దుబాయ్‌లో కరోనా వైద్యం ఉచితం..

ABN , First Publish Date - 2021-05-31T02:01:29+05:30 IST

సాధారణంగా ప్రజాస్వామ్య దేశాల్లో వ్యవస్థలు బలంగా ఉంటాయి. అదే రాచరిక వ్యవస్థలో అయితే రాజు ఉదారత మీద ఆధారపడి ఉంటుందని’ చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం.

దుబాయ్‌లో కరోనా వైద్యం ఉచితం..

‘సాధారణంగా ప్రజాస్వామ్య దేశాల్లో వ్యవస్థలు బలంగా ఉంటాయి. అదే రాచరిక వ్యవస్థలో అయితే రాజు ఉదారత మీద ఆధారపడి ఉంటుందని’ చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ, ప్రజారోగ్యంలో దుబాయి ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ, చొరవ అద్భుతం. నిజానికి దుబాయిలో వైద్యం అత్యంత ఖరీదైనది. ఒక పెద్ద ఆస్పత్రిలోని డాక్టరు కన్సల్టెన్సీ ఫీజు మన కరెన్సీలో ఇరవై నుంచి ముఫ్ఫైవేల రూపాయలు. అందుకే అక్కడ ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి. ప్రైవేటు ఆస్పత్రులకు పోటీగా ప్రభుత్వ దవాఖానాలు సేవలు అందిస్తాయి. కరోనా నియంత్రణలో అయితే మనకంటే దుబాయి ఎంతో ముందుంది. ఇప్పుడక్కడ కేసులు తగ్గిపోయాయి. అందుకు కారణం పాలకుల దార్శనికత, ముందుచూపే అంటారు దుబాయిలో పనిచేస్తున్న తెలుగు డాక్టర్‌ శశికుమార్‌. ‘‘దుబాయిలో కరోనా చికిత్స పూర్తిగా ఉచితం. ఇదే కాదు.. కలరా, క్షయ తదితర వ్యాధులకు అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా మంచి వైద్యం అందిస్తారు. కరోనా  తొలిదశలోనే ప్రభుత్వం అప్రమత్తమై స్టార్‌ హోటళ్లను సైతం ఐసొలేషన్‌ వార్డులుగా మార్చింది. వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ బెడ్ల కొరత లేకుండా చూసింది. విస్తృతంగా రోగనిర్థారణ పరీక్షలు జరిపారు వైద్యసిబ్బంది. మరణాలు బాగా తగ్గాయి. 


70 శాతం మందికి వాక్సిన్‌..

దుబాయి వాసుల్లో డెభ్భైశాతం మంది ఇప్పటికే రెండు డోసుల వాక్సిన్‌ వేసుకున్నారు. ‘ఇక్కడ వాక్సినేషన్‌ ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతోంది. ఫైజర్‌, సినోఫార్మ్‌ టీకాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా అందిస్తున్నది. నేనూ సుమారు ఇరవై వేలమందికి టీకాలు వేశాను. ఎవరికీ ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తలేదు. వాక్సిన్‌ తీసుకోవడం వల్ల దుష్ఫ్రభావాలేమీ ఉండవని అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. రిస్కు గ్రూపు ఆధారంగా ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు లోబడి వాక్సిన్‌  ఇస్తున్నారు. అందులో రికమండేషన్లు, రెఫరెన్సులు వంటివి అస్సలు చెల్లవు. అత్యంత ధనికులకైనా, నిరుపేదలకైనా ఒకటే నిబంధన. సెలబ్రిటీలు సైతం అందరితో పాటు క్యూలో నిల్చోవాల్సిందే. అదే దుబాయి పాలనా వ్యవస్థలోని ప్రత్యేకత. భారత్‌లో కూడా అలాంటి మార్పు రావాలి’ అంటున్నారు డా.శశికుమార్‌.


అత్యవసర సేవలు కూడా...

దుబాయిలో భారతీయ వలస కూలీలే కాదు, వైద్యులూ ఎక్కువే. అందులో మన తెలుగు ప్రాంతాలకు చెందిన డాక్టర్లు సుమారు మూడొందల మంది ఉన్నారని అంచనా. దుబాయిలో గుండెపోటు, రోడ్డు ప్రమాదం, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటి అత్యవసర కేసులకు ఉచితంగా చికిత్సను అందిస్తారు. వాటికి ఆరోగ్య బీమాతో పనిలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని కాపాడేందుకు ఆ వ్యక్తిపై ఎంత సొమ్ము అయినా ఖర్చుపెట్టేందుకు దుబాయి ప్రభుత్వం వెనుకాడదు. ‘నేను రషీద్‌ ఆస్పత్రిలోని ట్రామా కేర్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాను. రోడ్డు ప్రమాదంలో గాయపడో, గుండెపోటుతోనో... ఇలా ఎంతో మంది క్రిటికల్‌ కేర్‌లో అడ్మిట్‌ అవుతుంటారు. వారందరికీ ట్రీట్మెంట్‌తో పాటు మందులు కూడా ఉచితమే. ఖరీదైన లైఫ్‌ సేవింగ్‌ ఇంజక్షన్లు వేసినా పైసా తీసుకోరు. అలాంటి వెసులుబాటు ఉంది కనుకే వెనకాముందూ చూడకుండా రోగి ప్రాణాలు కాపాడటం మీదే మేము దృష్టి పెడతాం. కొన్ని సర్జరీలకు మాత్రమే బీమా అవసరం’ అంటారు డా.శశి. 


తెలుగువాళ్లకు తోడ్పాటు....

డాక్టర్‌ శశికుమార్‌ సొంతూరు ఏలూరు తాలూక కొణికి. ఆయన వైజాగ్‌, ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదివారు. పుదుచ్చేరిలో ఎమర్జెన్సీ మెడిసిన్‌పై పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అనంతరం రషీద్‌ ఆస్పత్రిలోని ట్రామాకేర్‌లో వైద్యుడిగా చేరాడు. కరోనా సమయంలో దుబాయిలో కొవిడ్‌ బారినపడిన కొన్ని వందల మంది తెలుగువాళ్లకు ఆయన ఫోన్‌ ద్వారా వైద్య సలహాలు, సూచనలను అందించారు. ఒకవైపు ఆస్పత్రిలో డ్యూటీ చేస్తూనే, తీరిక సమయాల్లో, సెలవురోజుల్లో కరోనా  రోగులకు ఫోన్లలో అందుబాటులో ఉండేవారు. అందుకోసం రోజుకి ఒక్కోసారి ఇరవై గంటలు కూడా పనిచేసిన సందర్భాలున్నాయి. అలా ఇప్పటి వరకు సుమారు మూడు వేలమంది కరోనా బాధితులకు ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా చికిత్స అందించారు శశి. వైద్యం విషయంలో - దుబాయి నుంచి భారత్‌ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. 

                                                                                                                   - కారుసాల వెంకటేశ్‌ 

Updated Date - 2021-05-31T02:01:29+05:30 IST