కరోనా తర్వాత విదేశాల్లో బడులు ఇలా !

ABN , First Publish Date - 2021-02-01T13:17:24+05:30 IST

కరోనా మహమ్మారి గత ఏడాది ప్రపంచాన్ని గజగజ వణికించింది. లాక్‌డౌన్‌లతో బడులు.. దేవాలయాలు.. పరిశ్రమలు.. కార్యాలయాలు.. ఇలా అన్నీ మూతపడ్డాయి. విలువైన విద్యా సంవత్సరం అల్లకల్లోలమైంది. ఈ పరిస్థితులు ఆన్‌లైన్‌ పాఠాలను అలవాటు చేసినా.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు.

కరోనా తర్వాత విదేశాల్లో బడులు ఇలా !

వూహాన్‌లో రోజూ కరోనా పరీక్షలు.. ఐరోపాలో ముందే తెరిచినా.. సెకండ్‌వేవ్‌తో కుదేలు

ఆఫ్రికా దేశాల్లో రేడియో పాఠాలే

పలుదేశాల్లో కట్టుదిట్టమైన చర్యలు

కరోనా మహమ్మారి గత ఏడాది ప్రపంచాన్ని గజగజ వణికించింది. లాక్‌డౌన్‌లతో బడులు.. దేవాలయాలు.. పరిశ్రమలు.. కార్యాలయాలు.. ఇలా అన్నీ మూతపడ్డాయి. విలువైన విద్యా సంవత్సరం అల్లకల్లోలమైంది. ఈ పరిస్థితులు ఆన్‌లైన్‌ పాఠాలను అలవాటు చేసినా.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. అవి ఆఫ్‌లైన్‌ అంత ప్రభావవంతంగా లేవనేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయం. దేశంలో.. కరోనా ప్రభావం తగ్గడం..వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో.. సోమవారం నుంచి బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. విదేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చేసిన పొరపాట్లేంటి? మళ్లీ సెలవులు ప్రకటించడానికి కారణాలేమిటి? అనే అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..


నెదర్లాండ్స్‌లో పకడ్బందీగా

నెదర్లాండ్స్‌లో పకడ్బందీగా తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు కూర్చునే డెస్క్‌లకు.. ఒకరితో ఒకరికి కాంటాక్ట్‌ ఉండకుండా ఫ్లెక్సీగ్లాస్‌లను ఏర్పాటు చేశారు. చక్కటి వెంటిలేషన్‌ ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీని వల్ల వైరస్‌ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అందుకే.. ఫేస్‌మా్‌స్కను తప్పనిసరి చేయలేదు. స్కూళ్లలో ప్రవేశ ద్వారం వద్ద డిసిన్ఫెక్టెంట్‌ డిస్పెన్సర్లు ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి వీటి గుండానే వెళ్లాల్సి ఉంటుంది.


చైనాలో ‘నెగెటివ్‌’ మస్ట్‌.. 

కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో మనకంటే ముందు నుంచే బడులు తెరుచుకున్నాయి. స్కూలుకు వచ్చే విద్యార్థులకు కొవిడ్‌ నెగటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేశాయి. వూహాన్‌ మినహా.. మిగతా ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వూహాన్‌లో మాత్రం ప్రతిరోజూ.. హాజరయ్యే ప్రతి విద్యార్థికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.


స్పెయిన్‌లో బయోబబుల్స్‌.. 

స్పెయిన్‌లో విద్యార్థులను 15-20 మందికి ఒకటి చొప్పున బయోబబుల్‌ గ్రూపులుగా విడదీశారు. అంటే.. తరగతి గదుల్లో ఒక్కో బయోబబుల్‌ ద్రూప్‌కు ప్రత్కేంగా డిసిన్ఫెక్టెంట్‌ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. కరోనా కల్లోల సమయంలోనూ తరగతులు కొనసాగాయి. అప్పట్లో తల్లిదండ్రుల ఆమోదంతోనే విద్యార్థులను బడులకు పంపాలని పేర్కొన్నా.. సెప్టెంబరు నుంచి ప్రతి విద్యార్థికి హాజరు తప్పనిసరి అని ప్రకటించింది. సిలబ్‌సను పూర్తిచేసేందుకు అదనంగా టీచర్లను నియమించింది. అలా 17 ప్రాంతాల్లో 11 వేల మంది టీచర్లను కొత్తగా రిక్రూట్‌ చేశారు.


డెన్మార్క్‌లో షిఫ్ట్‌ల వారీగా..

డెన్మార్క్‌ బడుల్లో ప్రవేశ/నిష్క్రమణ మార్గాలను పెంచారు. బోధన సమయాన్ని తగ్గించారు. తరగతులను షిఫ్ట్‌ల వారీగా నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ ప్రొటోకాల్‌ తప్పనిసరి.


కెనెడాలో ఫేస్‌షీల్డ్‌

కెనెడాలో స్కూలు విద్యార్థులు, టీచర్లకు మాస్క్‌ స్థానంలో ఫేస్‌షీల్డ్‌/వైసర్‌ను తప్పనిసరి చేశారు. నిత్యం చేతుల్ని శుభ్రపరుచుకోవడంతోపాటు.. ఆరుగురు విద్యార్థులకు ఒకటి చొప్పున గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపు మధ్య దూరం కనీసం ఒక మీటరు, గ్రూపులకు.. టీచర్లకు మధ్య 2 మీటర్ల దూరం ఉండాలనే నిబంధన విధించారు.


ఐరోపా దేశాల్లో.. కొత్త వేరియెంట్‌తో మళ్లీ మూత!

ఐరోపా దేశాల్లో ముందే బడులను తెరిచినా.. సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో మళ్లీ సెలవులు ప్రకటించక తప్పలేదు. ఫ్రాన్స్‌లో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలోనే.. అక్కడి ప్రభుత్వం గత జూన్‌లో బడులను తెరిచింది. సెప్టెంబరు నుంచి తప్పనిసరిగా బడులకు రావాలని ఆదేశించింది. మాస్క్‌ నిబంధనను తప్పనిసరి చేసింది. ఆ తర్వాత సెకండ్‌ వేవ్‌తో మళ్లీ మూసివేసింది. జనవరి 4 నుంచి కొవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటిస్తూ.. తరగతులను తిరిగి ప్రారంభించింది. ఇంగ్లండ్‌లో గత ఏడాదే స్కూళ్లను పునః ప్రారంభించారు. కొత్త స్ట్రెయిన్‌ విజృంభించడంతో.. చాలా మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. ఇంగ్లండ్‌ వ్యాప్తంగా ఇప్పుడప్పుడే బడులు తెరుచుకునే పరిస్థితులు లేవు. మార్చిలో తిరిగి పరిశీలిస్తామని ఆ దేశ ప్రధాని ప్రకటించారు. పోర్చుగల్‌లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నా జనవరి మొదటి వారంలో బడులను తెరిచారు. కరోనా కొత్త వేరియంట్‌ విజృంభించడంతో మళ్లీ స్కూళ్లకు సెలువులు ప్రకటించారు. ఇక్కడ కరోనా వ్యాప్తి 8ు ఉండగా కొత్త వేరియంట్‌ ప్రభావంతో అది బడులు తెరిచిన వారం రోజుల్లోనే 20శాతానికి పెరిగింది.  జర్మనీలో కూడా ముందుగానే స్కూళ్లను తెరిచినా.. డిసెంబరు ద్వితీయార్థంలో మళ్లీ మూతపడ్డాయి. బెల్జియం, ఆస్ట్రియాల్లో ఆన్‌లైన్‌ తరగతులే కొనసాగుతున్నాయి.


ఆఫ్రికాలో రేడియో పాఠాలు

ఆఫ్రికా ఖండంలోని పలు వెనుకబడిన దేశాల్లో బడులను తెరిచినా.. సెకండ్‌ వేవ్‌, కొత్త వేరియెంట్ల కారణంగా మళ్లీ మూసేశారు. పేద దేశాల్లో ఆన్‌లైన్‌ క్లాసులకు అవసరమయ్యే గాడ్జెట్లను సమకూర్చుకునే స్థోమత విద్యార్థుల తల్లిదండ్రులకు లేకపోవడంతో.. ఉగాండా లాంటి దేశాల్లో రేడియో ద్వారా పాఠాలను ప్రసారం చేస్తున్నారు.


ఇటలీలో భౌతికదూరం

కరోనా అలకు అతలాకుతలమైపోయిన దేశాల్లో ఇటలీ ఒకటి. ఇక్కడ గత ఏడాది మార్చి-సెప్టెంబరు మధ్య కాలంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆ తర్వాత బడులు తెరుచుకున్నాయి.. విద్యార్థుల మధ్య కనీసం ఒక మీటరు భౌతిక దూరాన్ని పాటిస్తూ పాఠాలు బోధిస్తున్నారు. 

సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2021-02-01T13:17:24+05:30 IST