కిడ్నాపర్‌తో పోరాడి మరీ తప్పించుకున్న 11 ఏళ్ల బాలిక.. ఫ్లోరిడాలో..
ABN , First Publish Date - 2021-05-21T17:30:55+05:30 IST
అమెరికాలోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ బస్ కోసం బస్‌స్టాప్ వద్ద ఎదురుచూస్తున్న 11 ఏళ్ల బాలికను ఓ దుండగుడు అపహరించబోయాడు.

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ బస్ కోసం బస్‌స్టాప్ వద్ద ఎదురుచూస్తున్న 11 ఏళ్ల బాలికను ఓ దుండగుడు అపహరించబోయాడు. సాయుధుడైన సదరు వ్యక్తితో ఏమాత్రం భయపడకుండా పోరాడి మరీ తప్పించుకుందా బాలిక. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా ఫ్లోరిడా పోలీసులు విడుదల చేయడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాలోని పెన్సాకోలాలో మే 18న ఈ ఘటన జరిగింది. 11 ఏళ్ల బాలిక బస్‌స్టాప్ వద్ద స్కూల్ బస్ కోసం ఎదురుచూస్తోంది. అటుగా వచ్చిన ఓ వ్యక్తి.. బాలిక ఒంటరిగా ఉండడం చూసి తన కారును ఆపాడు. వెంటనే కారు దిగి బాలికవైపు పరుగు అందుకున్నాడు. తనవైపు వ్యక్తి పరుగెత్తుకు రావడం గమనించిన బాలిక అతడికి దొరకకుండా ఆమె కూడా పరుగెత్తింది.
కానీ, దుండగుడు బాలికను పట్టుకుని, కారువైపు తీసుకెళ్లేందుకు యత్నించాడు. దాంతో బాలిక ఆ వ్యక్తితో పోరాడింది. బాలిక తెగువను చూసిన సదరు వ్యక్తి ఆమెను అక్కడే వదిలేసి తన వాహనంలో అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత బాలిక కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన బాలిక తన పేరెంట్స్‌తో జరిగిన విషయం చెప్పింది. దాంతో ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మరుసటి రోజు 30 ఏళ్ల ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బాలిక భయపడకుండా పోరాడి మరీ దుండగుడి నుంచి తప్పించుకున్న తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Video source by: CBS News