చర్మం పట్టులా మెరవాలంటే...
ABN , First Publish Date - 2021-03-04T05:42:05+05:30 IST
మలాయి, బ్లూబెర్రీస్‌తో ఇంట్లో ఫేస్ ప్యాక్ చేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మం పట్టులా మెరుస్తుంది. ఈ మాస్కు చర్మానికి కావాలసిన తేమను అందిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
మలాయి, బ్లూబెర్రీస్‌తో ఇంట్లో ఫేస్ ప్యాక్ చేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మం పట్టులా మెరుస్తుంది. ఈ మాస్కు చర్మానికి కావాలసిన తేమను అందిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఫేస్‌ఫ్యాక్ తయారీకి కావలసినవి
రెండు లేదా మూడు బ్లూబెర్రీలు, ఒక టేబుల్‌స్పూను తాజా మలాయి, అర టేబుల్‌స్పూన్ ముల్తానిమట్టి.
తయారీ
- బ్లూబెర్రీలను మెత్తగా చేసి ఒక గిన్నెలో వేయాలి.
- ఆ బ్లూబెర్రీస్ మిశ్రమంలో మలాయి వేసి బాగా కలిపి మెత్తటి పేస్టులా చేయాలి.
- ఇందులో ముల్తానీమట్టిని కలపాలి. దీన్ని కలపడం వల్ల ఈ మిశ్రమం చిక్కగా తయారవుతుంది.
ఇలా అప్లై చేయాలి
- ముందుగా ఐదు నుంచి పది నిమిషాల దాకా ఆవిరిపట్టాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుని అవి ఫేస్ మాస్కును లోపలికి బాగా పీల్చుకుంటాయి. దీంతో చర్మం బాగా నిగారిస్తుంది.
- ఆవిరి పట్టిన ముఖాన్ని పొడిగుడ్డతో అద్దుతూ తుడుచుకోవాలి. ఆ తర్వాత పొడిగా ఉన్న ముఖంపై ఫేస్‌మాస్కు పేస్టును అప్లై చేయాలి. చర్మంపై ఫేస్‌మాస్కు వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు ముఖంపై సున్నితంగా మసాజ్ చేయాలి.
- పదిహేను ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
- మలాయిలో ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి.
- మలాయిలో ఉన్న ఫ్యాట్స్ వల్ల చర్మం లోపలి నుంచీ శుభ్రమై చర్మం మెరుపును పొందుతుంది. ఇందులోని లాక్టిక్ యాసిడ్ చర్మంలోని మృతకణాలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
- బ్లూబెర్రీస్‌లోని యాంటాక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ను కట్టడిచేస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడవు. మొటిమల నివారణలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి.