మార్పంటే భయమెందుకు?

ABN , First Publish Date - 2021-08-20T05:30:00+05:30 IST

చాలామంది బాల్యంలో ఎల్లప్పుడూ మార్పును కోరుకుంటారు. మార్పు వచ్చినప్పుడు ఆనందిస్తారు. కానీ పెద్దవుతున్న కొద్దీ సాధ్యమైనంత వరకూ ఎలాంటి మార్పూ రాకుండా చూసుకుంటారు.

మార్పంటే భయమెందుకు?

చాలామంది బాల్యంలో ఎల్లప్పుడూ మార్పును కోరుకుంటారు. మార్పు వచ్చినప్పుడు ఆనందిస్తారు. కానీ పెద్దవుతున్న కొద్దీ సాధ్యమైనంత వరకూ ఎలాంటి మార్పూ రాకుండా చూసుకుంటారు. మార్పును స్వీకరించలేకపోతారు. ఎందుకంటే ఆ మార్పును తీసుకొచ్చేది వారు కాదు. ఇంతకీ మార్పును ఆమోదించడం అనేది దాన్ని ఎవరు తీసుకొస్తున్నారనే విషయం మీద ఆధారపడి ఉంటుందా? మార్పు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి? నాకు ఎదురైన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే... వయసు పెరిగే కొద్దీ మార్పు ఎందుకు కష్టంగా మారిపోతుందంటే... మనం మన ‘సౌకర్యం’ అనే ఒక గూడు ఏర్పాటు చేసుకుంటాం. ఆ సౌకర్యం కాస్త సడలినా తట్టుకోలేం. 


చిన్నప్పుడు మీరు చూసేది సౌకర్యం కోసం కాదు... జీవితం కోసం. ఇప్పుడు మీరు జీవితం కోసం కాదు, సౌకర్యం కోసం, భద్రత కోసం చూస్తున్నారు. పదిహేను- పదహారేళ్ళ వయసులో ‘జీవితంలో ఏం చెయ్యాలి?’ అని మీరు కలలు కనేవారు. పాతికేళ్ళు వచ్చాక... అవన్నీ వదిలేసి, ‘ఇది కుదిరే పని కాదు. నేనిప్పుడు మరింత ఎక్కువ ప్రాక్టికల్‌గా మారాను’ అనుకోవడం మొదలుపెట్టారు. కానీ నిజానికి జరిగిందేంటంటే... మీరు పిరికివారుగా తయారయ్యారు. ‘నేను ఉద్యోగం చెయ్యాలి, నేను సంపాదించాలి. ఈ పనులు చేస్తే చాలు అనుకోవడం’ ప్రారంభించారు. ఈ క్రమంలో... మీకు ముప్ఫై అయిదేళ్ళ వయసు వచ్చేసరికే... ‘నాకు ఎలాంటి సమస్యలూ రాకపోతే చాలు’ అనే స్థితికి చేరుకుంటారు. మీరు ఏదో గొప్పగా జరగాలని కోరుకోవడం లేదు. ఎలాంటి సమస్యలూ లేకుండా ఉంటే చాలనుకుంటున్నారు. కానీ అలా అనుకున్నప్పుడే సమస్యలు మొదలవుతాయి. మీరు జీవితాన్ని ఉత్సాహంతో కాకుండా, ఒక భద్రతా భావంతో చూడడమే దీనికి కారణం. ఎప్పుడైతే ప్రతి దాన్నీ ఇంత భద్రతా భావంతో చూడడం మొదలుపెట్టారో... ఏ చిన్న మార్పు ఎదురైనా... దానివల్ల మీ శాంతిని కోల్పోతున్నారు. అవునా, కాదా?


సృష్టిలో ప్రతీదీ మారిపోతుంది. మారనిదంటూ ఏదైనా ఉందా? భౌతికమైనది... మనం ఎంతో స్థిరంగా ఉందనుకున్నది కూడా అనునిత్యం మారుతూనే ఉంటుంది. ఆ మార్పు పట్ల మీరు ప్రతికూలంగా ఉన్నారంటే.. జీవితానికి ప్రతికూలంగా ఉన్నారని అర్థం. మార్పు లేని జీవితం కావాలంటే... మరణం తరువాత సమాధిలోకైనా చేరుకోవాలి లేదంటే జ్ఞానోదయమైనా పొందాలి. అప్పుడు అంతా ఒకటే. కానీ ఈ భౌతికతలో, ఈ సృష్టిలో మీరు భాగంగా ఉన్నంత వరకూ మార్పునకు లోబడాల్సిందే. ఈ క్షణంలో మీరు ఊపిరి తీసుకుంటున్నారు. మరో క్షణంలో శ్వాసను విడిచిపెడుతున్నారు. ఇది మార్పే కదా! 


జీవితాన్నే కాదు, మౌలికమైన జీవన ప్రక్రియను కూడా వద్దనుకుంటే... అన్ని రకాల సమస్యలనూ కొని తెచ్చుకున్నట్టే! జీవించి ఉన్నప్పుడు సంపూర్ణంగా జీవించాలి. మార్పును ప్రతిఘటిస్తే జీవన ప్రకియ అంతటినీ ప్రతిఘటిస్తున్నట్టే. దానివల్ల అనవసరమైన బాధ కలుగుతుంది. ప్రతిసారీ మార్పును ప్రతిఘటిస్తే... నిరాశ, నిస్పృహ కలుగుతాయి. అంతకన్నా ఘోరమైన పరిస్థితి మరేదీ లేదు. మీకు ప్రతికూలమైన పనులు మీరే చేసుకోవడం అంటే అదే

సద్గుdరు జగ్గీవాసుదేవ్‌

Updated Date - 2021-08-20T05:30:00+05:30 IST