ఇద్దరు రాక్‌స్టార్స్‌... ఒకటే ఆల్బమ్‌

ABN , First Publish Date - 2021-08-11T05:30:00+05:30 IST

రిత్విజ్‌... న్యూక్లియా... ఒకరిది శాస్త్రీయ సంగీతం. మరొకరిది జానపదం. దేశంలోనే పేరొందిన ఈ ఇద్దరు కళాకారులు కలిసి ఒకటే ఆల్బమ్‌ చేస్తున్నారు.

ఇద్దరు రాక్‌స్టార్స్‌... ఒకటే ఆల్బమ్‌

రిత్విజ్‌... న్యూక్లియా... ఒకరిది శాస్త్రీయ సంగీతం. మరొకరిది జానపదం. దేశంలోనే పేరొందిన ఈ ఇద్దరు కళాకారులు కలిసి ఒకటే ఆల్బమ్‌ చేస్తున్నారు. ‘బరాత్‌’ పేరుతో రూపొందుతున్న ఈ ఆల్బమ్‌లో మొత్తం 8 ట్రాక్‌లు ఉంటాయి. అన్నీ కలిపి ఒకేసారి కాకుండా... వారానికి ఒకటి చొప్పున విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఒక ట్రాక్‌ని వదిలారు. పుణెకి చెందిన రిత్విజ్‌ పూర్తి పేరు రిత్విజ్‌ శ్రీవాస్తవ. పాటలు పాడతాడు. బాణీలు కడతాడు. ఎలక్ర్టానిక్‌ మ్యుజీషియన్‌. ఆల్బమ్‌ ప్రొడ్యూసర్‌. ఇక న్యూక్లియా ఉరఫ్‌ ఉద్యాన్‌ సాగర్‌ది ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా. సంగీతమంటే ప్రాణం. రిత్విజ్‌ కంటే ముందు నుంచి సొంతంగా ఆల్బమ్స్‌ రూపొందిస్తున్నాడు. ఒకటి రెండు బాలీవుడ్‌ చిత్రాలకు కూడా పని చేశాడు. పలు అవార్డులూ అందుకున్నాడు. వినూత్న సంగీత ధోరణుల్లో ఒకరికొకరికి పొంతన ఉండదు. లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్దరూ కలిసి ఒకే ఆల్బమ్‌ కోసం పని చేస్తుండడంతో ‘బరాత్‌’ క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది. 


‘‘ఇది నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కాంబినేషన్‌. మొదటి నుంచి రిత్విజ్‌ సంగీతం వింటున్నాను. అతడి సౌండ్స్‌, ట్రాక్స్‌ నాకు చాలా ఇష్టం. మా ఇద్దరి నేపథ్యం, శైలి వేరని తెలుసు. ఆ భిన్నత్వంలోనే ఏకత్వం తెచ్చే ప్రయత్నం ఇది. తద్వారా రొటీన్‌కి భిన్నంగా సరికొత్త ట్రాక్‌లు వచ్చే అవకాశం ఉంటుంది’’ అంటాడు న్యూక్లియా. రిత్విజ్‌దీ అదే మాట. ‘‘ఎన్నాళ్లో వేచిన సమయం రానే వచ్చింది. అభిమానులకు ఒక సరికొత్త సంగీతానుభూతిని ఇవ్వడానికే మేం కలిసి పనిచేయాలని నిర్ణయించాం’’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు రిత్విజ్‌. ఈ ఆల్బమ్‌లోని ట్రాక్స్‌ అన్నీ గోవాలోనే రికార్డ్‌ చేశారు. ఎందు కంటే ఇద్దరికీ ఇష్టమైన ప్రదేశం. అదే ఇప్పుడు వారి స్థావరం.

Read more