అతడి పొలమే ఔషధశాల

ABN , First Publish Date - 2021-01-31T16:07:14+05:30 IST

ఒక ఉదయం తన పొలంలో అతడు పెంచుతున్న తీగ జాతి మొక్కలు నేల మీద పాకడం వల్ల మట్టి కొట్టుకుపోయి..

అతడి పొలమే ఔషధశాల

ఒక ఉదయం తన పొలంలో అతడు పెంచుతున్న తీగ జాతి మొక్కలు నేల మీద పాకడం వల్ల మట్టి కొట్టుకుపోయి చనిపోవడం చూసి చలించిపోయాడు. అలాగే మట్టి వాసనతో పొలం నుండి నేరుగా ఉద్యానవన శాఖ అధికారులను కలిసి ‘పందిళ్లు వేసుకోవడానికి రాయితీలు కావాల’ని అడిగాడు. ‘బీరకాయలు, పొట్లకాయల వంటి తీగలకు పందిళ్లు ఇస్తాం... కానీ నువ్వు పెంచే మొక్కలకు సాధ్యం కాదని, రూల్స్‌ ఒప్పుకోవ’ని అన్నారు.


ఇంతకీ అతను పందిళ్ల మీద పెంచాలనుకున్న మొక్కలు ఏంటో తెలుసా? అమృతవల్లి!! దానినే ‘తిప్పతీగ’ అని కూడా అంటారు.రైతులంతా వరి, చెరుకు పండించి, శరీరాల్లో కార్బొహైడ్రేట్‌లు పెంచుతుంటే, వాటివల్ల వచ్చే షుగర్‌, బీపీలను అదుపు చేసే ఔషధ గుణాలున్న మొక్కలను పెంచాలనుకొని, తొలి ప్రయత్నంలో విఫలం అయ్యాడు ఆ బడుగు రైతు. ప్రభుత్వ రాయితీ అందక పోయినా నిరుత్సాహ పడక, తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ముందుకే సాగాడు...


కృష్ణా జిల్లా, నూజివీడు మండలం, రాట్నాల గూడేనికి చెందిన రైతు పరిమే మరియదాసుకు ప్రాచీన వైద్యవిధానాల మీద మక్కువ. ఆయుర్వేద మందులపై అవగాహన పెంచుకొని, దానికి అవసరమైన మొక్కలను తానే ఎందుకు సాగు చేయకూడదనే భావనతో పాటు ప్రజలకు ఆయుర్వేదంపై అవగాహన కల్పించడం కోసం మందు మొక్కల పెంపకం మొదలు పెట్టాలనుకున్నాడు. కానీ అతడికి సెంటు భూమి కూడా లేదు. ఆయుర్వేదంపై ఆసక్తిని చంపుకోలేక 60 సెంట్ల భూమిని 2017లో కౌలుకు తీసుకొని తిప్ప తీగ పాదులను సేంద్రియ పద్ధతిలో పెంచడం మొదలు పెట్టాడు. నేల మీద పాకించడం వల్ల చాలా మొక్కలు చనిపోయాయి. ఉద్యాన శాఖ రాయితీ కోసం చేసిన ప్రయత్నం ఫలించక పోవడంతో సొంతంగా కర్రలతో పందిళ్లు నిర్మించి సాగు చేస్తున్నాడు.


ఈ మొక్కలో విశేషం ఏమిటి?

తీగజాతి ఔషధ మొక్క తిప్పతీగకు ఆయుర్వేదంలో విశిష్ట స్దానం ఉంది. దీని శాస్త్రీయ నామం ‘టీనొస్పొరా కోర్డి ఫోలియా’. ‘అమృత వల్లి’ అని కూడా పిలుస్తారు. అన్ని సీజన్‌లలో పచ్చగా ఎదుగుతూ, ఇతర చెట్ల ఆసరాతో అల్లుకుపోయే మొక్క ఇది. అడవుల్లో ఎక్కువగా ఎదుగుతుంది. అరుదైన ఔషధగుణాలున్న ఈ మొక్క క్రమంగా అంతరించి పోవడం గమనించిన దాసు దీనిని అన్ని పంటల్లాగే సంప్రదాయ సాగుబడిలోకి తీసుకు వచ్చి కాపాడాలనుకున్నాడు. అటవీ ప్రాంతంలో ఈ తిప్పతీగను సేకరించి తెచ్చి, రెండు గజాల దూరం చొప్పున 60 సెంట్లకు 720 మొక్కలు నాటాడు.


నేలమీద కన్నా పందిరి పైకి పాకిస్తే దిగుబడి ఎక్కువ వస్తుందంటాడు దాసు. ‘‘ఒక చెట్టుకు కనీసం పది కిలోల దిగుబడి వస్తుంది. పది కిలోల తిప్పతీగ నుండి 200 గ్రాముల తిప్ప సత్తు వస్తుంది. 30 వేల పెట్టుబడి అయింది. ఖర్చులన్నీ పోను లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. కిలో తిప్ప సత్తు మార్కెట్‌లో 4 వేల ధర పలుకుతుంది. వర్షం పడినా పడక పోయినా ఈ సాగుకు ఇబ్బంది లేదు. ఎక్కడైనా పెరుగుతుంది. సేంద్రియ ఎరువు వాడితే కాండం బలంగా ఉంటుంది. ఈ తిప్ప తీగను కత్తిరించి పశువులకు ఆహారంగా ఇవ్వడం వల్ల వాటిలో రోగనిరోధక శక్తి పెరిగి అధిక పాలను ఇస్తాయి. పశుసంపద పెరుగుతుంది.’’ అంటాడు దాసు.


తిప్పసత్తు అంటే?

‘‘ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మూలికల్లో ముఖ్యమైనది తిప్పతీగ. మన శరీరంలోని చాలా తిప్పలను తగ్గిస్తుంది. తిప్పతీగలో అంటువ్యాధులను అధిగమించే సహజ సామర్థ్యం ఉంటుంది. అలాగే పేగుల ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. తిప్ప తీగ అకులు ఆయుర్వేదంలో ఉపయోగపడినా కాండం నుండి వచ్చిన గుజ్జును నిలువ చేసుకొని మందుగా ఉపయోగించు కోవచ్చు. తిప్పతీగ కాండాలను చిన్న ముక్కలుగా చేసి, మిక్సీలో అల్లం పేస్ట్‌లాగా తయారు చేసి, ఆ పేస్టుకి నీటిని కలిపి వడకట్టితే, తెల్లని పదార్ధం వస్తుంది. దానినే తిప్పసత్తు అంటారు. రోజూ పది గ్రాములు చొప్పున 3 పూటలా తీసుకోవాలి. షుగర్‌, బీపీలను అదుపులో ఉంచుతుంది.’’ అంటాడు దాసు.


వ్యాధుల నివారణకు...

తిప్పతీగ శరీరానికి సహజమైన రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నివారణ, తగ్గింపునకు కూడా తిప్పతీగ బాగా పనిచేస్తుంది. కీళ్లనొప్పులు, కీళ్లలో మంట తగ్గుతాయి. శరీరం నుంచి విష వ్యర్థాలను తొలగించడానికి కాలేయానికి తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. దీర్ఘకాలిక దగ్గు వంటి వ్యాధుల నుండి కాపాడుతుంది. శ్వాసకోశ వ్యవస్థ శ్లేష్మ పొరను శాంతింపజేస్తుంది, ఉబ్బసం, దగ్గు, జలుబు, టాన్సిల్స్‌, శ్వాసకోశ సమస్యల నుంచి కాపాడుతుంది.


ఆయుర్వేద గ్రంథాలు చదివి వన మూలికల మీద అవగాహన పెంచుకొని వైద్యం కూడా చేస్తున్నాడు ఈ రైతు. దాసు పొలంలో తిప్ప తీగపాదులతో పాటు సరస్వతి, పొడపత్రి, నేల వేము వంటి అపార ఔషధ గుణాలున్న మొక్కలను కూడా పెంచుతున్నాడు. అయిదు ఎకరాలున్న రైతులు మిగతా పంటలతో పాటు, కనీసం అర ఎకరంలో నైనా ఇలాంటి ఔషధ మొక్కలు పెంచితే మనకు సగం వ్యాధులు తగ్గిపోతాయి. ఈ పంటలపై ప్రతీ రైతు అవగాహన పెంచుకోవాలి. సలహాలు కావాల్సిన వారికి శిక్షణ ఇస్తున్నాడు. 

            - శ్యాంమోహన్‌, 9440595858 

Read more