కెనడాలో ఎంపీ కార్యాలయం ముందు భారతీయుల నిరసన!

ABN , First Publish Date - 2021-02-27T02:33:55+05:30 IST

కెనడా ఎంపీ కార్యాలయం ముందు కెనడాలోని భారతీయులు నిరసనకు దిగారు. రైతులకు తాము వ్యతిరేకం కాదన్నారు. రైతులు చేస్తున్న ఆందోళనలు పక్కదారిపట్టాయని ఈ సందర్భంగా వారు ఆరోపిం

కెనడాలో ఎంపీ కార్యాలయం ముందు భారతీయుల నిరసన!

ఒట్టావా: కెనడా ఎంపీ కార్యాలయం ముందు కెనడాలోని భారతీయులు నిరసనకు దిగారు. రైతులకు తాము వ్యతిరేకం కాదన్నారు. రైతులు చేస్తున్న ఆందోళనలు పక్కదారిపట్టాయని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో వేలాది మంది రైతులు కొద్ది నెలలుగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొందరు నిరసనకారులు ఎర్రకోటపైకి ఎక్కి హల్‌చల్ చేశారు. ఈ క్రమంలో కెనడాలోని భారతీయులు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. వ్యవసాయ చట్టాలను స్వాగతిస్తూ తిరంగ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ఖలీస్థానీల నుంచి తమకు బెదిరింపులు వచ్చినట్టు కెనడాలోని కొందరు భారతీయులు ప్రకటించారు. అంతేకాకుండా అలయన్స్ ఆఫ్ ఇండో-కెనడియన్స్ (ఎన్ఏఐసీ) కెనడా మంత్రికి లేఖ రాసి.. కెనడియన్ హిందువులు, మోడరేట్ సిక్కులకు భద్రత కల్పించాలని లేఖలో కోరింది.ఈ నేపథ్యంలోనే కెనడాలోని కొందరు భారతీయులు కెనడా ఎంపీ జగ్మీత్ సింగ్ కార్యాలయాన్ని గురువారం ముట్టడించారు. ఖలీస్థానీలకు వ్యతిరేకంగా.. కెనడా జాతీయ జెండాను చేతబూని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓ నిరసనకారుడు మాట్లాడుతూ.. ‘రైతులకు మేము వ్యతిరేకం కాదు. కానీ భారత్‌లో జరుగుతున్న ఆందోళనలు పక్కదారి పట్టాయి. ఖలీస్థానీ ఉద్యమంగా మార్పు చెందింది’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి మద్దతుగా నిలిచన తరుణంలో తమకు బెదిరింపులు వస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ సమయంలో నాయకులు ఎటువంటి వివక్ష చూపకుండా తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ బెదిరింపుల విషయంపై భారత ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది. కెనడాలోని భారతీయులకు రక్షణ కల్పించాలని అక్కడి అధికారులను కోరిన విషయం తెలిసిందే.


Updated Date - 2021-02-27T02:33:55+05:30 IST