అంతరిక్షం నుంచి భూమిని చూడడం ఓ ఉత్కంఠభరిత అనుభవం

ABN , First Publish Date - 2021-07-12T20:18:58+05:30 IST

అంతరిక్షం నుంచి భూమిని చూడడం ఓ ఉత్కంఠభరితమైన అనుభవం అని ఇంతకు ముందు అంతరిక్షయానం చేసి వచ్చిన పలువురు వ్యోమగాములు వెల్లడించారు. వారు తమ అనుభవాలను పుస్తకాలు, వ్యాసా

అంతరిక్షం నుంచి భూమిని చూడడం ఓ ఉత్కంఠభరిత అనుభవం

పలు దేశాల ఆస్ట్రోనాట్ల మనోగతాలు

అంతరిక్షం నుంచి భూమిని చూడడం ఓ ఉత్కంఠభరితమైన అనుభవం అని ఇంతకు ముందు అంతరిక్షయానం చేసి వచ్చిన పలువురు వ్యోమగాములు వెల్లడించారు. వారు తమ అనుభవాలను పుస్తకాలు, వ్యాసాలు, వివిధ వేదికల ద్వారా పంచుకున్నారు. వారిలో కొందరు ప్రస్తుతం లేకున్నా.. ఆ అనుభవాలను భవిష్యత్‌ తరాలకు అందజేశారు. సైన్స్‌ఫిక్షన్‌ సినిమాల్లో అంతరిక్షయానాన్ని ఓ సాహసం, హాస్యంగా చూపుతారేతప్ప.. అసలు పరిస్థితులు వేరుగా ఉంటాయని పేర్కొన్నారు. రోదసిలో పరిస్థితులు అంత ఆహ్లాదకరంగా ఉండవని, ఒళ్లంతా నీరసంగా.. మగతగా ఉంటుందని చెబుతున్నారు. రిచర్డ్‌ బ్రాన్సోన్‌ బృందం అంతరిక్షయానానికి సిద్ధమవుతున్న వేళ.. వారి అనుభవాలు..


అదో గొప్ప అడుగు: నీల్‌ ఆమ్‌స్ట్రాంగ్‌

చంద్రుడిపై కాలుమోపిన మొదటి వ్యోమగామి నీల్‌ ఆమ్‌స్ట్రాంగ్‌ భూమికి వచ్చాక.. ‘‘చంద్రుడిపైన ఆ చిన్న అడుగే.. మానవాళి పాలిట ఓ భారీ అడుగు’’ అని వ్యాఖ్యానించారు. 


సారే జహాసె అచ్ఛా: రాకేశ్‌ శర్మ

భారతదేశం తరఫున మొదటి వ్యోమగామి రాకేశ్‌ శర్మను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ‘‘అంతరిక్షం నుంచి మనదేశం ఎలా కనిపించింది?’’ అని ప్రశ్నించగా.. ఆయన ‘‘సారే జహాసె అచ్ఛా’’ అని సమాధానమిచ్చారు. 



మధుర క్షణాలు: డాన్‌ వింటర్స్‌

55 రోజుల పాటు రోదసిలో ఉన్న నాసా వ్యోమగామి డాన్‌ వింటర్స్‌ అక్కడున్నప్పుడు మధుర క్షణాలను అనుభవించానని చెప్పారు. ‘‘అంతరిక్షం నుంచి భూమిని చూస్తూంటే.. ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేం’’ అని చెప్పారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో.. ఒంట్లోని రక్తం కింది నుంచి పైకి పాకుతున్నట్లు అనిపిస్తుంది. పొట్ట తగ్గినట్లుగా, ఎత్తు రెండు అంగుళాల దాకా పెరిగినట్లుగా గుర్తిస్తాం. ఆ స్థితిలో ఒక్కో సందర్భంలో భరించలేనంతగా తలపోటు వస్తుంది. వికారం కలుగుతుంది. రాత్రి, పగలులేని స్థితిలో ఉంటాం. స్లీపింగ్‌ బ్యాగ్‌లో పడుకున్నప్పుడు హుక్‌కు తగిలించుకోకుంటే.. నిద్ర లేచేసరికి ముఖం ముందు చేతులు తేలుతూ కనిపిస్తాయి’’ అని ఆయన వివరించారు.


భారీ ఇసుక తుపానును చూశా: థామస్‌

రెండు సార్లు రోదసికి వెళ్లొచ్చిన ఫ్రెంచ్‌ వ్యోమగామి థామస్‌ పెస్‌క్వెట్‌ కూడా అక్కడి నుంచి భూమిని చూడడం ఉత్కంఠభరితంగా ఉంటుందన్నారు. ‘‘నేను అంతరిక్షం నుంచి గల్ఫ్‌ దేశమైన బహ్రెయిన్‌లో ఓ భారీ ఇసుక తుపానును చూశాను. కొన్ని డజన్ల కిలోమీటర్ల ఎత్తులో ఇసుక ఎగిరే అద్భుత దృశ్యాన్ని చూసి అబ్బురపోయాను’’ అని అన్నారు.


సైన్స్‌ను చూశా: యూరి గగారిన్‌

ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యోమగామి, రష్యాకు చెందిన యూరి గగారిన్‌ భూమిపైకి తిరిగి రాగానే.. తాను సైన్స్‌ను చూశానని, దేవుడిని కాదని వ్యాఖ్యానించారు. ‘‘అంతరిక్షంలో ఉన్నప్పుడు దేవుడి కోసం ఎంతగానో వెతికాను. కానీ, ఆయన కనిపించలేదు’’ అని వ్యాఖ్యానించారు.


Updated Date - 2021-07-12T20:18:58+05:30 IST