UAE: భారతీయ వైద్య దంపతులకు గోల్డెన్ వీసా
ABN , First Publish Date - 2021-07-24T14:56:02+05:30 IST
షార్జాలో నివాసముండే భారత్‌కు చెందిన డా. ముహమ్మద్ ఫస్సలుదీన్, డా. రజియా మెలె వల్లొప్రా దంపతులకు యూఏఈ సర్కార్ తాజాగా గోల్డెన్ వీసా మంజూరు చేసింది.

అబుధాబి: షార్జాలో నివాసముండే భారత్‌కు చెందిన డా. ముహమ్మద్ ఫస్సలుదీన్, డా. రజియా మెలె వల్లొప్రా దంపతులకు యూఏఈ సర్కార్ తాజాగా గోల్డెన్ వీసా మంజూరు చేసింది. అలాగే రజియా స్పాన్సర్‌షిప్‌లో ఉన్న వారి కుమారుడు ఆదిల్ ఫజల్ కూడా గోల్డెన్ వీసా అందుకున్నారు. ఆదిల్ ప్రస్తుతం దుబాయ్‌లోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్లో పదకొండో తరగతి చదువుతున్నాడు. కరోనా సమయంలో ఈ దంపతులు దేశ ప్రజలకు అందించిన సేవలు, వైద్యరంగంలో వీరి విశేష కృషికి గుర్తింపుగా యూఏఈ గోల్డెన్ వీసా ఇచ్చింది. వైద్య రంగంలో తమ సేవలను గుర్తించి యూఏఈ ప్రభుత్వం తమకు గోల్డెన్ వీసా మంజూరు చేసినందుకు ఫస్సలుదీన్ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు.
కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన ఈ ఫ్యామిలీ 2015లో యూఏఈ వెళ్లింది. ప్రస్తుతం ఈ కుటుంబం షార్జాలోని అల్ నహ్దాలో నివాసం ఉంటున్నారు. డాక్టర్ ఫస్సలుదీన్ కార్డియాలజిస్ట్ కాగా, డాక్టర్ రజియా షార్జాలోని అల్ నహ్దాలోని ప్రైమ్ మెడికల్ సెంటర్లో శిశువైద్యురాలిగా పనిచేస్తున్నారు. డా. ఫస్సలుదీన్ కొట్టాయం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, కోయంబత్తూర్ మెడికల్ కాలేజీలో ఎండీ(జనరల్ మెడిసిన్) చేశారు. అలాగే కాలికట్ మెడికల్ కాలేజీ నుండి కార్డియాలజీలో మెడిసిన్‌లో డాక్టరేట్ పొందారు. డా. రజియా కాలికట్ మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ చేశారు. యూకేలోని రాయల్ కాలేజీ నుండి ఆమె ఎంఆర్సీపీ, ఎంఆర్సీపీహెచ్ పొందారు.