అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటా.. 8 మంది మృతి!
ABN , First Publish Date - 2021-03-17T15:06:21+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. యూఎస్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. అంట్లాంటా, అక్వర్త్ ప్రాంతాల్లోని మూడు మసాజ్ సెంటర్లలో మంగళవారం సాయంకాలం వేళ(అమెరికా కాలమానం ప్రకారం) ఈ కాల్పులు జరిగాయి.
జార్జియా, అట్లాంటా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. యూఎస్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. అంట్లాంటా, అక్వర్త్ ప్రాంతాల్లోని మూడు మసాజ్ సెంటర్లలో మంగళవారం సాయంకాలం వేళ(అమెరికా కాలమానం ప్రకారం) ఈ కాల్పులు జరిగాయి. కాగా, మృతుల్లో ఎక్కువ మంది ఆసియా మహిళలే ఉన్నారని చెరోకి కౌంటీ పోలీసులు వెల్లడించారు. 21 ఏళ్ల ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తొలుత అక్వర్త్‌లోని యంగ్ ఏసియన్ మసాజ్ సెంటర్ వద్ద దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అక్కడ మరో ఇద్దరు మృతి చెందారు. కొద్ది సేపటి తర్వాత 6.00 గంటల ప్రాంతంలో అట్లాంటాలోని మరో రెండు మసాజ్ సెంటర్ల వద్ద జరిగిన కాల్పుల్లో నలుగురు మహిళలు మరణించారు.
ఇలా గంట వ్యవధిలోనే చోటుచేసుకున్న ఈ రెండు కాల్పుల ఘటనల్లో 8 మంది మృతి చెందడం బాధాకరం. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉండగా.. ఈ ఆరుగురు కూడా ఆసియా వాసులే. దీంతో రంగంలోకి దిగిన అట్లాంటా, చెరోకీ కౌంటీ పోలీసులు రాత్రి 8 గంటల ప్రాంతంలో 21 ఏళ్ల రాబర్ట్ ఆరోన్ లాంగ్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు అట్లాంటా పోలీసు విభాగం అధికారి జాన్ చాఫీ వెల్లడించారు.