సైన్యంలో ఆమె చరిత!

ABN , First Publish Date - 2021-10-31T05:30:00+05:30 IST

వింగ్‌ కమాండర్‌ డాక్టర్‌ విజయలక్ష్మీ రామనన్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? మరి మేజర్‌ ప్రియ జిన్‌గాన్‌ గురించో... ఈ.....

సైన్యంలో ఆమె చరిత!

వింగ్‌ కమాండర్‌ డాక్టర్‌ విజయలక్ష్మీ రామనన్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? మరి మేజర్‌ ప్రియ జిన్‌గాన్‌ గురించో... ఈ ప్రపంచంలోని సముద్రాలన్నింటినీ ఒక పడవలో చుట్టేసివచ్చిన నౌకాదళానికి చెందిన మహిళా టీం గురించి ఎక్కడైనా చదివారా?  సాధారణంగా సైనిక దళాలు అనగానే బలిష్టులైన పురుషులు గుర్తుకువస్తారు. కానీ మన సైనిక చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే అనేకమంది మహిళలు మనకు కనిపిస్తారు.  అలాంటి కొందరి మహిళా అధికారుల జీవితాలను సంక్షిప్తంగా పరిచయం చేసే పుస్తకం- ‘కేడెట్‌ నెం. 1’. ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు సంక్షిప్తంగా...


ఆఫీసర్‌ 4971

భారత వైమానిక దళంలో తొలి మహిళా అధికారి విండ్‌ కమాండర్‌ డాక్టర్‌ విజయలక్ష్మీ రామనన్‌ పుట్టింది తమిళనాడులోనైనా- తండ్రి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో అధికారి కావటంతో దేశంలోని అనేక ప్రాంతాలలో చదువుకున్నారు. 1943లో మద్రాసు మెడికల్‌ కాలేజీలో చేరిన విజయ 1947లో జనరల్‌ సర్జరీలో మొదటి బహుమతి సాధించారు. 1955 దాకా డాక్టర్‌గా ప్రాక్టీసు చేశారు... 1955లో ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌లో అధికారిగా ఢిల్లీలోని వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో చేరారు. ఆ తర్వాత డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌గా బెంగుళూరులోని ఎయిర్‌ఫోర్స్‌ ఆసుపత్రిలో నాలుగేళ్లు పనిచేశారు. ఈ సమయంలో ఒక మహిళగా ఆమె ఎదుర్కొన్న సమస్యలు అనేకం. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో - దాడుల్లో గాయపడిన వైమానిక సిబ్బందికి చికిత్సను అందించటంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా సేవా పతకం కూడా లభించింది. ఆ తర్వాత విజయకు వైమానిక దళ మెడికల్‌ బోర్డు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఒక మహిళ ఆ బాధ్యతలు చేపట్టడం అదే తొలిసారి. 1971లో పాక్‌తో జరిగిన యుద్ధంలో కూడా ఆమె కీలకమైన పాత్ర పోషించారు. విజయ అందించిన సేవలకు గుర్తింపుగా 1977లో వైమానిక దళం ఆమెకు వింగ్‌ కమాండర్‌గా పదోన్నతి కల్పించింది. అతి విశిష్టసేవా (ఏవీఎం) పురస్కారంతో సత్కరించింది. 1979లో పదవీవిరమణ చేసిన తర్వాత... బెంగుళూరులో ఒక క్లినిక్‌ను స్థాపించి అనేకమంది పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. 
కేడెట్‌ 001

తాము చిన్నప్పుడు కన్న కలలను పట్టుదలతో సాకారం చేసుకొనేవారు అది కొద్దిమంది. అలాంటి వారిలో ఒకరు ప్రియ జిన్‌గాన్‌ ఒకరు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో పుట్టి పెరిగిన ప్రియకు చిన్నప్పటి నుంచి సాయుధ దళాలంటే ఏదో తెలియని ఆకర్షణ. యుక్తవయస్సు వచ్చిన తర్వాత కూడా ఆమెకు ఆ ఆకర్షణ పోలేదు. డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న సమయంలో... ఆర్మీ జారీచేసిన ఒక ప్రకటనను ఆమె చూశారు. ఆ ప్రకటనలో మహిళలకు సంబంధించిన ప్రస్తావన లేదు. దీనితో ప్రియ తనను సాయుధ దళాలలో చేర్చుకొమ్మని ఆర్మీ చీఫ్‌కు ఒక ఉత్తరం రాశారు. ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయారు.. చాలా ఆశ్చర్యంగా... అనుకోని విధంగా ఆమెకు ఒక రోజు ఆర్మీ చీఫ్‌ నుంచి ఉత్తరం వచ్చింది. ప్రస్తుతం తాము మహిళలను చేర్చుకోవటం లేదని... అయితే చేర్చుకొనే ప్రతిపాదన ఉందని... కొద్దికాలం వేచి చూడాలని ఆ ఉత్తరంలో ఉంది. ఆ ఉత్తరం అందుకున్నాక ఆమెకు  ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆర్మీ - ఉమెన్‌ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ (డబ్ల్యుఎ్‌సఏసీ) కింద 25 మంది మహిళా అధికారులను చేర్చుకుంటామని ప్రకటించింది. దేశంలోని కొన్ని వేల మంది మహిళలు ఈ 25 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రియ కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేశారు.. అనేక ఇంటర్వ్యూల అనంతరం ఆర్మీ- ప్రియ సహా 25 మందిని ఎంపిక చేసింది. వీరికి చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో శిక్షణ ఇచ్చారు. అన్ని విభాగాలలోను అత్యున్నతమైన ప్రతిభను కనబరిచినందుకు ప్రియకు మెడల్‌ కూడా లభించింది. ఆమెను ఆర్మీలోని తొలి మహిళా కేడిట్‌గా చేర్చుకొని.. లక్నోలోని కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో అధికారిగా నియమించారు. 10 ఏళ్ల తర్వాత ఆర్మీ నుంచి పదవీ విరమణ చేసిన ప్రియ ప్రస్తుతం తనకు ఇష్టమైన పర్వతారోహణ చేస్తూ కాలం గడుపుతున్నారు. Updated Date - 2021-10-31T05:30:00+05:30 IST