కేన్స్‌లో మన మెరుపుల్

ABN , First Publish Date - 2021-07-13T05:30:00+05:30 IST

ఫ్రాన్స్‌లో జరుగుతున్న ‘కేన్స్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌’ సరికొత్త స్టయిల్స్‌కు కేరాఫ్‌గా నిలిచింది. రెడ్‌ కార్పెట్‌పై తారలు, మోడళ్లు తళుక్కుమన్నారు.

కేన్స్‌లో మన మెరుపుల్

ఫ్రాన్స్‌లో జరుగుతున్న ‘కేన్స్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌’ సరికొత్త స్టయిల్స్‌కు కేరాఫ్‌గా నిలిచింది. రెడ్‌ కార్పెట్‌పై తారలు, మోడళ్లు తళుక్కుమన్నారు. జోడీ ఫోస్టర్‌, మరియన్‌ కోలార్డ్‌, మ్యాగీ జిలెన్‌హాల్‌, హెలెన్‌ మిరెన్‌, ఆడమ్‌ డ్రైవర్‌ తదితర ప్రపంచ సినీ ప్రముఖులు విభిన్న డ్రెస్సుల్లో కనువిందు చేశారు. ఎంతమంది ఉన్నా... అందరిలో ఫ్యాషన్‌ బ్లాగర్‌ మాసూమ్‌ మైనావాలా మెహతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ చీరకట్టులో భారతీయతను ఘనంగా చాటింది. ‘‘అంతటి మెగా ఈవెంట్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం నాకు లభించింది. భారతీయ ఫ్యాషన్‌ను ప్రపంచం ముందుంచాలన్న నా ఆకాంక్ష నెరవేరింది. నిజంగా నా జీవితంలోనే మరువలేని రోజు ఇది’’ అంటూ మాసూమ్‌ తన సంతోషాన్ని పంచుకుంది. ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఈ అవుట్‌ఫిట్‌ రూపొందించారు. తెలుపు రంగు చీరకు మ్యాచింగ్‌గా అదే రంగు టాప్‌ ధరించి మాసూమ్‌ మురిపించింది. ఆమెతోపాటు నిధి సునిల్‌, ఫర్హానా బోది కూడా చిత్రోత్సవంలో క్యాట్‌ వాక్‌ చేశారు. నిధి దక్షిణ భారత మోడల్‌, నటి. ఫర్హానా భారత్‌లో పుట్టి దుబాయ్‌లో స్థిరపడిన స్టయిలిస్ట్‌. స్ట్రాప్‌లెస్‌ ఎల్లో పీకాక్‌ డ్రెస్‌లో ఫర్హానా విభిన్నంగా కనిపిస్తే... రబీ కెరౌజ్‌ వైట్‌ కలర్‌ సూట్‌లో నిధి ఆకర్షించింది. 

Read more