యూఎస్‌లో షాకింగ్ ఘటన.. క్రిస్టల్ బాల్ మిగిల్చిన రూ.2కోట్ల భారీ నష్టం!

ABN , First Publish Date - 2021-03-14T18:32:17+05:30 IST

అమెరికాలోని విస్కాన్సిన్‌లో ఈ నెల 8న జరిగిన ఓ షాకింగ్ ఘటన తాజాగా బయటకు వచ్చింది. డెల్టాన్ టౌన్‌లోని సౌక్ కౌంటీ‌లో గల ఫాక్స్ హిల్ రోడ్డులో ఈ ఘటన జరిగింది.

యూఎస్‌లో షాకింగ్ ఘటన.. క్రిస్టల్ బాల్ మిగిల్చిన రూ.2కోట్ల భారీ నష్టం!

డెల్టాన్, విస్కాన్సిన్: అమెరికాలోని విస్కాన్సిన్‌లో ఈ నెల 8న జరిగిన ఓ షాకింగ్ ఘటన తాజాగా బయటకు వచ్చింది. డెల్టాన్ టౌన్‌లోని సౌక్ కౌంటీ‌లో గల ఫాక్స్ హిల్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఓ క్రిస్టల్ బాల్ కారణంగా స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో రెండు కోట్ల మేర నష్టం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. సౌక్ కౌంటీలోని ఫాక్స్ హిల్ రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో గత ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో మార్నింగ్ డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన యజమాని లోపలి నుంచి దట్టమైన పొగలు రావడం గమనించాడు. దాంతో వెంటనే 911కు కాల్ చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.


ఆయన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఆగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు 2.50లక్షల డాలర్లు(రూ.2కోట్లు) విలువ చేసే ఇంటి సామాగ్రితో ఇతర విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. కాగా, ఈ అగ్నిప్రమాదానికి కారణం మొదట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చని అధికారులు భావించారు. కానీ, పరిశీలించి చూసిన అధికారులకు షాకింగ్ విషయం తెలిసింది. క్రిస్టల్ బాల్(గాజు బంతి) కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.


ఇంటి కిటికీ ద్వారా ప్రసారమైన సూర్యరశ్మి బెడ్డు పక్కన ఓ టేబుల్‌పై ఉన్న క్రిస్టల్ బాల్‌పై పడింది. అనంతరం క్రిస్టల్ బాల్‌పై పడిన కాంతి పరావర్తనం చెంది నేరుగా బెడ్డుపై పడటంతో అగ్గి పుట్టింది. దాంతో నిమిషాల వ్యవధిలోనే ఇంట్లోని మిగతా వస్తువులకు మంటలు అంటుకోవడం, అవి కాలి బూడిద కావడం జరిగిపోయింది. ఇక్కడ క్రిస్టల్ బాల్ ఓ భూతద్దంలా పని చేయడం వల్ల అగ్గి పుట్టడం జరిగింది. ఇలా ఓ క్రిస్టల్ బాల్ ఇంట్లో మంటలు అంటుకోవడానికి కారణమైంది. Updated Date - 2021-03-14T18:32:17+05:30 IST