మా పైనే మీమ్స్ చేస్తావా.. యువకుడికి చుక్కలు చూపించిన పోలీసులు!

ABN , First Publish Date - 2021-11-03T01:58:30+05:30 IST

చైనా పోలీసులకు వ్యతిరేకంగా మీమ్స్ షేర్ చేస్తే జరిగింది ఇదీ..

మా పైనే మీమ్స్ చేస్తావా.. యువకుడికి చుక్కలు చూపించిన పోలీసులు!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా ఆంక్షల అమలు విషయంలో చైనా పోలీసులు చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి తగు శిక్షలు విధిస్తున్నారు. అయితే.. ఇదంతా భరించలేకపోయిన లీ అనే యువకుడు తన బాధంగా తన సోషల్ మీడియా మిత్రులతో వీచాట్‌లో పంచుకున్నాడు. చివరాకరున ఓ మీమ్ కూడా షేర్ చేశాడు. కుక్క తలపై పోలీసుల టోపీ ఉన్న ఫొటో అది! పోలీసుల అతిచేష్టలకు నిరసనగా చైనాలో ఎప్పటినుంచో బాగా ప్రచారంలో ఉంది. దీన్నే లీ కూడా షేర్ చేశాడు. అయితే.. ఇదంతా తమ ప్రైవేటు గ్రూప్‌లో ప్రస్తావించాడు.


 దురదృష్టవశాత్తూ ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు అతడిని స్టేషన్‌కు పిలిపించి పలు ప్రశ్నలు వేశారు. చివరికి అతడు చేసింది నేరమని, పోలీసులను ఉద్దేశపూర్వకంగానే అవమానించాడని నిర్ణయించారు. ఇందుకు శిక్షగా లీని ఏకంగా 9 రోజుల పాటు కస్టడీలో ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే..నెటిజన్లు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. పోలీసులు మాత్రం తమ నిర్ణయం సరైనదే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా తాము కరోనాతో ముందువరుసలో నిలబడి పోరాడుతున్నామని, ప్రజల రక్షణ కోసం పాటుపడుతున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-11-03T01:58:30+05:30 IST