నిరాశావాదాన్ని తుడిచేయండి

ABN , First Publish Date - 2021-08-25T05:30:00+05:30 IST

‘అంతా మన మంచికే’ అనుకోమంటారు పెద్దలు. నిజంగా అలా అనుకొంటే జీవితం ఆనందంగా సాగిపోతుందంటున్నారు నిపుణులు

నిరాశావాదాన్ని తుడిచేయండి

‘అంతా మన మంచికే’ అనుకోమంటారు పెద్దలు. నిజంగా అలా అనుకొంటే జీవితం ఆనందంగా సాగిపోతుందంటున్నారు నిపుణులు. మెదడులో ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడల్లా... సంతోషంగా గడిపిన సందర్భాలను గుర్తు చేసుకొంటే ఏ చింతా దరి చేరదంటున్నారు. అర్థవంతమైన జీవితానికి సానుకూల మనస్తత్వం బాటలు వేస్తుందంటున్నారు. మీ నెగెటివ్‌ మైండ్‌సెట్‌ను పాజిటివ్‌గా మార్చుకోవాలంటే మానసిక నిపుణులు ఇస్తున్న సూచనలివి... 

అతిగా ఆలోచించవద్దు: మనసులో ప్రతికూల ఆలోచనలు (నెగెటివ్‌ థాట్స్‌), దిగులుతో బాధగా గడిచే రోజులు మనందరికీ అనుభవమే. ఏదైనా అనుకున్నది నెరవేర్చలేనప్పుడు మన మీద మనకే కోపం, చికాకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఏదో తప్పు చేసిన భావన కూడా కలుగుతుంటుంది. అయితే వాటినే పదే పదే తలుచుకొంటూ కూర్చునే కంటే మన జీవితంలోని ఆనంద క్షణాలను గుర్తు చేసుకోవాలి. దానివల్ల మానసిక ఆందోళన నుంచి బయటపడగలుగుతారు. 

చిరునవ్వు చెరగనీయద్దు: ఎప్పుడూ మీ మోముపై చిరు నవ్వు చెరగనీయద్దు. ఆవేశంలోనో, ఆందోళనలోనో ఉన్నప్పుడు పెదాలపై చిరునవ్వు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తే... అది ప్రతికూల ఆలోచనల వల్ల కలిగే దుష్పరిణామాలను నివారిస్తుంది. 

చిన్నవే కానీ..: ఒక్కసారి సానుకూల దృక్పథంతో ఈ ప్రపంచాన్ని చూడండి... మన చుట్టూ ఆనందవనం పరుచుకున్న అనుభూతి కలుగుతుంది. అందుకే అంటారు... ‘ఒక మెదడు ఆలోచనా విధానం ప్రపంచాన్ని మార్చగలదు’ అని! మనలో చాలామంది ఎప్పుడో కానీ పెద్ద పార్టీలు, ఈవెంట్లకు వెళ్లం. కానీ కొత్త టీవీ తేవడం, కుటుంబంతో కలిసి డిన్నర్‌కో సూపర్‌ మార్కెట్‌కో వెళ్లడం వంటి చిన్న చిన్న వాటిల్లోనే ఎంతో ఆనందం ఉంటుందని మరిచిపోకండి. 

అమాంతం మారిపోవాలనుకోవద్దు: ఒకవేళ మీ బుర్రంతా ప్రతికూల ఆలోచనలతో నిండి ఉంటే... రాత్రికి రాత్రే ఆశావాదిగా మారిపోవాలని కోరుకోవద్దు. దీన్ని ఒక నిరంతర ప్రక్రియగా పెట్టుకుని, నిదానంగా ప్రయత్నించండి. ఆత్మవిమర్శ మంచిదే. కానీ ఎందోలోనూ అతి తగదు. దానివల్ల మీపై మీకు నమ్మకం తగ్గిపోతుంది. తరువాత అది మనోవేదనకు దారి తీస్తుంది. ఆశావాదిగా మిమ్మల్ని మీరు మార్చుకొనే క్రమంలో ఎంతటి ఒత్తిడినైనా జయిస్తారు. మానసికంగా దృఢంగా ఉండే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. 

ఒక్కటి గుర్తు పెట్టుకోండి... ఆశావాది ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని వెతుక్కొంటాడు. నిరాశావాది ప్రతి అవకాశాన్నీ కష్టంగా భావిస్తాడు. మిమ్మల్ని మీరు పరిమితం చేసుకొనే ఆలోచనల నుంచి ఒక్కసారి బయటికి వచ్చి చూడండి.

Updated Date - 2021-08-25T05:30:00+05:30 IST