Vaccine lottery: ఒక్క టీకాతో రూ.7.45కోట్లు గెలుచుకుంది!

ABN , First Publish Date - 2021-07-08T20:49:31+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రోత్సాహించేందుకు తాయిలాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Vaccine lottery: ఒక్క టీకాతో రూ.7.45కోట్లు గెలుచుకుంది!

డెన్వర్, కొలరాడో: అగ్రరాజ్యం అమెరికాలో పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రోత్సాహించేందుకు తాయిలాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాగే కొలరాడో రాష్ట్రం కూడా ప్రజలను టీకాలవైపు ఆకర్షించేందుకు ఒక మిలియన్ డాలర్ల వ్యాక్సిన్ లాటరీని ప్రకటించింది. ప్రతి వారం డ్రా నిర్వహించి విజేతకు 1 మిలియన్ డాలర్లు ఇస్తోంది. కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారు ఈ లాటరీకి అర్హులు. దీనిలో భాగంగా ఈ వారం తీసిన వ్యాక్సిన్ లాటరీ డ్రాలో ఓ మహిళకు అదృష్టం వరించడంతో జాక్‌పాట్ కొట్టింది. లక్కీ డ్రాలో హైడీ రెస్సెల్​ విజేతగా నిలిచింది. రాష్ట్ర గవర్నర్​ జార్డ్​ పోలీస్ ఆమెను విజేతగా ప్రకటించారు​. దీంతో హైడీ 1 మిలియన్​ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.7.45కోట్లు) గెలుచుకుంది. 


ఈ విషయం తెలియగానే తన ఆనందానికి అవధుల్లేవని హైడీ తెలిపింది. తన నలుగురు పిల్లల భవిష్యత్తుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఇక జూన్ నుంచి జూలై మొదటి వారం వరకు ఐదుగురు విజేతలకు కొలరాడో ఇలా తలో 1 మిలియన్ డాలర్లు ఇచ్చింది. అలాగే 12-17 ఏళ్ల వారిని టీకాలు తీసుకునేలా ప్రోత్సాహించేందుకు 50వేల డాలర్ల స్కాలర్‌షిప్స్‌ను కూడా ప్రకటించింది కొలరాడో రాష్ట్రం. అయితే, ఈ ప్రోత్సాహకాలు టీకా రేట్ల పెరుగుదలకు ఎంతమాత్రం ఉపయోగపడలేదని తాజాగా వెలువడిన ఆ రాష్ట్ర డేటా చెబుతోంది. మే 26 నుంచి జూన్ 26 వరకు కేవలం 501,000 డోసుల పంపిణీ మాత్రమే జరిగింది. మొత్తంగా చూస్తే నెల రోజుల్లో వ్యాక్సినేషన్ 43 శాతం తగ్గినట్లు అధికారులు చెప్పారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.2 మిలియన్ డోసుల టీకా పంపిణీ జరిగినట్లు డేటా చూపిస్తోంది.  

Updated Date - 2021-07-08T20:49:31+05:30 IST