పెరిగిన సాగు, తగ్గిన వలసలు

ABN , First Publish Date - 2021-12-01T13:02:57+05:30 IST

వ్యవసాయ లేమి పరిస్ధితులు సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి వలసలకు కారణమవుతాయి. తెలుగు రాష్ట్రాలూ ఇందుకు మినహాయింపు కాదు.

పెరిగిన సాగు, తగ్గిన వలసలు

వ్యవసాయ లేమి పరిస్ధితులు సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి వలసలకు కారణమవుతాయి. తెలుగు రాష్ట్రాలూ ఇందుకు మినహాయింపు కాదు. ముఖ్యంగా తెలంగాణ నుంచి జీవనోపాధి వలసలకు దశాబ్దాల చరిత్ర ఉంది. వ్యవసాయం చేయడానికి భూమి లేకపోవడం, ఉన్నా సాగు నీరు లేకపోవడమే ఆ వలసలకు ప్రధాన కారణం.


సరైన సాగునీటి వనరుల లేమి, వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి కారణాల వల్ల గ్రామీణ ప్రాంత యువత దుబాయి దారి పట్టింది. స్వంత పొలాలు ఉన్న రైతులు దుబాయి ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో కూలీలుగా అవతారమెత్తారు! ఇక దేశీయంగా పాలమూరు వలస కార్మికుల దయనీయ వలస జీవితాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదు. నీళ్ళు, నిధులు, నియామకాలు అనే తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్య సాధనలో భాగంగా తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వల్ల వలసలు తగ్గి కార్మికులు స్వస్థలాలకు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సందర్భాలలో ఘంటాపథంగా చెప్పారు. తెరాస చిత్తశుద్ధి కారణాన పల్లెలన్నీ కళకళాడుతున్నాయని ఆయన తరుచుగా చెబుతుంటారు. 


స్వగ్రామంలో అప్పులు చేసి బోరు తవ్వించినా నీళ్ళు రాకపోవడంతో పాత అప్పులు తీర్చడానికి మళ్ళీ కొత్తగా అప్పులు చేసి దుబాయికు వచ్చినా సరైన ఉపాధి లభించకపోవడంతో సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండల వాస్తవ్యుడు చింతలపల్లి సుదర్శన రెడ్డి స్వదేశానికి తిరిగి వెళ్ళారు. సొంత ఊరులో అప్పుల విషయమై జరిగిన ఒక వాగ్వివాదంలో సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన వన్నెల వెంకటేశ్, నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నలేశ్వర్ గ్రామానికి చెందిన బొప్పారం గంగాధర్ తరహా అనేకమంది సాగు నీటి కోసం బావులు తవ్వించి అప్పులపాలై గల్ఫ్ బాట పట్టినా సరైన ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నవారు అనేక మంది ఉన్నారు. అయితే తెరాస ప్రభుత్వం చేపట్టిన సాగునీటి పథకాల వల్ల ఆత్మహత్యల సంఘటనలు ఇప్పుడు తగ్గాయి. చమురు ధరల పతనానంతరం ఆర్థిక మాంద్యం కారణాన గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వెళ్ళిన అనేక మంది వరి పంటలు వేసుకున్నారు. 


తెలుగు రాష్ట్రాలలో వ్యవసాయం అంటే ప్రధానంగా వరి సాగు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, ఉచిత విద్యుత్, రైతుబంధు ఇత్యాది పథకాల ద్వారా ప్రధానంగా వరి సాగు చేసే రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పవచ్చు. 


వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు, దాని అనుబంధ ఎత్తిపోతల పథకాలను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. అలాగే ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ద్వారా సమకూర్చుకున్న నిధులతో రైతుబంధు మొదలైన పథకాల రూపేణా రైతులను ఆదుకుంటున్నారు. అయినప్పటికీ రైతాంగం దాదాపుగా వరి సాగుపై ఆధారపడిందనే విషయాన్ని విస్మరించకూడదు. పెంచిన అంచనా వ్యయం, అదనపు పనులు కలుపుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం లక్షకోట్ల రూపాయలకు మించుతోంది. మరి ఈ ప్రాజెక్టు నుంచి రైతాంగానికి అందించే నీరుతో ఏ పంట వేస్తారు, అదిచ్చే సగటు లబ్ధి ఏమిటి అనే విషయమై ముఖ్యమంత్రి, అధికారవర్గం బహుశా అధ్యయనం చేసే ఉంటారు. ఒక అంచనాకూ వచ్చి ఉంటారు. ప్రాజెక్టు డిపిఆర్ ప్రకారం ఎకరా వరి పంటకు రూ. 3200గా ఉన్న రైతు ఆదాయం కాళేశ్వరం ప్రాజెక్టుతో 28 వేల రూపాయలకు పెరుగుతుందని అంచనా వేశారు. ఎకరాకు సంవత్సరానికి రూ. 53వేలు వెచ్చించి నీరిస్తున్నారు. ఏం పండించినా దాని నుంచి వచ్చే లాభం అంతకు మించి ఉండాలి. ప్రభుత్వం అందించే సాగునీటి ఖర్చుకు అదనంగా రైతు తన వంతుగా విత్తనం, కూలీ, ఎరువులు ఇత్యాది ఖర్చులను మినహాయించి లాభం పొందాలి. మరి వరి పంటలో ఆ ప్రకారం లాభాలు ఉన్నాయా అనేది అనుమానాస్పదమే.


తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక గత ఏడేళ్ళలో వరి సాగు విస్తీర్ణం అనూహ్యంగా 200 శాతానికి పైగా పెరిగినట్లుగా ప్రభుత్వ గణంకాలు వెల్లడిస్తున్నాయి. పంట విస్తీర్ణం పెరిగినా వైవిధ్యం పెరగలేదు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ఆశించిన స్ధాయిలో ప్రోత్సహించలేదు. మద్దతు ధర కారణాన రైతులు సైతం వరి నుంచి మరో పంట వైపు మళ్ళలేదు. ఉచిత విద్యుత్ అనేది సున్నితమైన ఓటుబ్యాంకు వ్యవహారం కావడంతో ఈ విషయంలో పెద్దగా ఆశించడం పొరపాటు. ఇందులో అటు పాలకవర్గాలు ఇటు రైతాంగం ఇద్దరి పాత్ర ఉంది.


ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. కొన్ని గల్ఫ్ దేశాలు ఒకప్పుడు తమకున్న పరిమిత సంఖ్యలోని రైతులను ఆదుకోవడానికి గోధుమ పంటను ప్రొత్సహించాయి. ప్రభుత్వమే దాన్ని కొనుగోలు చేసేది, క్రమేణా పెరిగిన సాగు, తరుగుతున్న భూగర్భ జలాలకు తోడుగా విదేశాల నుంచి సగం కంటే తక్కువ ధరకు లభించే నాణ్యమైన గోధుమల కారణాన క్రమేణా ఆ పంట సాగును పూర్తిగా నియంత్రించింది.


దుబాయి వీసా కోసం లక్ష రూపాయలు ఇచ్చే సామాన్యుడు ఉపాధి వేతన వివరాలను ఆరా తీస్తాడు. లక్ష కోట్లు వెచ్చిస్తున్న నీటి పారుదల పథకాలతో రైతులకు సమకూరే అంతిమ ప్రయోజనాలను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన అంచనా వేసి ఉంటుంది? అది, ఆ పథకాల వల్ల గరిష్ఠంగా సాగునీటి లబ్ధి పొందిన రైతాంగం పండించిన వరి పంటకు లభించే ధరతో తెలుస్తుంది.


మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)




Updated Date - 2021-12-01T13:02:57+05:30 IST