటికి చేర్చిన దుబాయ్ పోలీసులు
ABN , First Publish Date - 2021-02-26T14:15:36+05:30 IST
మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లి.. కనిపించకుండా పోయిన భారత యువతి ఆచూకీ లభ్యమైంది.

దుబాయ్: మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లి.. కనిపించకుండా పోయిన భారత యువతి ఆచూకీ లభ్యమైంది. కూతురు కనిపించడం లేదనే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన దుబాయ్ పోలీసులు టీనేజర్‌ను సురక్షితంగా ఇంటికి చేర్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే.. దుబాయ్‌లోని ఉమ్ సుకీమ్ 2లో నివాసముండే 16 ఏళ్ల భారతీయ అమ్మాయి హరిని కరణి గురువారం ఉయదం 6.30 గంటలకు మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లింది. ప్రతిరోజు ఇలా వాకింగ్ వెళ్లి మళ్లీ అర్ధ గంట తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసేది. కానీ, గురువారం హరిణి తిరిగి ఇంటికి రాలేదు. చాలా సేపటి వరకు తల్లిదండ్రులు ఆమె కోసం వేచి చూశారు. ఎంతకు రాకపోవడంతో చుట్టుపక్కల అంతా వెతికారు. తెలిసిన వారిని కూడా వాకాబు చేశారు. కానీ, ఆమె ఆచూకీ మాత్రం దొరకలేదు.
దీంతో ఉయదం 9గంటల ప్రాంతంలో 999కు కాల్చేసి పోలీసులకు సమాచారం అందించారు. వాకింగ్‌కని వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో హరిణి ఆచూకీ దొరికింది. దాంతో వెంటనే ఆమెను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే, రోజంతా ఆమె ఎక్కడికి వెళ్లింది, ఎవరైనా తీసుకెళ్లారా? లేక ఆమెనే తనంతట తానుగా ఎక్కడికైనా వెళ్లిందా? అనే విషయాలు తెలియరాలేదు. కాగా, హరిణి ప్రస్తుతం అల్ బర్సాలోని జీఈఎంఎస్ ఫౌండర్ స్కూల్లో 11th గ్రేడ్ విద్యార్థిని. ఇక కనిపించకుండా పోయిన కూతురు క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కూతురిని వెతికి పెట్టిన దుబాయ్ పోలీసులకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.