నటిస్తూ నేర్చుకొంటున్నా
ABN , First Publish Date - 2021-09-13T05:30:00+05:30 IST
పదిహేనేళ్ల కిందటి మాట... ‘రూప సీరియల్స్ చేస్తుందా?’... తెలిసిన వారొకరు ఆమె అక్కను అడిగారు. ఊహించని ప్రశ్న. వెంటనే తేరుకున్న అక్క... చెల్లి తరుఫున ఓకే చెప్పేసింది.

పదిహేనేళ్ల కిందటి మాట... ‘రూప సీరియల్స్ చేస్తుందా?’... తెలిసిన వారొకరు ఆమె అక్కను అడిగారు. ఊహించని ప్రశ్న. వెంటనే తేరుకున్న అక్క... చెల్లి తరుఫున ఓకే చెప్పేసింది. ఇక అక్కడి నుంచి వరుస అవకాశాలు... అపు‘రూప’ పాత్రలు. ‘ఊహలు గుసగుసలాడే’ అంటూ ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయిక రూప నిజ జీవిత కథ ఇది...
అపు‘రూపం’...
- అనుకోకుండా నటి అయింది. ఇంత కాలం పరిశ్రమలో ఉంటానని అస్సలు ఊహించలేదు.
- పాప కోసం ఐదేళ్లు బ్రేక్. ఈ బ్రేక్‌లో సినిమాలంటూ చూడలేదు.
- నటించడం... పాపను చూసుకోవడం... ఉద్యోగం, వ్యాపకం ఇవే!
- మంచి ఆఫర్లు వస్తే సినిమాలకు రెడీ
- ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరో సల్మాన్‌ఖాన్.
- చిన్నప్పటి నుంచి అతడి సినిమాలే చూస్తూ పెరిగింది మరి!
ఒక అవకాశం వచ్చిందంటే దాని వెనుక ఎంత ప్రయత్నం, శ్రమ ఉంటాయో తెలుసు నాకు. కానీ ఏ ప్రయత్నం చేయకుండానే అలాంటి అవకాశం ఒకటి తలుపు తడితే..! ఆనందానికి హద్దేముంటుంది! నటిగా నా ప్రయాణం అలానే మొదలైంది. మాది మరాఠీ కుటుంబం. నాన్న బిజినె్సమ్యాన్. ఆయన చాలా కాలం కర్నూల్లో ఉన్నారు. ఇప్పటికీ మా బంధువులు చాలా మంది నివాసం కర్నూల్ పరిసర ప్రాంతాల్లోనే. తరువాత మా కుటుంబం బెంగళూరుకు మారింది. నేను పుట్టి పెరిగిందంతా అక్కడే.
కలలేమీ కనలేదు...
రంగుల ప్రపంచంలో మెరవాలని చాలామంది కలలు కంటుంటారు. నేనైతే అలాంటి కలలేమీ కనలేదు సరి కదా... నటిని అవుతానని ఏనాడూ అనుకోలేదు. మా ఇంటి దగ్గర ఒకాయన ఉండేవారు. నన్ను చూసి మా అక్క రాధను అడిగారు... ‘రూప సీరీయల్స్‌లో నటిస్తుందా’ అని! ఏం బదులేమివ్వాలో కాసేపు తనకు అర్థం కాలేదు. అప్పుడే నా పీయూసీ పూర్తయింది. డిగ్రీలో చేరదామనుకొంటున్నా. అక్క విషయం చెప్పింది. నన్ను ప్రోత్సహించింది. నా అదృష్టం ఎలా ఉందో! ప్రయత్నించి చూద్దామనుకున్నా. అన్నీ అక్కే చూసుకుంది.
దూరదర్శన్‌తో మొదలు...
అనుకోకుండా అలా నటిగా తొలి అడుగు పడింది. దూరదర్శన్‌లో ఓ కన్నడ సీరియల్‌కు నన్ను తీసుకున్నారు. ఆ తరువాత సినిమా అవకాశాలు వచ్చాయి. హీరోయిన్గా చేయమన్నారు. ఎందుకో నాకు సెట్ కాలేదు. అయితే అదే సమయంలో సహాయ నటి పాత్రలు లభించాయి. కన్నడ స్టార్లు విష్ణువర్ధన్, శివరాజ్‌కుమార్‌లకు చెల్లెలిగా నటించాను. మూడు సినిమాలు చేసిన తరువాత మళ్లీ సీరియల్ ఆఫర్లు. దాంతో ఇక సినిమాల వైపు చూసేంత సమయం దొరకలేదు. అంతేకాదు... పీయూసీ తరువాత చదువు కూడా కొనసాగించలేకపోయాను.
వారి సహకారం వల్లే...
ఇప్పటి వరకు కన్నడలో తొమ్మిది సీరియల్స్ చేశాను. లక్షల మంది అభిమానులను సంపాదించుకోగలిగాను. నిజానికి నేను నటనలో శిక్షణ ఏదీ తీసుకోలేదు. నటిస్తూనే నేర్చుకొంటున్నాను. ఇన్నేళ్లు పరిశ్రమలో ఉన్నానంటే కారణం... నాకు లభించిన పాత్రలు. అనుక్షణం నన్ను ప్రోత్సహించి, సహకరించిన దర్శక నిర్మాతలు, సహనటులు. అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చినా... కళామతల్లి నన్ను అక్కున చేర్చుకుంది. అందుకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.
మరిచిపోలేని పాత్రలు...
నేను కన్నడలో ‘కుల గౌరవ’ సీరియల్ చేస్తుండగా ‘జీ తెలుగు’ వాళ్లు ‘చిన్న కోడలు’ ఆడిషన్స్‌కు పిలిచారు. అయితే అప్పుడు షూటింగ్ జరుగుతోంది. నేను రాలేనంటే... వారే సెట్‌కు వచ్చి ఆడిషన్స్ తీసుకున్నారు. అన్నీ కుదరడంతో ఓకే చేశారు. 2009లో ‘చిన్న కోడలు’ మొదలైంది. అందులో నా పాత్ర పేరు ‘రాధిక’. ఈ సీరియల్ మెగా హిట్ అయింది. తెలుగులో నా కెరీర్‌ను కొనసాగించే ఉత్సాహాన్నిచ్చింది. కన్నడలో ‘ముత్తిన తోరణ’లో ‘సావని’ రోల్ మొదట నాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. అందులో చెవిటి, మూగ అమ్మాయిగా నటించాను. ఆ తరువాత తెలుగులో అంతటి పేరు తెచ్చిన పాత్ర ‘రాధిక’. ఆ సీరియల్ వచ్చి పదేళ్లు దాటిపోయినా ఇప్పటికీ నన్ను ‘చిన్న కోడలు’ రాధికగానే గుర్తు పెట్టుకున్నారంటే... ఆ పాత్ర అంతగా జనంలోకి వెళ్లిందనే కదా! పలువురు సినీ ప్రముఖులు కూడా నన్ను అభినందించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సీరియల్‌ని నేను సగంలోనే ఆపేశాను. అది తలుచుకొంటే ఇప్పటికీ బాధగా ఉంటుంది.
ఐదేళ్ల తరువాత...
‘చిన్న కోడలు’ అవగానే ‘గీతాంజలి’లో నటించాను. ఆ తరువాత 2016లో పెళ్లి అయింది. మా ఆయన శ్రవణ్ సుధాకర్‌రెడ్డి బిజినె్సమ్యాన్. తను తెలుగువారే. మాకో పాప. తనకు నాలుగేళ్లు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాం. మా అమ్మాయిని చూసుకోవడానికి ఐదేళ్లు బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు పాప కాస్త పెద్దదయింది. అందుకే మళ్లీ సీరియల్స్ మొదలుపెట్టాను. ‘ఇంటి గుట్టు’లో అతిథి పాత్ర ఒకటి చేశాను. ప్రస్తుతం ‘జీ-తెలుగు’లో ప్రసారమవుతున్న ‘ఊహలు గుసగుసలాడే’లో నటిస్తున్నా. ఇది నాకు రీ ఎంట్రీ. నేను షూటింగ్‌కి వెళితే మా వారు, మా అమ్మ పాపను చూసుకొంటారు. వారిద్దరి సహకారమే లేకపోతే తిరిగి ఇటువైపు రాగలిగేదాన్ని కాదు.
సెంచరీ పూర్తయింది...
‘ఊహలు గుసగుసలాడే’లో నాది ‘వసుంధర’ పాత్ర. జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా మనకు తోడుగా ఉండే వారే జీవిత భాగస్వామి. అలాంటి జీవిత భాగస్వామి మనల్ని వదిలేసి వెళ్లిపోతే... ఆ స్థానం మరొకరికి ఇవ్వడం సాధ్యమేనా? తమ పిల్లల కోసం మరోసారి పెళ్లి అనే బంధంలోకి అడుగు పెట్టిన అభిరామ్, వసుంధర ఎలా నెట్టుకొచ్చారనేది కథ. ఇటీవలే వంద ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు.’’
- హనుమా
సాధించిందేమీ లేదు...
ఏళ్ల తరబడి ఒకటే పాత్రలో చేస్తుంటే చిరాకు పుట్టదా అని కొందరు అడుగుతుంటారు. నాకైతే ఎప్పుడూ అలా అనిపించలేదు. కళాకారులకు ఆ పరిస్థితి రాకూడదు కూడా! నిజానికి నాకు చిరాకు కంటే కొంచెం కష్టం అనిపిస్తుంటుంది. ఎపిసోడ్లు గడిచినకొద్దీ పాత్రలో పరిణతి చూపిస్తూ ఉండాలి. అందుకు అనుగుణంగా హావభావాలు పలికించగలిగితేనే సన్నివేశం రక్తి కడుతుంది. ఏ రోజుకారోజు కొత్తదనం చూపించాలి. గొప్ప గొప్ప నటులతో పోలిస్తే ఇప్పటి వరకైతే నేను సాధించింది ఏమీ లేదు... జీరో. నా లక్ష్యమల్లా ఇక నుంచైనా విరామం లేకుండా నటించడం. తిరిగి సినిమాల్లో ప్రయత్నించడం. నటిగా బాగా బిజీ అయిపోవాలి. మరి ఈ ప్రయాణం ఎక్కడ దాకా వెళుతుందో చూడాలి.
