యోగా ఇలా సరి కాదు
ABN , First Publish Date - 2021-09-14T05:30:00+05:30 IST
యోగాసనాలు నిస్సందేహంగా ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అయితే యోగసాధన సమయంలో కొన్ని చేయకూడనివీ ఉంటాయి. అవేంటంటే...
యోగాసనాలు నిస్సందేహంగా ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అయితే యోగసాధన సమయంలో కొన్ని చేయకూడనివీ ఉంటాయి. అవేంటంటే...
- శరీరాన్ని విపరీతమైన ఒత్తిడికి లోను చేయకూడదు. కొన్నిసార్లు సులభమైనవి క్లిష్టంగా తోచవచ్చు. మరికొన్ని సందర్భాల్లో క్లిష్టమైనవి సులభంగా అనిపించవచ్చు. కాబట్టి శరీరం మాట వింటూ నడుచుకోవాలి.
- అనవసరంగా ఊపిరి బిగపట్టి ఉంచకూడదు. శిక్షకులు చెప్పినప్పుడు, ఆసనానికి తగ్గట్టు ఊపిరి పీల్చుకుంటూ, బిగపడుతూ, వదులుతూ ఉండాలి.
- ప్రారంభంలో శిక్షకుల పర్యవేక్షణ లేకుండా ఒంటరిగా ఆసనాలు సాధన చేయకపోవడమే మేలు. టివిలో చూసినవి, పుస్తకాల్లో చదివినవి సొంతగా సాధన చేయకూడదు. కండరాలు పట్టేయడం, శారీరక అసౌకర్యం లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే శిక్షకుల పర్యవేక్షణలో సాధన చేస్తూ, పట్టు పెంచుకోవాలి.
- బిగుతైన దుస్తులు, షూ ధరించకూడదు. మరీ ముఖ్యంగా బిగుతైన దుస్తుల వల్ల నడుము పైభాగం కదలికలు ఇబ్బందికరంగా మారతాయి. ఛాతీ వ్యాకోచించే వీలు లేక ఊపిరి తీసుకోవడం, వదలడంలో అసౌకర్యం తలెత్తుతుంది.
- మహిళలు నెలసరి సమయంలో తలకిందులుగా ఉండే ఆసనాలు వేయకూడదు. బదులుగా రిలాక్సేషన్, శ్వాసకు సంబంధించిన ఆసనాలు సాధన చేయాలి.