విద్యారంగంలో సంచలనం రేపుతున్న 'క్రౌడ్‌ ఫండింగ్‌'.. ఎంతోమంది తలరాతను మారుస్తోంది!

ABN , First Publish Date - 2021-11-21T15:59:36+05:30 IST

నువ్వు ఎవరో వాళ్లకు తెలియదు... వాళ్లు ఎవరో నీకు తెలియదు. ఒకరిది అవసరం... మరొకరిది మానవత్వం.

విద్యారంగంలో సంచలనం రేపుతున్న 'క్రౌడ్‌ ఫండింగ్‌'.. ఎంతోమంది తలరాతను మారుస్తోంది!

నువ్వు ఎవరో వాళ్లకు తెలియదు...  వాళ్లు ఎవరో నీకు తెలియదు. ఒకరిది అవసరం... మరొకరిది మానవత్వం. ఆ ఇద్దరినీ కలిపింది ‘క్రౌడ్‌ఫండింగ్‌’. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లోకి దళిత, వెనుకబడిన, మైనారిటీ వర్గాల విద్యార్థులు వెళ్లేలా చేస్తోంది. వారి ఆకాంక్షలు, ప్రతిభ, సేవా దృక్పథానికి చలించిపోయిన దాతలు వంద నుంచి వేల రూపాయల వరకు సాయం చేస్తున్నారు. కొందరు విద్యార్థులకైతే క్రౌడ్‌ఫండింగ్‌ వెబ్‌సైట్ల ద్వారా గంటల వ్యవధిలోనే లక్షలు సమకూరుతున్నాయి. విద్యారంగంలో సంచలనం రేపుతున్న ఈ కొత్త విప్లవం... ఎంతోమంది తలరాతను మారుస్తోంది.


అదొక దళితవాడ... అన్నీ పూరి గుడిసెలే. ఇల్లిల్లూ వెతికినా వెయ్యి రూపాయలు దొరకని దైన్యం. కులవృత్తిలో కొందరు... కూలీలుగా మరికొందరు.. ఏ పూటకా పూట జరిగితే ఒట్టు. ఊరి బడి చదువే గగనం.. ఇక పట్నం వెళ్లి కాలేజీ గడప తొక్కేదెప్పుడు? ఇంతవరకు ఒక్క దళితుడూ పెద్ద చదువు చదివింది లేదు. కనీసం కల కూడా కనలేని కఠిక పేదరికం. మోతుబరుల దగ్గర వెట్టిచాకిరీ చేస్తే కానీ గడవని కుటుంబాలు. సెల్‌ఫోన్‌ పట్టుకుని చెట్టుకింద కూర్చున్నాడొక యువకుడు. ఫోన్‌కు ఉప్పెనలా వచ్చిపడుతున్నాయి మెసేజ్‌లు. ‘క్రెడిటెడ్‌ హండ్రెడ్‌ రుపీస్‌’... ‘ఫైవ్‌ హండ్రెడ్‌’... ‘పిఫ్టీ థౌజెండ్‌’.. ‘వన్‌ లాక్‌’!. మూడే మూడు గంటలు. అతని బ్యాంక్‌ అకౌంట్‌లో పోగైన మొత్తం... రూ.37.17 లక్షలు. సాయం చేసిన దాతలు... రెండు వేల మంది. ఆ దళితవాడ గుడిసెల్లో నుంచి పట్నం కాదు.. నగరం కాదు.. ఏకంగా ఇంగ్లండ్‌లోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం మెట్లు ఎక్కిన ఆ యువకుడు సుమిత్‌ సమోస్‌. అతనికి దాతల సాయం అందేలా చేసింది ‘క్రౌడ్‌ ఫండింగ్‌’. విద్యారంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ... దళిత, బహుజన, ముస్లిం, మైనారిటీ విద్యార్థులకు వరంలా మారిందీ కొత్త మార్గం.


ఆ ఇద్దరూ...

మత మూఢత్వం.. మహిళల స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తుంది. కొందరైతే చదువుకోవడానికే కాదు, ఇల్లు దాటేందుకు కూడా ఒప్పుకోరు. అలాంటి కట్టుబాట్ల మధ్య పెరిగింది కశ్మీర్‌ యువతి సహ్రీన్‌ షమిమ్‌. అట్టడుగు వర్గాల ఆడపిల్లల కోసం ఒక బోర్డింగ్‌స్కూల్‌ను ఏర్పాటు చేసి, అందరికీ చదువు చెప్పాలన్నది ఆమె ఆశయం. ఆ బలమైన లక్ష్యం కోసమే ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో చదవాలనుకుంది. గడప దాటేందుకే ఇష్టపడని సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన సహ్రీన్‌కు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం (పబ్లిక్‌ పాలసీ ప్రోగ్రామ్‌) వెళ్లిందంటే క్రౌడ్‌ఫండింగే కారణం. సంబంధిత వెబ్‌సైట్లో వివరాలు పొందుపరిచిన పద్దెనిమిది రోజుల్లోనే రూ.28 లక్షలు వచ్చి పడ్డాయి. తనిప్పుడు లండన్‌లో చదువుతోంది. మహారాష్ట్రలోని ఓ మిల్లు కార్మికుని కూతురు హర్షాలి నగ్రేల్‌. సామాజిక కార్యకర్తగా పనిచేస్తూనే ఉపకార వేతనాలతో చదువుకుంది. తనకు రాజకీయ చైతన్యం ఎక్కువ. అందులో మరింత పరిణతి సాధించాలంటే లండన్‌ విశ్వవిద్యాలయంలో ‘ఎలక్షన్‌, కాంపెయిన్‌ అండ్‌ డెమొక్రసీ’ కోర్సు చదవాలనుకుంది. ఆ మాస్టర్స్‌ పూర్తి చేయడానికి ఇంచుమించు నలభై లక్షలు ఖర్చు అవుతుంది. అనేక ప్రయత్నాల తర్వాత విశ్వవిద్యాలయం ఆఫర్‌ లెటర్‌ వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. విద్యా రుణం కోసం దరఖాస్తు చేస్తే ఒక్క బ్యాంకూ ఇవ్వలేదు. ‘దాతల్లారా... నా కలను నెరవేర్చండి’ అంటూ క్రౌడ్‌ఫండింగ్‌ను ఆశ్రయించిందామె. తొలిరోజు దాతల నుంచి రెండు లక్షల సాయం అందింది. ఇప్పటివరకు రూ.32.79 లక్షలు పోగైనట్లు వెబ్‌సైట్‌ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 


సామాజిక దృక్పథంతో...

విదేశీ విద్య అనగానే... డాలర్లు కురిపించే పెట్టుబడి కాదు. అపరిమిత సామాజిక సేవకు అదొక కొత్త మార్గం... అనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సేవా దృక్పథంతో తమ పిల్లలను అమెరికా, ఇంగ్లండ్‌లలో చదివిస్తున్నారు. అయితే ఇలాంటి కోర్సులు చేశాక స్వచ్ఛందసంస్థలు, ఛారిటీలు, లాభాపేక్షలేని సంస్థల్లో మాత్రమే ఉద్యోగాలొస్తాయి. వీరికి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతో పోలిస్తే జీతాలు కూడా తక్కువే. కాబట్టి అప్పులు చేసి చదివించిన కుటుంబానికి ఆర్థికభారం పెరుగుతుంది. సరిగ్గా ఇలాంటి కష్టాన్ని ఎదుర్కొంది అర్చన. మానవహక్కుల కోసం పోరాడే న్యాయవాది ఆమె. జర్మనీలో ‘హ్యూమన్‌ రైట్స్‌, హుమానిటేరియన్‌ లా’లో మాస్టర్స్‌ చేయాలన్నది ఆమె జీవిత కల. లండన్‌లోని పలు విశ్వవిద్యాలయాల్లో సీట్లొచ్చాయి. కానీ, ఫీజులు కట్టలేక వదులుకోవాల్సి వచ్చింది. నాలుగేళ్ల సంఘర్షణ తరువాత చేసిన ఆఖరి ప్రయత్నం ఫలించింది. క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా సుమారు ఇరవై లక్షలు దాతల నుంచి లభించింది. ‘‘కొత్తతరంలో సామాజిక భావజాలం లేదనలేం. అందుకు మాలాంటి వాళ్లే నిదర్శనం. మేము విద్యను వాణిజ్య కోణంలో చూడటం లేదు. మాకు డాలర్‌డ్రీమ్స్‌ లేవు. మానవహక్కుల విషయంలో ప్రపంచదృక్పథం కోసం నేను ఈ కోర్సును చేస్తున్నాను. తిరిగి మన దేశం వచ్చాక మరింత బలంగా పనిచేసేందుకు ఈ చదువు తోడ్పడుతుంది..’ అంటోంది అర్చన.


మానవహక్కుల న్యాయవాది అర్చన మనస్తత్వమే నిరంజన్‌ సురేశ్‌ది కూడా. కొత్తతరానికి అంతర్జాతీయ దృక్ఫథం అర్థమైతేనే సామాజిక శక్తులను సమీకరించుకునే విస్తృతి పెరుగుతుందన్నది నిరంజన్‌ ఆలోచన. ఎలాగైనాసరే ఆక్స్‌ఫర్డ్‌లో చదవాలని తీర్మానించుకున్నాడు. అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తే కొంత మొత్తం పోగైంది. ఇంకా పదిహేను లక్షలు అవసరం. తన పరిస్థితి ఇదీ.. అంటూ క్రౌడ్‌ఫండింగ్‌ సహాయాన్ని అర్థించాడు. నిరంజన్‌ బాధను, ఆక్స్‌ఫర్డ్‌ ఆకాంక్షను అర్థం చేసుకున్న దాతలు ప్రపంచ నలుమూలల నుంచి స్పందించారు. వంద రూపాయల నుంచీ వేల రూపాయల వరకు డబ్బును పంపించి... అతని కలను నెరవేర్చారు. అవసరమైన డబ్బులు అందడంతో ఆక్స్‌ఫర్డ్‌లోకి వెళ్లగలిగాడు. ఇప్పటికైతే ఉన్నతవిద్యాసంస్థల్లో ప్రవేశానికే సాయపడుతున్న క్రౌడ్‌ఫండింగ్‌... ఇలాగే దూసుకెళితే భవిష్యత్తులో ఫీజులు కట్టలేని తల్లిదండ్రులు, ర్యాంకులు వచ్చినా బడిలో చేరలేని పిల్లలు ఉండరేమో అనిపిస్తుంది. - మల్లెంపూటి ఆదినారాయణ


సాయం చేసేది ఎవరు?

క్రౌడ్‌ఫండింగ్‌ వెబ్‌సైట్లు సాయం చేయవు. దాతలకు- విద్యార్థులకు అవి వారధులు మాత్రమే!. విద్యార్థి వ్యక్తిగత వివరాలతో పాటు... విద్యాలయాల్లో సీటు వచ్చినట్లు ధృవీకరించే ఆఫర్‌లెటర్‌తో పాటు... మిగిలిన వివరాలను గుర్తింపు పొందిన వెబ్‌సైట్‌లకు అందించాలి. ఆ సంస్థలు విద్యార్థుల సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా దాతల దృష్టికి తీసుకెళతాయి. అప్పుడు ఆ విద్యార్థి ప్రొఫైల్‌ నచ్చితేనే దాతలు సాయం చేయగలుగుతారు. ఈ సేవలకు గాను స్వల్ప కమీషన్‌ తీసుకుంటాయి వెబ్‌సైట్లు. అయితే క్రౌడ్‌ఫండింగ్‌ సంస్థల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. అవి చూసి మోసపోతున్న వాళ్లూ ఉన్నారు. గుర్తింపు లేని సంస్థలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్యాంకు వివరాలను ఇవ్వకూడదు. పేరున్న సంస్థల నిబంధనలనే పాటించాలి. 


ఎంతమంది వెళుతున్నారంటే...

విదేశీ విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతోందని కేంద్ర విద్యా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే కరోనా దెబ్బకు ఈ హవా 44 శాతం తగ్గింది. 2017లో 4.56 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకున్నారు. 2018లో 5.20 లక్షలు, 2019లో 5.88 లక్షలు, 2020లో 2.61 లక్షలు... ఈ ఏడాది సుమారు 71 వేల మంది (ఫిబ్రవరి వరకు) వెళ్లారు. ఇందులో క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా విదేశీ విద్యను అభ్యసిస్తున్న వాళ్లు పరిమితమే కావొచ్చు  కానీ... ఈ ట్రెండు మాత్రం వేగంగా పుంజుకుంటోంది. తద్వార విదేశాలకు వెళ్లాలనుకునే పేద వర్గాలకు  ఆశాదీపంలా కనిపిస్తోంది. ఒక్క ‘మిలాప్‌’ సంస్థ మాత్రమే  క్రౌడ్‌ఫండింగ్‌  ద్వారా 2021 జనవరి నుంచి జూన్‌ వరకు  9,200  మందికి రూ. 6.6 కోట్లను  దాతల ద్వారా విద్యార్థులకు  అందించింది. గత ఏడాది 11 వేల మంది విద్యార్థులకు  రూ.10.3 కోట్లు అందేలా చేసిందంటే  క్రౌడ్‌ఫండింగ్‌ ట్రెండ్‌ ఎంత జోరుగా సాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. 


మూడు గంటల్లోనే రూ.37 లక్షలు...

ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాకు చెందిన దళిత-క్రిస్టియన్‌ సుమిత్‌ సమోస్‌. ఇంట్లో తొలితరం విద్యావంతుడు. కులవివక్షపై తిరగబడ్డ చైతన్యశీలి. దళిత దృక్పథం అతని గళం. ర్యాప్‌ మ్యూజిక్‌తో అగ్గిని రాజేయగలడు. బిహార్‌లోని లక్ష్మణ్‌పూర్‌ బాథేలో రణవీర్‌సేన దళితుల్ని ఊచకోత కోసింది. ఆ మారణకాండను నిరసిస్తూ పాటలు కట్టి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు. అశుద్ధాన్ని చేతులతో ఎత్తివేసే కార్మికులపైనా ప్రత్యేక గీతాలను రాశాడు. కుల వివక్షను భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న దళిత విద్యార్దుల దీనగాథల్నీ ఆలపించాడు. ఢిల్లీలోని జేఎన్‌టీయూలో చదువయ్యాక విదేశాల్లో ఉన్నతవిద్య పూర్తి చేయాలన్నది సుమిత్‌ ఆలోచన. ఎందుకంటే - చదువుతోనే ప్రశ్నించేతత్వం అలవడుతుందన్న అంబేద్కరే అతనికి ప్రేరణ. లండన్‌- ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ‘మోడ్రన్‌ సౌత్‌ ఏసియన్‌ స్టడీస్‌’లో సీటొచ్చింది. విమాన టికెట్లు, ట్యూషన్‌ఫీజు, ఖర్చులు.. అన్నీ కలుపుకుంటే సుమారు రూ.47 లక్షలు అవుతుంది. లక్ష కూడా సమకూర్చుకునే పరిస్థితి లేదు. ఒక మిత్రుడి సలహాతో క్రౌడ్‌ ఫండింగ్‌ వెబ్‌సైట్‌ ‘మిలాప్‌’ను ఆశ్రయించాడు. తన విద్య, కుటుంబ, వ్యక్తిగత వివరాలన్నీ అందులో పోస్టు చేశాక.. సుమిత్‌ సామాజిక స్పృహకు మెచ్చిన దాతలు తక్షణమే స్పందించారు. కేవలం మూడు గంటల్లోనే రూ.37 లక్షల చందాలు ఇచ్చారు. ఆ తరువాత తనకు కావాల్సిన మొత్తం క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారానే సమకూరింది. ‘దాతలు నా పట్ల చూపిన ప్రేమకు ఉప్పొంగిపోయాను. ఆక్స్‌ఫర్డ్‌ చదువయ్యాక కూడా సమాజం కోసమే పనిచేస్తాను..’ అన్నాడు సుమిత్‌.


వైద్యం తరువాత విద్యకే..

వైద్యం ఖరీదైపోయిందిప్పుడు. ఆస్పత్రులకు వెళితే అప్పులపాలయ్యే పరిస్థితి. నిరుపేదలకైతే మరీ కష్టం. అవయవ మార్పిడి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, క్యాన్సర్‌ వంటివి వచ్చినప్పుడు క్రౌడ్‌ఫండింగ్‌లాంటివే దిక్కవుతున్నాయి. మిలాప్‌, కెట్టో, ఇంపాక్ట్‌గురు తదితర వెబ్‌సైట్లు బాధితుల వివరాలను దాతల దృష్టికి తీసుకెళుతున్నాయి. కోట్ల రూపాయలను సమీకరిస్తూ వందలాది రోగులకు చికిత్స చేయించి పునర్జన్మను ప్రసాదిస్తున్నాయివి. వైద్య సేవల్లో ఇదొక ఆశావహ పరిణామం. వైద్య అవసరాల తరువాత విద్య కోసం క్రౌడ్‌ఫండింగ్‌ను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య పెరుగుతోందిప్పుడు. ‘‘చదువు కోసం ఆర్థిక సహాయాన్ని పొందేవారి సంఖ్య బాగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే మూడొందల శాతం ఎక్కువైందని చెప్పవచ్చు’ అన్నారు కెట్టో సహ వ్యవస్థాపకుడు జహీర్‌. ఇందుకు కరోనా మహమ్మారి ఒక కారణం. కంపెనీల్లో కొత్త నియామకాలు తగ్గిపోవడం, ఉన్న ఉద్యోగాలు కోల్పోవడం, వేతనాల తగ్గింపు, ధరల పెరుగుదల, రుణాల చెల్లింపులో అవాంతరాలు వంటివన్నీ బ్యాంకులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. విదేశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రుణాలను చెల్లించలేక అగచాట్లు పడుతున్నారు. 2019లో విద్యారుణాల చెల్లింపు తగ్గిపోయినట్లు బ్యాంకుల అధ్యయనంలో తేలింది. గృహ, కారు రుణాలతో పోలిస్తే విద్యారుణాలు ఇవ్వడం ఏ బ్యాంకుకైనా అంత సురక్షితం కాదు. ఇది అన్‌సెక్యూర్డ్‌ లోన్‌ కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది అంటున్నారు బ్యాంకర్లు. ప్రభుత్వ బ్యాంకులు అయితే ఏడు నుంచి పది శాతం... ప్రైవేటు బ్యాంకులు మాత్రం పన్నెండు నుంచి పదమూడు శాతం వడ్డీకి విద్యా రుణాలు మంజూరు చేస్తున్నాయి. సుమారు ఏడున్నర లక్షల వరకు బ్యాంకులకు జామీను అవసరం ఉండదు. అంతకు మించితే మాత్రం ఆస్తులను చూపించాల్సిందే!. ఒక అధ్యయనం ప్రకారం విదేశాలకు వెళ్లాలనుకున్న దళిత, బహుజన, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడుతోంది. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థుల తల్లిదండ్రులకు స్థిరాస్తులు అంతగా ఉండవు. ఏ ఆస్తీ చూపించకపోతే లక్షల మొత్తాన్ని బ్యాంకులు మంజూరు చేయలేవు. ఇలాంటి పేద విద్యార్థులకు క్రౌడ్‌ఫండింగ్‌ ఆశాదీపంలా కనిపిస్తోంది. అయితే ఎవరికి పడితే వారికి దాతలు చందాలు ఇవ్వడం లేదు. మంచి చదువులు చదువుకుని, రేపు సమాజానికి పనికొస్తారనుకున్న వాళ్లకే సహాయం చేస్తున్నారు. విద్యార్థుల కుటుంబ, సామాజిక నేపథ్యం, సేవాదృక్పథం, భావజాలం వంటివన్నీ దాతలను ప్రభావితం చేస్తున్నాయి. ఆ ప్రత్యేకతలు పుణికిపుచ్చుకున్న అట్టడుగువర్గాల పిల్లలు క్రౌడ్‌ఫండింగ్‌తో రాత్రికి రాత్రే లక్షల సహాయం పొందుతూ... అమెరికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, కెనడాలలోని విశ్వవిద్యాలయాలకు వెళ్లగలుగుతున్నారు. ఈ రెండేళ్లలో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.


ఇప్పుడొచ్చింది కాదు..

క్రౌడ్‌ఫండింగ్‌... వినడానికి కొత్త కానీ... ఇదేమీ ఇప్పుడొచ్చింది కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే! ఇప్పుడు టెక్నాలజీతో కొత్త అవతారం ఎత్తింది. ఒకప్పుడు చందాలు, విరాళాలు, సాయాలు అనేవారు. నేటి ఇంటర్‌నెట్‌ యుగంలో క్రౌడ్‌ఫండింగ్‌ అంటున్నారంతే!. ప్రతి పల్లెలో గుడి, బడి తప్పనిసరి. ఊరంతా చందాలేసుకుని ఆలయాన్ని నిర్మిస్తారు. ఒకేచోట చదువుకున్న పూర్వ విద్యార్థులు చేతులుకలిపి.. బడి రూపురేఖలనే మార్చేస్తారు. ఆ మాటకొస్తే స్వాతంత్య్రపోరాటంలో గాంధీజీ సైతం విరాళాలు సేకరించి.. ఉద్యమాన్ని నడిపిన సంగతి తెలిసిందే!. అదే సంప్రదాయం అనేక పోరాటాలకు, ఉద్యమాలకు ఆర్థిక ఊపిరులూదింది. రాజకీయ పార్టీలు సైతం చందాలను వసూలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ క్రౌడ్‌ఫండింగ్‌ కోవలోకే వస్తాయి. ఇక, చరిత్రను తిరగేస్తే... హోమర్‌ రాసిన ప్రసిద్ధ గ్రీకు కావ్యం ఇలియడ్‌ను యంగ్‌ అలెగ్జాండర్‌ పోప్‌ ఆంగ్లంలోకి అనువదించారు. అయితే ఆ పుస్తకాన్ని ప్రచురించేందుకు వనరులు లేవు. అందుకని ‘సబ్‌స్ర్కిప్షన్‌ మెథడ్‌’ పేరుతో పాఠకుల నుంచి ముందుగానే చందాలు పోగుచేశారు. పుస్తకం తయారయ్యాక వారికి అందజేశారాయన. ఒక రకంగా క్రౌడ్‌ఫండింగ్‌ అనే భావనకు అలా బీజం పడింది అనుకోవచ్చు. 1874లో అమెరికాలో సైతం విరాళాలతోనే స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ నిర్మించారు. 1962లో చైనాపై యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు - పదిహేనేళ్ల వయసున్న భారత ఖజానాలో డబ్బులు లేవు. నాటి ప్రధాని నెహ్రూ పిలుపునివ్వడంతో లక్షల రూపాయల నగదుతోపాటు బంగారాన్ని కూడా అందించారు ప్రజలు. ఇటీవలే గుజరాత్‌లో నిర్మించిన పటేల్‌ విగ్రహ నిర్మాణాన్ని సైతం ప్రజల సాయంతోనే పూర్తి చేశారు. ఇవన్నీ క్రౌడ్‌ఫండింగ్‌తో చేసినవే!. ఇప్పుడు అందరి చేతుల్లోనూ సెల్‌ఫోన్లు రావడం, సాంకేతికత అభివృద్ధి చెందడం, నగదు లావాదేవీలు సులభతరం కావడం వల్ల.. ఎవరికైనా, ఎక్కడి నుంచి అయినా క్షణాల్లో డబ్బులు పంపే వెసులుబాటు లభించింది. ఇదే క్రౌడ్‌ఫండింగ్‌కు కలిసొచ్చింది.


ఎవరికి అందుతోంది సాయం? 

సేవా దృక్పథంతోనే ‘మిలాప్‌’, ‘కెట్టో’, ‘ఇంపాక్ట్‌గురు’ వంటి క్రౌడ్‌ఫండింగ్‌ సంస్థలు ఏర్పాటయ్యాయన్న విషయం గుర్తించాలి. మీ వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు చదువుతున్నారా? లేదంటే సామాజిక దృక్పథంతో ఉన్నత విద్యను పూర్తి చేయాలనుకుంటున్నారా? మీ వ్యక్తిగత అభిరుచులు, నిజాయితీ, వ్యక్తిత్వం, సామాజిక స్పృహ, చేస్తున్న కార్యక్రమాలు, సామాజిక మాధ్యమాల్లో మీ వైఖరి... వీటన్నిటినీ దాతలు పరిగణలోకి తీసుకుని... సాయంపై నిర్ణయం తీసుకుంటున్నారు. గ్రామీణ నిరుపేద వర్గాలైన దళిత, వెనుకబడిన, మైనారిటీ విద్యార్థులకు ఎక్కువ మంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వారికి ఆర్థిక వనరులను సమకూర్చుకునే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇందులోనూ ఆ విద్యార్థుల భావజాలం, సామాజిక ఆకాంక్షలు, కోర్సు పూర్తయ్యాక ఏం చేయాలనుకుంటున్నారు? ఇదివరకు ఎలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు? వంటివన్నీ పరిశీలిస్తున్నారు దాతలు. అన్నిటికంటే ఏ విశ్వవిద్యాలయంలో సీటు వచ్చిందన్నది ముఖ్యమైన అంశం. అంతర్జాతీయంగా పేరున్న ఆక్స్‌ఫర్డ్‌, లండన్‌ తదితర విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చిన వారికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తున్నది. చిన్న చిన్న కళాశాలలు, సాధారణ విశ్వవిద్యాలయాలలో సీట్లు వచ్చిన వాళ్లకు సాయపడేవాళ్లు తక్కువ. కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ప్రాథమిక పాఠశాలల అభివృద్ధి కోసం క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నిరుపేదలైన పిల్లలకు ఫీజులు చెల్లిస్తున్న దాతలు, పాఠశాలల అభివృద్ధికి లక్షలు వెచ్చిస్తున్న మనసున్న మనుషులు చాలా మందే ఉన్నారు. ఇవన్నీ సంప్రదాయ సేవా పద్ధతులు అయితే క్రౌడ్‌ఫండింగ్‌ పూర్తీగా డిజిటల్‌ సాయం లాంటిదన్నమాట. 

Updated Date - 2021-11-21T15:59:36+05:30 IST