అనుమానంతో టీనేజ్ కూతురిని కాల్చి చంపిన తండ్రి.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-12-31T15:09:21+05:30 IST

ఎవరో ఆగంతకుడు ఇంట్లో చొరబడ్డాడనే అనుమానంతో ఓ తండ్రి 16 ఏళ్ల టీనేజ్ కూతురిని తుపాకీతో కాల్చిచంపిన ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని ఒహియోలో వెలుగు చూసింది.

అనుమానంతో టీనేజ్ కూతురిని కాల్చి చంపిన తండ్రి.. అసలేం జరిగిందంటే..

ఒహియో: ఎవరో ఆగంతకుడు ఇంట్లో చొరబడ్డాడనే అనుమానంతో ఓ తండ్రి 16 ఏళ్ల టీనేజ్ కూతురిని తుపాకీతో కాల్చిచంపిన ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని ఒహియోలో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే.. ఓహియోలోని కొలంబస్​లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 4.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో అలారం​ మోగడంతో నిద్రలేచిన ఆ తండ్రికి ఇంట్లో ఎవరో ఆగంతకుడు చొరబడినట్లు అనిపించింది. ఆ అనుమానంతోనే అటువైపు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. కొంతసేపటి తర్వాత అక్కడికి వెళ్లి చూశాడు. అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. 


కన్న కూతురు రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గుర్తించి బోరున విలపించాడు. వెంటనే అతడి భార్య 911కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. ఆమె సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కొలంబస్ పోలీసులు తమతో పాటు వచ్చిన ఎమర్జెన్సీ బృందం సహాయంతో టీనేజర్‌ను హుటాహుటిన మౌంట్ కార్మెల్ ఈస్ట్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతున్న క్రమంలో ఆమె ఉదయం 5.42 గంటలకు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలిని జానే హెయిర్‌స్టన్‌గా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కొలంబస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-31T15:09:21+05:30 IST