ఇసుకను తెచ్చి... శిల్పంగా మలిచి...

ABN , First Publish Date - 2021-01-20T06:12:32+05:30 IST

ఇసుక ఆమె చేతిలో పడితే శిల్పమవుతుంది. అందులో కొత్తేమీ లేకపోవచ్చు. నీటిపై రాత... ఇసుకపై గీత... ఆయుర్దాయం రెప్ప పాటు కాలమే కదా

ఇసుకను తెచ్చి... శిల్పంగా మలిచి...

ఇసుక ఆమె చేతిలో పడితే శిల్పమవుతుంది. అందులో కొత్తేమీ లేకపోవచ్చు. నీటిపై రాత... ఇసుకపై గీత... ఆయుర్దాయం రెప్ప పాటు కాలమే కదా! కానీ... ఆమె సైకత శిల్పం కెరటానికి కొట్టుకుపోదు. మరి..! మ్యూజియంలో ఒదిగి కళాభిమానులను అలరిస్తుంది. అదెలా..? ఎవరామె..? రండి... చదివేద్దాం... 


గౌరీ ఎంఎన్‌.. దేశంలోనే సైకత శిల్పాలు చెక్కే ఏకైకా మహిళా కళాకారిణి. సాగర తీరానికి వెళ్లినప్పుడు ఇసుకు మేడలు కట్టిన సందర్భాలు... దానిపై రాసిన రాతలు... అలలు వచ్చి వాటిని చెరిపేసిన జ్ఞాపకాలు మనందరికీ ఎన్నో. గౌరి బాల్యం కూడా అందుకు భిన్నమేమీ కాదు. కర్ణాటక రాష్ట్రం మైసూరులో పుట్టి పెరిగినా... సముద్ర తీరాలకు వెళ్లినప్పుడల్లా ఇసుకు కోటలు కట్టింది. చిన్నప్పటి సరదాని పెద్దయ్యాకా కొనసాగిస్తూ వచ్చింది. 


అప్పుడే అర్థమైంది... 

‘‘ఆసక్తి ఎలా కలిగిందో తెలియదు... కానీ ఊహ తెలిసినప్పటి నుంచి బొమ్మలు, శిల్పాలపై నాకు ఎంతో మక్కువ. అందులోనే నా కెరీర్‌ అనుకునేదాన్ని. అయితే అందుకు మా నాన్న ఒప్పుకోలేదు. ఆయన వ్యాపారవేత్త. పరిశ్రమ ఒకటి నడిపిస్తున్నారు. కళలు అన్నం పెట్టవనేది నాన్న అభిప్రాయం. అభిరుచులు పక్కన పెట్టి బతకడానికి ముందు మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని చెప్పేవారు. ఆ తరువాత నచ్చింది చేసుకున్నా జీవితానికి ఢోకా ఉండదనేవారు. నాన్న మాట కాదనలేదు. అలాగని కళాకారిని కావాలన్న కాంక్ష వదులుకోలేదు. ‘మిషన్‌ టూల్‌ టెక్నాలజీ’లో డిప్లమో చదువుతూనే మట్టితో రకరకాల బొమ్మలు చేసేదాన్ని. రాను రాను ఈ కళపై ఆసక్తి పెరిగింది. ఇంటర్‌నెట్‌లో శోధించి... యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ నైపుణ్యం పెంచుకున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కళాకారుల పనితనాన్ని పరిశీలించాను. మెళకువలు తెలుసుకున్నాను. వాటన్నింటినీ క్రోడీకరించుకుని ఒక భిన్నమైన ఆకృతి ప్రయత్నించేదాన్ని. ఆ క్రమంలోనే ‘శాండ్‌ ఆర్ట్‌’ గురించి తెలిసింది. సముద్రపు ఒడ్డున సరదాగా ఇసుక గూడు కట్టడమే కానీ... అది ఒక కళగా అలరిస్తుందన్న విషయం అప్పుడు అర్థమైంది. 


ఇంజనీరింగ్‌ వదిలేసి... 

నాన్నకు ఇచ్చిన మాట ప్రకారం డిప్లమో అవ్వగానే మైసూరులోనే మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో చేరింది గౌరి. రెండేళ్లు గడిచాయి. కానీ ఆమె కళలపై ఉన్న ప్రేమతో చదువులో ఏమాత్రం శ్రద్ధ పెట్టలేకపోతోంది. రెండు పడవలపై కాళ్లు పెట్టి ముందుకు సాగడం తనవల్ల కాదని తెలుసుకుంది. చదువా... శిల్పకళా..? ఎవరి కోసమో కాకుండా మనసు కోరుకున్న రంగంలోనే అనుకున్నది సాధించాలని నిర్ణయించుకుంది. వెంటనే నాన్న దగ్గరికి వెళ్లింది... ‘‘నేను ఇంజనీరింగ్‌ వదిలేయాలని నిర్ణయించుకున్నా. చిత్రకళ అంటే నాకు ఎంతో ఇష్టం. అంత ఆసక్తి గానీ, మక్కువ గానీ ఇంజనీరింగ్‌పై లేవు’ అని చెప్పేశాను. ఎందుకో... ఈసారి ఆయన నా ఇష్టాన్ని కాదనలేదు. వెంటనే ఇంజనీరింగ్‌ ఆపేసి ఫైన్‌ ఆర్ట్స్‌ డిగ్రీలో చేరాను. అది అవ్వగానే ‘కర్ణాటక స్టేట్‌ ఓపెన్‌ యూనివర్సిటీ’ నుంచి శిల్పకళలో మాస్టర్స్‌ పూర్తి చేశాను. 


శిక్షణ లేకుండానే... 

శిల్పకళలో మాస్టర్స్‌ చేసినా సైకత శిల్పాలు చెక్కడంలో గౌరి ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. ఇతర శిల్ప కళలతో పోలిస్తే ఇది ఎంతో భిన్నమైనదే కాదు... క్లిష్టమైనది కూడా! ఇందులోని లోతుపాతులు తెలుసుకోవడానికి ఆమె ఒడిశాలో నిర్వహించిన ‘అంతర్జాతీయ శాండ్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌’కు వెళ్లింది. అక్కడ కళాకారులు ప్రదర్శించిన రకరకాల శైలులు, నైపుణ్యాలను నిశితంగా పరిశీలించింది. ‘‘ఆ స్ఫూర్తితో నేను కూడా ఇసుకలో ప్రయోగాలు ప్రారంభించాను. ప్రముఖ కళాకారుల చిత్రాలు, వీడియోలు చూస్తూ చిన్న చిన్న కట్టడాలు కట్టాను. చూసినవారందరినీ అవి ఆకట్టుకునేవి. అది నాలో ఆత్మవిశ్వాన్ని పెంచింది. సైకత శిల్పకళ ఎవరో చెబితే నేర్చుకొనే కంటే మనంతట మనమే ప్రయోగాలు చేసుకొంటూ పోతేనే సత్ఫలితాలు వస్తాయనేది అనుభవపూర్వకంగా నేను గ్రహించాను. ఒక్కో రూపం ఒక్కో పాఠం నేర్పుతుంది’’ అంటూ చెప్పుకొచ్చింది ఈ కళాకారిణి. 


మ్యూజియంలో భధ్రం... 

సృజనకు పదును పెట్టి... గంటలకొద్దీ పరిశ్రమించి చెక్కిన సైకత శిల్పం ప్రభ మూన్నాళ్ల ముచ్చటేనా! ఇదే గౌరిని ఆలోచింపజేసింది. అందులో నుంచి పుట్టిందే మ్యూజియం. ‘‘నిజానికి మ్యూజియం ఒకటి ప్రారంభించాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఒక ఆర్ట్‌ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు కొందరు నాకు సలహా ఇచ్చారు... ‘ఇసుకు చిత్రాలు కలకాలం ఉండిపోయేలా, వాటిని అందరూ వీక్షించేలా ఏదైనా చేయవచ్చు కదా’ అని! అవును కదా..! ప్రతి శాండ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లో ఎంతో శ్రమించి చెక్కిన శిల్పాలు కొద్ది రోజులకు ఇసుకు రేణువులుగా మారిపోతున్నాయి. దానికి మార్గం ఏమిటని ఆలోచిస్తున్నప్పుడే మ్యూజియం మదిలో మెదిలింది. అలా 2012లో మా సొంత పట్టణంలోనే ‘మైసూరు శాండ్‌ స్కల్ప్చర్‌ మ్యూజియం’ ఏర్పాటు చేశాను’’ అంటూ గౌరి ఎంతో సంతోషంగా చెబుతారు. 


ప్రతిభకు పట్టం... 

గౌరి కళారూపాలు టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారిపోయాయి. ఆమెకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టాయి. మైసూరు, బెంగళూరుల్లో జరిగే ప్రతి ఫ్లవర్‌ షోకూ కర్ణాటక ప్రభుత్వం ఆమెను అతిథిగా ఆహ్వానించింది. ‘‘నా సైకత శిల్పాల్లో అబ్దుల్‌ కలామ్‌ లాంటి స్ఫూర్తి ప్రదాతలు, దశావతార విష్ణుమూర్తి తదితర దేవతామూర్తులే కాకుండా ఆడపిల్లను కాపాడుకొందాం వంటి సామాజిక సందేశమూ ఉంటుంది. ఇప్పటి వరకు దేశంలోని యాభైకి పైగా ప్రాంతాల్లో నా శిల్ప కళను ప్రదర్శించాను. గత రెండేళ్లుగా దుబాయ్‌లోని ‘కింగ్‌ అబ్దులజీజ్‌ కేమెల్‌ ఫెస్టివల్‌’లో కూడా ప్రదర్శన నిర్వహిస్తున్నాను’’ అంటున్న గౌరి అంతటితో ఆగలేదు. 


150కి పైగా శిల్పాలు...  

అయితే మ్యూజియం ఏర్పాటుకు ఒక శాశ్వతమైన ప్రదేశం కావాలి. ‘‘దాని కోసం నేను, నాన్న ప్రభుత్వాన్ని సంప్రతించాం. తెలియనదేముంది... ఎన్నో నిబంధనలు, ఇబ్బందులు. దాంతో మేమే ఒక ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని, మ్యూజియం ఏర్పాటు చేశాం. ప్రస్తుతం అందులో నేను రూపొందించిన 150కి పైగా సైకత శిల్పాలు ఉన్నాయి. తయారీకి 115 లారీల ఇసుక పట్టింది. ఒక్కొక్కటీ ఒక్కో థీమ్‌. వేటికవే ప్రత్యేకం. స్థానికులనే కాదు... పర్యాటకులను సైతం ఇవి విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. కానీ ఇవి చెక్కుచెదరకుండా చూసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నది. అనుక్షణం పర్యవేక్షణ ఉండాలి. వాతావరణానికి అనుగుణంగా ఇసుకలో మార్పులు వస్తుంటాయి. శిల్పం రూపం మారిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు మళ్లీ చేయాల్సి వస్తుంది’’ అంటున్న గౌరి తనలా మరింతమంది ఔత్సాహికులను తీర్చిదిద్దడానికి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. 

Updated Date - 2021-01-20T06:12:32+05:30 IST