కెనడాలోని భారతీయులకు బెదిరింపులు.. స్పందించిన ప్రభుత్వం!

ABN , First Publish Date - 2021-02-26T05:38:37+05:30 IST

కెనడాలోని భారతీయులకు ఖలీస్థానీల నుంచి బెదిరింపులు వచ్చినట్టు వార్తలు వెలువడ్డ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతి

కెనడాలోని భారతీయులకు బెదిరింపులు.. స్పందించిన ప్రభుత్వం!

న్యూఢిల్లీ: కెనడాలోని భారతీయులకు ఖలీస్థానీల నుంచి బెదిరింపులు వచ్చినట్టు వార్తలు వెలువడ్డ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడారు. ఖలీస్థానీల నుంచి భారతీయులకు బెదిరింపులు వచ్చినట్టు వార్తలు వచ్చిన తరుణంలో భారతీయులకు భద్రత కల్పించాలని అక్కడి అధికారులను కోరినట్టు తెలిపారు. ఇదే సమయంలో కెనడాలోని భారతీయులకు కూడా కొన్ని సూచనలు చేశారు. బెదిరింపులు మళ్లీ వస్తే.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. అంతేకాకుండా ఒట్టావా హై కమిషన్, అక్కడి ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా కొందరు ప్రవాసులు కెనడాలో తిరంగ ర్యాలీ చేపట్టారు. భారత ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. ఆన్‌లైన్ వేదికగా ఖలీస్థానీల నుంచి తమకు బెదిరింపులు వచ్చినట్టు అలయన్స్ ఆఫ్ ఇండో-కెనడియన్స్ (ఎన్ఏఐసీ).. కెనడా ప్రజా భద్రతా, అత్యవసర సన్నద్ధత మంత్రి బిల్ బ్లెయిర్‌కు ఓ లేఖ రాసింది. ఖలీస్థానీల బెదిరింపుల నేపథ్యంలో దేశంలోని కెనడియన్ హిందూవులు, మోడరేట్ సిక్కులకు భద్రతా కల్పించాల్సిందిగా లేఖలో ఎన్ఏఐసీ పేర్కొంది. ఆన్‌లైన్ వేదికగా తమ కుటుంబంలోని మహిళలపై అత్యాచారం, హింసాత్మక ఘటనలకు పాల్పడుతామని ఖలీస్థానీలు బెదిరించినట్లు తెలిపింది. అలాగే ఇక్కడి భారతీయుల వ్యాపారాలను కూడా దెబ్బతీస్తామని వారు బెదిరించారని ఎన్ఏఐసీ తన లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.


Updated Date - 2021-02-26T05:38:37+05:30 IST