మూఢ నమ్మకాల పురోగతి !

ABN , First Publish Date - 2021-04-03T13:12:25+05:30 IST

మతం అనేది మానవతకు, మనశ్శాంతికి దోహదపడే విధంగా ఉండాలి. విశ్వాసం అంధ విశ్వాసంగా, నమ్మకం మూఢనమ్మకంగా మారితే ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది.

మూఢ నమ్మకాల పురోగతి !

మతం అనేది మానవతకు, మనశ్శాంతికి దోహదపడే విధంగా ఉండాలి. విశ్వాసం అంధ విశ్వాసంగా, నమ్మకం మూఢనమ్మకంగా మారితే ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో తోబుట్టువులయిన ఇద్దరు యువతుల హత్యోదంతమే అందుకు ఒక తార్కాణం.


ఈ విషాద ఘటన, ఆన్‌లైన్ షాపింగ్‌లో మంత్ర పూజల సామగ్రి లభ్యత వర్తమాన నవీన నాగరికతలోని వైరుధ్యాలను వెల్లడించడం లేదా? గ్రహాంతర యానంలో భారతదేశం వడివడిగా పురోగమిస్తోంది. అచిరకాలంలోనే భారతీయుడు ఒక చంద్రుడిపై కాలు మోపనున్నాడు. మరి ఈ నవీన యుగంలోనూ భారత్‌లోని ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయం భూతవైద్యం కోర్సును నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది! మరి మతం ప్రధాన భూమిక వహిస్తున్న గల్ఫ్ దేశాలలో మంత్రాలు, మూఢనమ్మకాల విషయాన్ని చూద్దాం. 


అరబ్బి భాషలో తాయెత్తులను తిలిస్మా, మంత్రాలను సహరా అని అంటారు. అరబ్ ప్రజలపై ఆఫ్రికా మంత్రాల ప్రభావం అంతా ఇంతా కాదు. 1920లో అమెరికాలో విద్యనభ్యసించి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఫారూఖీ, యునానీ వైద్యం ఆధారంగా ఒక ఔషధ పరిశ్రమ నెలకొల్పాడు. ఆఫ్రికా నల్లనయ్య బొమ్మ ఆ పరిశ్రమకు చిహ్నం. ఆ సంస్థ ఉత్పత్తే జిందా తిలిస్మాత్. దీని అర్థం జీవ మంత్రం. జిందా తిలిస్మాత్ అనేది ఇప్పటికీ ఒక సుప్రసిద్ధ బ్రాండ్. పేరులో ఉన్న తిరకాసు కారణాన జిందా తిలిస్మాత్‌ను దిగుమతి చేసుకోవడానికి ఒక దశలో గల్ఫ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే మంత్రాలకు, ఈ ఔషధానికి సంబంధం లేదని వివరణ ఇవ్వడంతో అనుమతించారు.


దిష్టి ఆచారాన్ని, దెయ్యాలు, మంత్రాలను అరబ్బులు పూర్తిగా విశ్వసిస్తారు. నేర పరిశోధనలో గల్ఫ్ పోలీసులు శాస్ర్తీయ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భూతశక్తిని కూడా వినియోగిస్తారని చెబుతారు. ఇక్కడ రంగురాళ్ళ విక్రయం ఒక లాభదాయక వ్యాపారం. తమకు తెలిసిన బంధుమిత్రులకు అరబ్బులు ప్రేమగా ఇచ్చే బహుమతి రంగురాళ్ళ ఉంగరాలు మాత్రమే. ఫుట్‌బాల్ పోటీల సందర్భంగా మంత్రాల కారణంగా తాము ఓడిపోయామంటూ చెప్పిన జట్లు కూడా ఇక్కడ ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. రాత్రిపూట దయ్యాలు సంచరిస్తాయనే ఉద్దేశంతో పాఠశాలల్లో దయ్యాలు రాకుండా ఉండేందుకు అన్ని ట్యూబులైట్లను వేసి ఉంచుతారు. వాచ్‌మెన్ పహరా సరేసరి. 


గల్ఫ్ దేశాలలో మంత్రపూజలు, భూతవైద్యానికి చట్టబద్ధమైన గుర్తింపు ఉంది. వాటి నియంత్రణ వ్యవస్థ కూడా ఉందని తెలిస్తే ఆశ్చర్యం కలుగకమానదు. మంత్రపూజలు చేసే విధానంలో కూడా వర్గీకరణ ఉంది. దానికి తగినట్లుగా చట్టవిరుద్ధంగా చేసే మంత్రపూజలకు సంబంధించిన సామగ్రిని దేశంలోకి తీసుకురాకుండా చూసేందుకు కస్టమ్స్ అధికారులు సదా పకడ్బందీగా చర్యలు చేపడుతుంటారు. చట్టబద్ధంగా చేసే భూతవైద్యాన్ని ప్రభుత్వం డేగకన్నుతో గమనిస్తుంటుంది. గల్ఫ్ దేశాలలోని సిఐడి విభాగాలలో దీనికి సంబంధించి ప్రత్యేక విచారణ విభాగాలు ఉన్నాయి. 


గల్ఫ్ దేశాలలో కుటుంబ కలహాలు ఎక్కువ కాబట్టి విడాకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. చాలామంది దంపతులు మూఢవిశ్వాసంతో మంత్రగాళ్ళను ఆశ్రయించడం కద్దు. తమ ఇళ్ళలో ఆయాలుగా పని చేసే విదేశీ మహిళలు ఈర్ష్యతో తమ కుటుంబాలపై మంత్రాలు చేయిస్తారని అనేక మంది విశ్వసిస్తారు. అందుకే ఆయాల పట్ల వారు ప్రవర్తించే తీరు మరోరకంగా ఉంటుంది. భారతదేశంలో బాబాలు, స్వాములు చేసినట్లుగా ఇక్కడ కూడా శేఖులు కొందరు మంత్రాల పేరిట మోసాలు చేస్తుంటారు. మరికొందరు ఎలాంటి లాభాపేక్ష లేకుండా చట్టబద్ధ మంత్రాలను చదువుతారు. క్షుద్రపూజలు మాత్రం పూర్తిగా నిషేధం. భారత్ నుంచి కొందరు స్వాములు, బాబాలు కూడ సందర్శక వీసాలపై గల్ఫ్ దేశాలకు వచ్చి తమ భారతీయ ఖాతాదారులకు సేవలు అందించి వెళతారు. ఆధునిక విజ్ఞానంతో పాటు మూఢత్వ భావజాలం కూడా పురోగతి సాధిస్తుండడం బాధాకరం.


మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి



Updated Date - 2021-04-03T13:12:25+05:30 IST