ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో రేప్.. రక్షణ మంత్రి కార్యాలయం సాక్షిగా దారుణం
ABN , First Publish Date - 2021-02-17T12:24:49+05:30 IST
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో దారుణం జరిగింది. ఆ దేశ చట్టసభలోని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం సాక్షిగా
- బాధితురాలు, నిందితుడు అక్కడి ఉద్యోగులే
- లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఆఫీసుకు తీసుకెళ్లి అత్యాచారం
- రెండేళ్ల క్రితం ఘటన.. అప్పట్లోనే మంత్రి, పోలీసుల దృష్టికి ఘోరం
- బాధితురాలికి ఆస్ట్రేలియా ప్రధాని క్షమాపణ.. విచారణకు ఆదేశం
సిడ్నీ, ఫిబ్రవరి 16: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో దారుణం జరిగింది. ఆ దేశ చట్టసభలోని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం సాక్షిగా ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఆ దేశ ప్రధా ని స్కాట్ మారిసన్ సర్కారులో 26 ఏళ్ల బాధితురాలు ఉద్యోగి. రెండేళ్ల క్రితం ఆమెపై సీనియర్ ఉద్యోగి ఘోరానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురించి అప్పట్లోనే పోలీసులకు చెప్పిన బాధితురాలు ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. కార్యాలయంలోని ఉన్నతాధికారులకు చెప్పినా మద్దతు లభించలేదు. సోమవారం ఓ టీవీ ఇంటర్వ్యూలో తనపై జరిగిన దారుణాన్ని చెప్పుకోవడంతో ప్రపంచానికి తెలిసింది. అయితే నిందితుడి పేరును వెల్లడించలేదు.
ఆ రోజు ఏం జరిగింది?
బాధితురాలి వివరాల ప్రకారం.. అది 2019 మార్చి. రక్షణ మంత్రి లిండా రెనాల్డ్స్ కార్యాలయంలో ఆ యువతి చేరి కొన్ని వారాలే అ యింది. ఆ రోజు పనివేళల తర్వాత సహచర ఉద్యోగులతో కలిసి మద్యం తాగేందుకు ఆమె బయటకు వచ్చారు. చీకటిపడ్డాక బృందంలోని ఓ వ్యక్తి ఇంటి వద్ద దిగబెడతానంటూ ఆమెను తన వాహనంలో ఎక్కించుకున్నాడు. నేరుగా పార్లమెంట్ హౌస్‌లోని రక్షణ మంత్రిత్వశాఖ కార్యాలయంలోకి తీసుకెళ్లాడు. మద్యం మత్తు లో ఆమె ఆఫీసులోనే నిద్రలోకి జారుకున్నారు. మెలకువ వచ్చి చూసేసరికి ఆమెపై అతడు అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. విడిచిపెట్టాలని వేడుకున్నానని బాధితురాలు చెప్పారు. కాగా, ఇది దురదృష్టకరమైన ఘటన అని ఆ దేశ ప్రధాని మారిసన్ అభివర్ణించారు. బాధితురాలికి క్షమాపణలు చెప్పిన ప్రధాని, ఘటనపై విచారణ జరపాలని అదేశించారు.