దుబాయ్‌ జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు.. భయంతో జనం పరుగులు!

ABN , First Publish Date - 2021-07-08T15:25:27+05:30 IST

దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు సంభవించింది. పోర్టులోని ఓ కంటైనర్ షిప్‌కు మంటలు అంటుకోవడంతో భారీ విస్ఫోటనం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.

దుబాయ్‌ జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు.. భయంతో జనం పరుగులు!

దుబాయ్: దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు సంభవించింది. పోర్టులోని ఓ కంటైనర్ షిప్‌కు మంటలు అంటుకోవడంతో భారీ విస్ఫోటనం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ భారీ విస్ఫోటనం కారణంగా పెద్ద శబ్దాలు వెలువడినట్లు పోర్టుకు దగ్గరలోని నివాసితులు చెప్పారు.


ఒక్కసారిగా కొద్దిసేపు భవనాలు కంపించాయని వారు తెలిపారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూస్తే ఆకాశంమంతా ఎరుపు రంగులోకి మారిపోయి ఉందన్నారు. ప్రమాద దృశ్యాలను జనం తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇప్పుడీ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, దుబాయ్‌లోని జెబెల్ అలీ నౌకాశ్రయం ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ పోర్టు నుంచి భారత ఉపఖండంతో పాటు ఆఫ్రికా, ఆసియాకు సరుకుల రవాణా జరుగుతుంది. ప్రస్తుతం ఇది దుబాయ్‌కు చెందిన డీపీ వరల్డ్ నిర్వహణలో ఉంది.  




Updated Date - 2021-07-08T15:25:27+05:30 IST