భారత్‌లో లాక్‌డౌనే కరెక్ట్.. లేకపోతే పరిస్థితులు ఘోరం: ఆంటోనీ ఫౌచీ

ABN , First Publish Date - 2021-05-02T13:08:50+05:30 IST

భారత్‌లో వైర్‌సను కట్టడి చేసేందుకు తక్షణమే కొన్ని వారాల పాటు పూర్తిగా లాక్‌డౌన్‌ విధించాలని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు, అధ్యక్షుడు బైడెన్‌ ప్రధాన వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ అన్నారు. భారత్‌ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న ఆయన.. చైనా తరహాలో అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పరిస్థితులను సమగ్రంగా పర్యవేక్షించేందుకు కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

భారత్‌లో లాక్‌డౌనే కరెక్ట్.. లేకపోతే పరిస్థితులు ఘోరం: ఆంటోనీ ఫౌచీ

అమెరికా వైరాలజిస్ట్‌ ఆంటోనీ ఫౌచీ

అన్నిరకాలుగా అండగా ఉంటాం: బైడెన్‌

భారత్‌లో విషాదకర పరిస్థితులు: కమల

న్యూఢిల్లీ, మే 1: భారత్‌లో వైర్‌సను కట్టడి చేసేందుకు తక్షణమే కొన్ని వారాల పాటు పూర్తిగా లాక్‌డౌన్‌ విధించాలని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు, అధ్యక్షుడు బైడెన్‌ ప్రధాన వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ  అన్నారు. భారత్‌ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న ఆయన..  చైనా తరహాలో అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పరిస్థితులను సమగ్రంగా పర్యవేక్షించేందుకు  కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తక్షణమే ఆక్సిజన్‌, చికిత్సకు అవసరమైన ఔషధాలు, పీపీఈ కిట్లు సమకూర్చుకోవాలని సూచించారు. కొన్ని వారాలు లాక్‌డౌన్‌తో  పెద్దగా సమస్యలేమీ ఉండవని తెలిపారు. ఇందుకు చైనాను ఉదాహరణగా పేర్కొన్నారు. భారత్‌లో పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయని అమెరికా చట్టసభ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  అమెరికా సహాయం అవసరమని ప్రతినిధుల సభ సభ్యుడు బ్రాడ్‌ షేర్‌మాన్‌ అన్నారు. బ్రాడ్‌, ఇతర చట్టసభ సభ్యులు భారత రాయబారి తరణ్‌జీత్‌సింగ్‌ సంధుతో సమావేశమయ్యారు. వీలైనంత ఎక్కువ సాయం చేయాలని అధ్యక్షుడు బైడెన్‌కు లేఖ రాశారు. భారత్‌కు అన్ని రకాలుగా అండగా నిలవాలని బైడెన్‌ తన యంత్రాంగాన్ని ఆదేశించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కూడా భారత్‌కు పూర్తి సహకారం అందిస్తామన్నారు. భారత్‌లో కరోనా పరిస్థితులను ‘విషాదకరం’ అని అభివర్ణించారు.  


2శాతం మందికే టీకా!

అందరికీ టీకాతోనే కరోనా కట్టడి సాధ్యమని ఫౌచీ అన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో ఇప్పటి వరకు 2ు మందే పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారని గుర్తుచేశారు. ఈ లెక్కన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తవడానికి చాలా కాలం పడుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్‌ తయారీ సంస్థలతో వీలైనంత త్వరగా ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. అలాగే భారత్‌లోని సంస్థలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని ఫౌచీ హితవు పలికారు. చైనా తరహాలో భారత్‌లోనూ యుద్ధప్రాతిపదికన కొవిడ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలన్నారు.


Updated Date - 2021-05-02T13:08:50+05:30 IST