సౌదీలో హిందూ వ్యక్తికి తప్పుగా ఖననం..!

ABN , First Publish Date - 2021-03-17T18:04:14+05:30 IST

సౌదీ అరేబియాలో తప్పుగా ఖననం చేయబడ్డాడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ హిందూ వ్యక్తి.

సౌదీలో హిందూ వ్యక్తికి తప్పుగా ఖననం..!

విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తానన్న ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్

సిమ్లా: సౌదీ అరేబియాలో తప్పుగా ఖననం చేయబడ్డాడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ హిందూ వ్యక్తి. అధికారుల తప్పిదం వల్ల హిందూ వ్యక్తికి ముస్లిం ఆచారం ప్రకారం ఖననం జరిగింది. ఈ విషయాన్ని ఉనా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్పాల్ సింగ్ రాయ్‌జాదా మంగళవారం అసెంబ్లీలో లేవనెత్తారు. తప్పుగా ఖననం చేయబడిన భారతీయ వ్యక్తి  మృతదేహాన్ని స్వదేశానికి రప్పించి, ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ సందర్భంగా మృతుడి ఫ్యామిలీకి సీఏం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 


ఎమ్మెల్యే సత్పాల్ సింగ్ అసెంబ్లీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. మూడేళ్లుగా సౌదీలో పనిచేస్తున్న ఉనాకు చెందిన సంజీవ్ కుమార్ అనే వ్యక్తి జనవరి 24న గుండెపోటుతో చనిపోయాడు. తర్వాతి రోజు తోటి కార్మికుడి ద్వారా సంజీవ్ కుటుంబానికి ఈ విషయం తెలిసింది. దాంతో కుటుంబ సభ్యులు ఉనా డిప్యూటీ కమిషనర్‌తో పాటు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను సహాయం కోసం అర్థించారు. అలాగే భారత ఎంబసీని కూడా సంజీవ్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలంటూ సంప్రదించారు. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 17న మృతదేహాన్ని ముస్లిం సంప్రదాయం ప్రకారం ఖననం చేసినట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. సంజీవ్ మరణ ధృవపత్రంలో హిందూకు బదులుగా ముస్లిం అని ఉండడంతో ఇలా జరిగినట్టు ఇండియన్ కాన్సులేట్ అధికారులు వెల్లడించారు. తాజాగా ఈ విషయాన్ని సంజీవ్ కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మంగళవారం ఇదే విషయాన్ని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించడంతో సీఏం స్పందించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.   

Updated Date - 2021-03-17T18:04:14+05:30 IST