శ్వేతసౌధంలో సత్తా చాటబోతున్న భారతీయ నారీమణులు వీళ్లే
ABN , First Publish Date - 2021-01-20T13:20:19+05:30 IST
అమెరికా కొత్త ప్రభుత్వాన్ని ప్రధానంగా మహిళా శక్తి నడిపించబోతోంది.ప్రపంచంలో దాదాపు మరేప్రభుత్వంలోనూ లేనంత మంది మహిళలు... వారిలో పద్నాలుగు మంది భారతీయ మూలాలున్నమహిళలు కీలకమైన పదవుల్లో సత్తా చాటబోతున్నారు. ఇప్పటికే తమ తమ రంగాల్లో ప్రతిభను చాటుకున్న ఈ మహిళలు అమెరికా పాలనపై తమదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు.

మహిళా శక్తి
అమెరికా కొత్త ప్రభుత్వాన్ని ప్రధానంగా మహిళా శక్తి నడిపించబోతోంది.ప్రపంచంలో దాదాపు మరేప్రభుత్వంలోనూ లేనంత మంది మహిళలు... వారిలో పద్నాలుగు మంది భారతీయ మూలాలున్నమహిళలు కీలకమైన పదవుల్లో సత్తా చాటబోతున్నారు. ఇప్పటికే తమ తమ రంగాల్లో ప్రతిభను చాటుకున్న ఈ మహిళలు అమెరికా పాలనపై తమదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు.
నీరా టాండన్
అమెరికా నూతన అధ్యక్షుడు ఎంపిక చేసుకున్న బడ్జెట్ చీఫ్ నీరా టాండన్ భారతీయ మూలాలు కలిగిన మహిళ. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్, అమెరికన్ ప్రోగ్రెస్ యాక్షన్ ఫండ్‌కు ఈమె సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2008లో జరిగిన అఽధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హిల్లరీ క్లింటన్‌కు సహాయకురాలిగా, ఆమెతో కలిసి పనిచేశారు నీరా. ప్రత్యేకించి నీరాను బైడెన్ బడ్జెట్ ఛీఫ్‌గా ఎన్నుకోవడానికి కారణం ఉదారవాదం, రాజకీయ ధృక్పథం కలిగిన ఆర్థిక సలహాదారుల బృందంతో తమ ప్రభుత్వం కలిసి పని చేస్తోందనే నమ్మకాన్ని అమెరికన్లలో నెలకొల్పడం కోసమేనని ప్రఖ్యాత వాల్‌స్ర్టీట్ జర్నల్ కూడా పేర్కొంది. బడ్జెట్ చీఫ్‌గా నీరా బడ్జెట్ తయారీ, అమలు, నియంత్రణ విధానం పర్యవేక్షణ, అధ్యక్ష ఆదేశాలు, కార్యనిర్వాహక ఆదేశాల అమలు మొదలైన బాధ్యతలను నిర్వర్తిస్తారు.

మాలా అడిగా
ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు మాలా పాలసీ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. జిల్కు సీనియర్ సలహాదారుగా, బైడెన్-కమలా హారిస్ బృందంలో సీనియర్ పాలసీ సలహాదారుగా మాలా పనిచేశారు. యూనివర్శిటీ ఆఫ్ షికాగో లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మాలా కొంతకాలం పాటు న్యాయవాదిగా పనిచేశారు. 2008లో ఒబామా ప్రచార బృందంలో చేరారు. ఇల్లినాయిస్కు చెందిన మాలా ఒబామా హయాంలో అసోసియేట్ అటార్నీ జనరల్ సభ్యురాలిగా నియమితులయ్యారు. బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా కూడా బాధ్యతలు చేపట్టారు. తర్వాత బైడెన్ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల డైరెక్టర్‌గా పనిచేశారు.

నేహా గుప్త
వైట్‌హౌస్ న్యాయవాద బృందంలో అసోసియేట్ కౌన్సెల్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న భారతీయ సంతతి మహిళ నేహా గుప్తా న్యూయార్క్‌లో పుట్టారు. స్టాన్ఫోర్డ్ లా స్కూల్, హార్వర్డ్ కాలేజీల నుంచి న్యాయశాస్త్రంలో పట్టాలు పొందిన ఆమె శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ కార్యాలయంలో డిప్యూటీ సిటీ అటార్నీగా పని చేశారు. పౌర హక్కులపై తన గళాన్ని గట్టిగా వినిపిస్తారని ఆమెకు పేరుంది. బైడెన్- కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చర్చలకు సంబంధించిన అంశాలను సిద్ధం చేసే బృందంలో నేహా కీలక పాత్ర పోషించారు.

సమీరా ఫాజిలీ
బైడెన్ యంత్రాంగంలో జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన సమీర తల్లితండ్రులది కశ్మీర్. ఆమె పుట్టక ముందు, 1970లో అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. అయితే కశ్మీర్‌తోనూ, అక్కడి బంధువులతోనూ సంబంధాలు తెంచుకోలేదు. సమీర కూడా మెడిసిన్ చదవాలని తల్లితండ్రులు పట్టుపట్టినా... వాళ్ళని ఒప్పించి మరీ ఎకనామిక్స్‌ను ఎంచుకున్నారు. యేల్ లా స్కూల్, హార్వర్డ్ కళాశాలల్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న సమీర అట్లాంటాలో ఎంగేజ్మెంట్ ఫర్ కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కు డైరెక్టర్‌గా, ఒబామా హయాంలో... శ్వేత సౌథంలో సీనియర్ పాలసీ అడ్వయిజర్‌గా పని చేశారు.
ప్రస్తుతం బైడెన్-హారిస్ టీంలో ఎకనామిక్ ఏజెన్సీ చీఫ్‌గా ఉన్నారు.. కాగా, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2019లో... కశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు, అమెరికాలో జరిగిన ఆందోళనల్లో సమీర పాలుపంచుకున్నారు. బంధువులు ఎక్కువమంది కశ్మీర్‌లోనే ఉండడంతో సమీర కుటుంబం తరచూ అక్కడికి వస్తూ ఉంటుంది. అయితే సమీర తన వృత్తిలో బిజీ కావడంతో రాకపోకలు తగ్గించారు. ఆమె చివరిసారిగా 2007లో ఇక్కడికి వచ్చారు. కాశ్మీరీ వంటకాలను బాగా ఇష్టపడే సమీరాకు పర్యటనలంటే ఎంతో మక్కువ. టెన్నిస్ బాగా ఆడుతారు. స్విమ్మింగ్, స్కయింగ్ కూడా ఆమె అభిరుచుల జాబితాల్లో ఉన్నాయి. ఆమె భర్త, ముగ్గురు పిల్లలతో జార్జియాలో నివసిస్తున్నారు.

సోనియా అగర్వాల్
బైడెన్ అధికార యంత్రాంగంలో కీలకమైన పర్యావరణ విధాన సీనియర్ సలహాదారు పదవికి ఎంపికైన భారతీయ-అమెరికన్ సోనియా అగర్వాల్ కుటుంబానిది పంజాబ్ ప్రాంతం. అమెరికాలోని ఓహియో ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆమె స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. రెండువందల మందికి పైగా విద్యుత్ విధాన నిపుణులు కలిసి పని చేస్తున్న ‘ఎనర్జీ ఇన్నోవేషన్’ సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలిగా, వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు స్ట్రేటజీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. పర్యావరణ, ఆర్థిక, ప్రజా ఆరోగ్య అంశాల మీద వాతావరణ, ఇంధన విధానాల ప్రభావంపై విశ్లేషణ జరిపి, ఇంధన విధానాన్ని, దేశీయ క్లైమెట్ పాలసీనీ రూపుదిద్దే బృందానికి ఆమె నాయకత్వం వహిస్తారు. అలాగే వైట్ హౌస్ లోని జాతీయ వాతావరణ పాలసీ ఆఫీసులో ఇన్నోవేషన్ విభాగం బాధ్యతలు కూడా చూసుకుంటారు.

సుమోనా గుహా
వైట్‌హౌస్‌కు కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఎంపికైన ముగ్గురు భారతీయ అమెరిన్లలో సుమోనా గుహా ఒకరు. గుహ అమెరికా విదేశీ విధానం, జాతీయ భద్రత అంశాల్లో కీలక భూమిక పోషించబోతున్నారు. బైడెన్ - హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణాసియా విదేశాంగ వ్యవహారాల కార్యనిర్వాహక బృందానికి ఉపాధ్యక్షురాలిగా గుహ పని చేశారు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్లో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా సేవలందించారు. ఒబామా ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడైన బైడెన్‌కు జాతీయ భద్రతా వ్యవహారాల ప్రత్యేక సలహాదారుగా కూడా వ్యవహరించారు. తాజాగా బైడెన్ అఽధ్యక్ష హయాంలో గుహ దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ హోదా పొందబోతున్నారు. ఆమెకు స్టేట్ డిపార్ట్మెంట్, అమెరికా స్వేతసౌధం వైట్ హౌస్, క్యాపిటల్ హిల్‌లో ఉన్న ఇరవై ఏళ్ల అనుభవం కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఎంపికకు తోడ్పడింది.

ఉజ్రా జేయా
పౌరభద్రత, ప్రజాస్వామ్యం, మానవహక్కుల శాఖకు నామినేట్ అయిన కశ్మీరీ మహిళ ఉజ్రా జేయా. స్టేట్ డిపార్ట్మెంట్లో ముప్పై ఏళ్ల అనుభవం కలిగిన ఉజ్రా ఉత్తరాసియా, దక్షిణాసియా, ఐరోపా మానవహక్కులు, బహుపాక్షిక అంశాలలో నిష్ణాతురాలు. ‘సార్వత్రిక హక్కులు, ప్రజాస్వామ్యాలే ప్రభుత్వానికి దన్నుగా, 21వ దశాబ్దపు సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలిగేందుకు సర్వసన్నద్ధం చేయగలిగే ఏకైక మహిళ ఉజ్రా’ అంటూ ఉజ్రా నామినేషన్‌ను ధృవీకరిస్తూ జో బైడెన్ కొనియాడడం విశేషం. గతంలో జేయా 2014 నుంచి 2017 వరకూ ప్యారిస్‌లోని యుఎస్ ఎంబసీలో చార్జ్ అఫైర్స్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ బాధ్యతలు నిర్వహించారు. మస్కట్, డమాస్కస్, కైరో, కింగ్స్టన్లలో యుఎస్ మిషన్స్‌లో సేవలు అందించారు.

అయేషా షా
శ్వేత సౌథంలోని డిజిటల్ వ్యూహ కార్యాలయంలో పార్టనర్షిప్ మేనేజర్‌గా బాధ్యతలు చేపడుతున్న అయేషా కశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లోని గగ్రిబల్‌లో పుట్టారు. ఆమె బాల్యమంతా అమెరికాలోని లూసియానాలో గడిచింది. ఆమె తండ్రి డాక్టర్ అమిర్ షా. శ్రీనగర్‌లోని ప్రముఖ కుటుంబాల్లో వారిది ఒకటి. 1993లో, అయేషా చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆమె తల్లితండ్రులు అమెరికాకు వలస వెళ్ళారు. నార్త్ కరోలినాలోని డేవిడ్సన్ కాలేజీలో అయేషా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జాన్ ఎఫ్.కెనడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గానూ పని చేశారు. ప్రస్తుతం స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూట్‌లో అడ్వాన్స్ మెంట్ స్పెషలిస్ట్‌గా ఉన్నారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జో బైడెన్- కమలా హారిస్ తరఫున పార్టనర్ షిప్స్మేనేజర్గా వ్యవహరించారు. అయేషా తల్లికి హైదరాబాదీ మూలాలున్నాయి. ప్రతి సంవత్సరం సెలవుల్లో అయేషా, ఆమె సోదరి శ్రీనగర్ వస్తూంటారు. ఉర్దూ, కశ్మీరీ భాషలు కూడా వారికి బాగా వచ్చు.

వనితా గుప్తా
అమెరికాలో అత్యంత గౌరవప్రదమైన మానవహక్కుల న్యాయవాది, భారతీయ వలస తల్లితండ్రులు గర్వించదగిన కుమార్తె అని జో బైడెన్ కొనియాడిన భారతీయ మహిళ వనితా గుప్తా. సెనేట్‌కు నామినేట్ అయిన మొట్టమొదటి ఇండియన్ అమెరికన్ అసోసియేట్ అటార్నీ జనరల్ కూడా వనితానే! లీగల్ డిఫెన్స్ ఫండ్‌లో ఉద్యోగిగా కెరీర్‌ను మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఒబామా- బైడెన్ ప్రభుత్వంలో జస్టిస్ డిపార్ట్మెంట్లో మానవహక్కుల డివిజన్‌లోకి అడుగుపెట్టారు. అమెరికన్ ప్రజలను ఏకం చేసే సమానత్వం, స్వేచ్ఛ కోసం ఆమె ఎంతో కృషి చేశారు. తన నియామకం గురించి వనిత మాట్లాడుతూ... ‘‘దేశంలో సమానత్వం పట్ల నా ధృక్పథం బలపడడానికి కారణం నా జీవితంలో జరిగిన రెండు ప్రధాన సంఘటనలు. రెస్టారెంట్లో నా కుటుంబంతో భోజనం చేస్తున్నప్పుడు కొందరు తెల్ల కుర్రాళ్లు, మమ్మల్ని హేళనపరుస్తూ, మేం అక్కడి నుంచి వెళ్లిపోయేవరకూ మా మీద పదార్థాలు విసిరారు. నా భర్త తల్లితండ్రులు వియత్నాంలో అస్థిరత, యుద్ధాలను తప్పించుకుని అమెరికాకు శరణార్థులుగా వలస వచ్చారు. మేం అమెరికా మీద ఉంచిన నమ్మకాన్ని చెదరగొట్టే ఇలాంటి పరిస్థితులను సరిదిద్దవలసిన బాధ్యత నామీద ఉందని భావించి, అందుకోసం కృషి చేశాను. సమానత్వం కోసం పాటుపడ్డాను. అసమానతలను, అన్యాయాలను తరిమికొట్టి, సుస్థిరమైన, సురక్షితమైన దేశంగా అమెరికాను మలచడమే ఇప్పుడు నా ముందున్న బాధ్యత’’ అన్నారు.

శాంతి కలతిల్
శాంతి కలతిల్‌ది కాలిఫోర్నియాలో స్థిరపడ్డ మలయాళ కుటుంబం. యు.సి. బర్కిలీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివారు. ‘ఆసియన్ వాల్ స్ట్రీట్ జర్నల్’కు హాంకాంగ్‌లో రిపోర్టర్‌గా పని చేశారు. ప్రస్తుత సమాచార యుగంలో... నిరంకుశ అధికారతత్త్వం కారణంగా ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్ళపై లోతైన అధ్యయనం చేశారు. అనేక పుస్తకాలు రాశారు. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, జార్జిటౌన్ యూనివర్సిటీ, వరల్డ్ బ్యాంక్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం ‘నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమొక్రసీ’లోని ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ డెమొక్రటిక్ స్టడీస్‌లో సీనియర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మానన హక్కులపై తన గళాన్ని గట్టిగా వినిపించే శాంతికి చైనీస్, మాండరిన్ భాషలు క్షుణ్ణంగా తెలుసు. ఇప్పుడు అగ్రరాజ్య విదేశాంగ విభాగంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వ్యవహారాల సమన్వయకర్తగా నియమితురాలైన ఆమె తన కార్యక్షేత్రాన్ని మరింత విస్తృతం చేసుకోబోతున్నారు.

రీమా షా
రీమా షా పూర్వీకులది గుజరాత్‌లోని కచ్ ప్రాంతం. ఆమె తల్లితండ్రులు ప్రీతి, భరత్ షా. వారి ఇద్దరు పిల్లల్లో రీమా చిన్నవారు. ఆమెపుట్టిందీ, పెరిగిందీ కాలిఫోర్నియాలో. హార్వర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, యేల్ లా స్కూల్లో న్యాయవాద విద్యను పూర్తి చేసిన రీమా కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికా సుప్రీం కోర్టు... ఇలా అనేక న్యాయ సంస్థల్లో వివిధ ఉద్యోగాలు చేశారు. ఇప్పుడు శ్వేత సౌధంలో డిప్యూటీ అసోసియేట్ కౌన్సెల్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం వాషింగ్టన్లో ఉంటున్న రీమా చిన్నతనం నుంచి ప్రతి మూడు నాలుగేళ్ళకూ భారతదేశం వస్తూ ఉంటారు. తన భారతీయ మూలాలంటే ఎంతో ఇష్టపడే ఆమె ఒడిస్సీ నృత్యం కూడా నేర్చుకున్నారు. అథ్లెటిక్స్‌లో కూడా ప్రవేశం ఉంది. కచీ-గుజరాతీ వంటకాలంటే ఎంతో ఇష్టమని చెప్పే రీమా పూర్తి శాకాహారి.

గరిమా వర్మ
భారత సంతతికి చెందిన గరిమా వర్మ అమెరికా ప్రఽథమ మహిళ జిల్ బైడెన్‌కు డిజిటల్ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. భారతదేశంలో జన్మించిన గరిమా తల్లితండ్రుతలతో కలిసి అమెరికా వలస వెళ్లారు. గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్- కమలా హారిస్‌తో కలసి పనిచేశారు. వారికి మీడియా స్ట్రాటజిస్ట్‌గా సేవలు అందించారు. రాజకీయాలకు పూర్వం గరిమా పారమౌంట్ పిక్చర్ చిత్రనిర్మాణ సంస్థకు గ్రాఫిక్స్ అధినేతగా పనిచేశారు. తర్వాత ఎబిసి నెట్వర్క్ టెలివిజన్ షోలో హోస్ట్‌గానూ ఆమె వ్యవహరించారు. తర్వాత హెరైజెన్ మీడియా అనే ఏజెన్సీని నడిపించారు.

కమలా హారిస్
అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపడుతున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హారిస్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆ పదవి అందుకుంటున్న తొలి శ్వేతేతర, ఏసియన్-అమెరికన్‌గా కూడా ఆమె రికార్డు స్థాపించారు. అంతేకాదు, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మొదటి దక్షిణాసియా-అమెరికన్, తొలి ఆఫ్రికన్-అమెరికన్‌గానూ గుర్తింపు సాధించారు. కమల తల్లి శ్యామలది తమిళనాడు కాగా తండ్రి డొనాల్డ్ హారిస్ జమైకాకు చెందినవారు.
ఆక్లాండ్‌లో జన్మించిన కమల హారిస్ హోవర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ, తరువాత ‘హేస్టింగ్స్ కాలేజీ ఆఫ్ లా’ నుంచి న్యాయ విద్యలో పట్టా అందుకున్నారు. పౌర హక్కుల ఉద్యమకారిణిగా పేరు పొందారు. 2017లో కాలిఫోర్నియా నుంచి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా తన వాణిని ఆమె బలంగా వినిపించారు. కిందటి ఏడాది జరిగిన ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి గెలిచారు. ఆమె భర్త డగ్లస్ కూడా న్యాయవాదే. తన భారతీయ మూలాలను అమితంగా ఇష్టపడే కమల ఉపాధ్యక్షురాలుగానూ తన ప్రత్యేకతను చాటబోతున్నారు.
