ఆకాశాన్నంటిన విమాన చార్జీలు.. Americaకు రాను పోను టికెట్ ధరెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
ABN , First Publish Date - 2021-11-21T13:39:14+05:30 IST
సంవత్సరాంతపు యాత్రలు విమాన ప్రయాణికులకు భారం కానున్నాయి. మరోవైపు విద్య, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి విమాన చార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి.

కొవిడ్ ముందు స్థాయికి డిమాండ్
భారీగా పెరిగిన టికెట్ ధరలు
అమెరికా టూ వే టికెట్ రూ.1.5 లక్షలు!
సంవత్సరాంతపు యాత్రలు విమాన ప్రయాణికులకు భారం కానున్నాయి. మరోవైపు విద్య, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి విమాన చార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం విమానయాన రంగం కొవిడ్ కాటు నుంచి క్రమక్రమంగా కోలుకుంటోంది. డిమాండ్ కూడా కొవిడ్ ముందు స్థాయికి చేరుకుంటోంది. పలు దేశాలు విమానయానంపై ఆంక్షలు ఇప్పటికీ కొనసాగిస్తూ ఉండడం, విమాన సర్వీసులు పరిమితంగా ఉండటం, డిమాండ్-సరఫరా మధ్య భారీ అంతరం ఇవన్నీ విమానయాన ధరలు విపరీతంగా పెరిగేందుకు కారణమవుతున్నాయి. ప్రస్తుత వాతావరణంలో విమాన టికెట్ ధరలు దిగివచ్చే అవకాశం ఏ మాత్రం లేదని ట్రావెల్ ఏజెన్సీల ప్రతినిధులంటున్నారు.
విమాన టికెట్ల ధరలు కొవిడ్ ముందు స్థాయితో పోల్చితే భారీగా పెరిగాయి. అమెరికాలోని పలు నగరాలకు టూవే ట్రావెల్ (వెళ్లి తిరిగి రావడానికి) టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.1-1.5 లక్షలు పలుకుతోంది. గతంలో ఈ ధర రూ.70 వేలుండేది. అమెరికాలో నివాసం ఉంటూ భారత్‌కు వచ్చే వారైతే ఒక్కొక్కరి టూ వే ట్రావెల్‌కు రూ.1.5-2 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. గతంలో ఈ వ్యయం రూ.లక్ష మించకపోయేది. ప్రస్తుతం ముగ్గురు సభ్యులున్న కుటుంబం ప్రయాణానికి ఆరేడు లక్షల వరకు ఖర్చు చేయా ల్సి వస్తోంది. ఒక్క అమెరికానే కాదు, ఇతర దేశాలకూ విమాన టికెట్ ధరల పెరుగుదల ఇదే తీరులో ఉంది. ఇదే సమయంలో అమెరికాలో కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకుంటుండటంతో పాటు ఉన్నత విద్యత కోసం వెళ్లే విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
డిమాండ్‌కు తగ్గట్టుగా సర్వీసులు లేకపోవటం తో వీరు టికెట్ కోసం పెద్దమొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. మరోపక్క దేశీయ విమాన సర్వీసుల టికెట్ల చార్జీలు సైతం ప్రీ-కొవిడ్ దశతో పోల్చితే 30 నుంచి 100 శాతం పెరిగాయి. సాధారణంగా పండుగల సీజన్‌లో విమాన ప్రయాణాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి నవంబరు నెలాఖరు వరకు పండగల సీజన్‌గా పరిగణిస్తారు. సాధారణంగా సెలవుల్లో విహార యాత్ర లేదా తీర్థయాత్రలకు ఎక్కువగా ఇష్టపడతారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గోవా, ఉదయ్‌పూర్, తిరుపతికి టికెట్ ధరలు అక్టోబరు, నవంబరు నెలల్లో సగటున 16 శాతం వరకు పెరిగినట్టు క్లియర్ ట్రిప్ ప్రతినిధి చెప్పారు. విమాన ఇంధన వ్యయ భారం పెరగడమూ టికెట్ చార్జీలపై ప్రభావం చూపింది. సాధారణంగా ఎయిర్‌లైన్స్‌ల నిర్వహణ వ్యయంలో ఇంధనానిదే 40 శాతం వాటా. జెట్ ఇంధనాలపై పన్నుల భారం దేశంలో అధికంగా ఉంది. తమ వంతుగా పరిశ్రమకు ఊతం ఇవ్వడానికి ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలని అధిక శాతం మంది కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జెట్ ఇంధనాలపై వ్యాట్ తగ్గించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచన చేశారు.
రెండేళ్లుగా నిలిచిపోయిన షెడ్యూల్డ్ సర్వీసులు కరోనా విజృంభణ కారణంగా 2020 మార్చి నుంచి విమాన సర్వీసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రెండు నెలల పాటు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేశారు. గత ఏడాది మే 20 తర్వాత క్రమంగా ఆంక్షలు తొలగిస్తూ దేశీయ విమాన సర్వీసులను పునరుద్ధరించినా విదేశాలకు మాత్రం ఇప్పటికీ షెడ్యూల్డ్ విమాన సర్వీసులు నడపడంలేదు. త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇప్పటికే అమెరికా షెడ్యూల్డ్ విమాన సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేయగా సింగపూర్, థాయ్‌లాండ్, ఆస్ర్టేలియా కూడా అదే ఆలోచనలో ఉన్నాయి.
డిమాండ్ పునరుద్ధరణ
విమానయానాని కి డిమాండ్ గత కొద్ది నెలలుగా పెరుగుతూ వస్తోంది. అక్టోబరులో దేశీయ విమానయానానికి డిమాం డ్ 70.5 శాతం పెరిగిందని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. గత ఏడాది అక్టోబరులో 52.71 లక్షల మంది దేశంలోని వివిధ గమ్యాలకు విమానాల్లో ప్రయాణించగా ఈ అక్టోబరులో ఆ సంఖ్య 89.85 లక్షలకు చేరింది. కాగా కోల్‌కతా నుంచి విదేశీ విమానయానానికి డిమాండ్ గణనీయంగా పెరిగిందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. అమెరికాలోని గమ్యాలకు విమాన టికెట్ల లభ్యతపై ఎంక్వైరీలు అధికమయ్యాయని చెప్పారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొందని వారన్నారు. కరోనా కారణంగా స్వదేశానికి వచ్చిన వారు, దీర్ఘకాలంగా దేశంలోనే నిలిచిపోయిన ప్రవాసీలు, వలస కార్మికులు, విద్యార్థుల నుంచి డిమాండ్ అధికంగా ఉందని వారు చెబుతున్నారు. దీనికి తోడు రెండేళ్లుగా ఎలాంటి ప్రయాణాలు లేకుండా ఇళ్లకు పరిమితమైన వారు కూడా మానసికోల్లాసం కోసం విహార యాత్రలకు మొగ్గుచూపు తున్నారు.
అవరోధంగా ‘ఎయిర్ బబుల్స్’
ప్రస్తుతం భారత్.. 13 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాలు కలిగి ఉంది. కరోనా వంటి ప్రపంచ మహమ్మారులు విజృంభించిన లేదా అంతర్జాతీయ కల్లోలిత వాతావరణం ఏర్పడిన పరిస్థితుల్లో షెడ్యూల్డ్ విమాన సర్వీసులన్నింటినీ నిషేధించినప్పటికీ ఏవైనా రెండు దేశాలు ఎలాంటి అంతరాయం లేకుండా విమాన సర్వీసులు నడిపేందుకు కుదుర్చుకునే ద్వైపాక్షిక ఒప్పందాలనే ఎయిర్ బబుల్స్‌గా వ్యవహరిస్తారు. అంటే ఎయిర్ బబుల్ ఒప్పందాలున్న దేశాలు మినహా ఇతర దేశాల విమానాలకు అనుమతి ఉండదు. ప్రస్తుతం అంతర్జాతీయ విమానయానానికి ఈ ఎయిర్ బబుల్స్ పెద్ద అవరోధంగా మారడమే కాకుండా టికెట్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ షెడ్యూల్డు విమాన సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేయడమే కాకుండా ఎయిర్ బబుల్ విధానంపై పునరాలోచించాలని కూడా పలువురు కోరుతున్నారు. అంతర్జాతీయ విమాన చార్జీలు తిరిగి సాధారణ స్థాయికి రావాలంటే ప్రభుత్వం ఎయిర్ బబుల్ ఒప్పందాలు రద్దు చేసుకుని షెడ్యూల్డ్ సర్వీసులను పునరుద్ధరించాలని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.